Telugu Global
Sports

నడిపించే నాయకులే చతికిలపడ్డారు.. జట్టుని ముంచేస్తున్న కెప్టెన్ల ఫెయిల్యూర్

వీరంతా ఓపెనింగ్ లేదంటే టాపార్డర్లో బ్యాటింగ్ కి వస్తారు. జట్టుని విజయపథంలో నడిపించే ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేని వీరు మిగిలిన జట్టు సభ్యులకు ఎలా మార్గదర్శకులవుతారు?

నడిపించే నాయకులే చతికిలపడ్డారు.. జట్టుని ముంచేస్తున్న కెప్టెన్ల ఫెయిల్యూర్
X

పొట్టి ప్రపంచ కప్ లో తమ జట్లను నడిపించే నాయకులే చతికిలపడుతున్నారు. తమ ఆటతో టీమ్‌లో స్ఫూర్తి నింపాల్సిన కెప్టెన్లు పేలవ ప్రదర్శనతో నిస్సహాయంగా పెవిలియన్ చేరుతున్నారు. హిట్ మ్యాన్ గా పేరొందిన రోహిత్ శర్మ ఫట్ మని తేలిపోయాడు. దాయాదితో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన పోరులో 7 బంతుల్లో 4 పరుగులు చేసిన రోహిత్ శర్మ బంగ్లాదేశ్ మ్యాచులో 8 బంతుల్లో 2 పరుగులు, దక్షిణాఫ్రికాపై త‌క్కువ స్కోరే చేశాడు. పసికూనలాంటి నెదర్లాండ్స్ జట్టుపై మాత్రమే 53 పరుగులు చేయగలిగాడు. ఫీల్డింగులోనూ వైఫల్యంతో రోహిత్ శర్మ జట్టుకి భారంగా మారాడు.

వరల్డ్ కప్ ముందు తోపు తురుము అంటూ ఆకాశానికెత్తేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ భారత్ పై డకౌట్ అయ్యాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 4 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ పై కూడా 4 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. ఇప్పుడు సౌతాఫ్రికా మ్యాచులో అయితే 15 బంతుల్లో కేవలం ఆరు పరుగులు చేసి ఔటయ్యాడు. సూపర్ 12లో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో కనీసం ఒక్కసారి కూడా రెండంకెల స్కోరును అందుకోలేకపోయాడు.

దక్షిణాఫ్రికా తెంబా బవుమా అయితే బంగ్లాదేశ్‌తో 2 పరుగులు, భారత్ పై 10, పాకిస్తాన్ మీద 36 పరుగులు చేసినా జట్టుని ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. బంగ్లాదేశ్ జట్టుకి నాయకత్వం వహిస్తున్న షకీబ్ అల్ హసన్ దక్షిణాఫ్రికాతో మ్యాచులో 1, నెద‌ర్లాండ్స్ పై 7, జింబాబ్వేపై 23, హోరాహోరీగా భారత్ తో జరిగిన మ్యాచులో 13 పరుగులు చేసి ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గానూ దారుణంగా విఫలమయ్యాడు.

ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ నబీ కూడా నాయకుడిగా తన జట్టుని నడపడంలో విఫలం అయ్యానని ప్రకటించి తప్పుకున్నాడు. కానీ బ్యాటర్ గా దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లాండ్‌ మ్యాచులో 3, శ్రీలంకపై 13, ఆస్ట్రేలియా మీద ఒక పరుగు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్లలో చాలా మంది స్పెషలిస్టు బ్యాట్స్ మెన్లే. కొందరు ఆల్ రౌండర్లూ ఉన్నారు. వీరంతా ఓపెనింగ్ లేదంటే టాపార్డర్లో బ్యాటింగ్ కి వస్తారు. జట్టుని విజయపథంలో నడిపించే ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేని వీరు మిగిలిన జట్టు సభ్యులకు ఎలా మార్గదర్శకులవుతారు?

First Published:  5 Nov 2022 12:41 PM GMT
Next Story