Telugu Global
Sports

ఆంధ్ర వికెట్ కీపర్ కు ప్రమాద ఘంటికలు!

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో భారతజట్టు కు నంబర్ వన్ వికెట్ కీపర్ గా సేవలు అందిస్తున్న ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ భరత్ చోటుకు ముప్పు పొంచి ఉంది.

ఆంధ్ర వికెట్ కీపర్ కు ప్రమాద ఘంటికలు!
X

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో భారతజట్టు కు నంబర్ వన్ వికెట్ కీపర్ గా సేవలు అందిస్తున్న ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ భరత్ చోటుకు ముప్పు పొంచి ఉంది. బ్యాటింగ్ వైఫల్యాలు భరత్ ను తీవ్రఒత్తిడికి గురి చేస్తున్నాయి.

భారత టెస్టుజట్టులోని ప్రతిస్థానానికి ఇద్దరు లేదా ముగ్గురు ప్రతిభావంతులైన ఆటగాళ్లు పోటీపడటం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించిన, సాధిస్తున్న నయావాల్ చతేశ్వర్ పూజారాకే దిక్కులేకుండా పోయింది.

తుదిజట్టులో చోటు కోసం యువవికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్, మిడిలార్డర్ స్థానం కోసం సర్ ఫ్రాజ్ ఖాన్ తో సహా పలువురు యువక్రికెటర్లు ఎదురు చూస్తున్నారు.

రిషభ్ పంత్ గాయం భరత్ కు వరం...

భారత టెస్టు జట్టుకు కొద్దిసంవత్సరాల పాటు అసమాన సేవలు అందించిన ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కారుప్రమాదానికి గురై దూరం కావడం ఆంధ్రప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్ పాలిట వరంగా మారింది. అయితే ..అంది వచ్చిన అవకాశాలను భరత్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేక జట్టుకే అలంకరణగా మారి విమర్శలు కొని తెచ్చుకొంటున్నాడు.

భారత్- ఏ జట్టు తరపున నిలకడగా రాణిస్తూ..అడపాదడపా సెంచరీలు సాధిస్తున్న భరత్ టెస్టుమ్యాచ్ ల్లో మాత్రం బ్యాటర్ గా విఫలంకావడం టీమ్ మేనేజ్ మెంట్ సహనానికి పరీక్షగా మారింది.

ఒక్క హాఫ్ సెంచరీ లేని భరత్...

భరత్ కు స్పెషలిస్ట్ వికెట్ కీపర్ గా మంచి రికార్డే ఉంది. దేశంలోనే నంబర్ వన్ వికెట్ కీపర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. అయితే బ్యాటర్ గా భరత్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. తన జట్టుకు కీలక పరుగులు అందించడంలో విఫలమవుతూ వస్తున్నాడు.

రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ లాంటి యువ వికెట్ కీపర్ బ్యాటర్లు అందుబాటులో లేకపోడంతో భరత్ వైపు భారత టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గు చూపింది. వరుసగా అవకాశాలు కల్పిస్తూ వస్తోంది.

గతేడాది ఆస్ట్ర్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్ లో నాలుగుకు నాలుగు టెస్టులు ఆడే అవకాశం భరత్ కు దక్కింది. నాలుగు టెస్టుల్లో 44 పరుగుల అత్యధిక స్కోరుతో కేవలం 101 పరుగులు మాత్రమే సాధించగలిగాడు.

ఆస్ట్ర్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో సైతం భరత్ 5, 23 పరుగుల స్కోర్లకే అవుటయ్యాడు.

అంతేకాదు..ఇంగ్లండ్ తో జరుగుతున్న ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రండుటెస్టుల్లోనూ భరత్ మిడిలార్డర్ బ్యాటర్ గా తేలిపోయాడు. ఇప్పటి వరకూ అరడజను టెస్టుమ్యాచ్ లు ఆడినా కనీసం ఒక్క అర్థశతకమైనా సాధించలేకపోడం భరత్ వైఫల్యాలకు పరాకాష్టగా నిలిచింది.

ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండు టెస్టులు, నాలుగు ఇన్నింగ్స్ లో సైతం భరత్ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయాడు. హోంగ్రౌండ్ విశాఖ వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ లో ఆడే అరుదైన అవకాశం దక్కినా కనీసం హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు.

భరత్ పై మంజ్రేకర్ విమర్శలు...

భారతజట్టుకు ఏమాత్రం ఉపయోగపడని భరత్ నే పట్టుకొని టీమ్ మేనేజ్ మెంట్ ఎందుకు వేలాడుతుందో తనకు ఇప్పటికీ అంతుపట్టడం లేదని క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ విరుచుకు పడ్డారు.

భరత్ చిన్నవయసులో లేడని, 30 ఏళ్ల క్రికెటర్ వరుసగా విఫలమవుతున్నా ఎందుకు కొనసాగిస్తున్నారంటూ ఎంపిక సంఘాన్ని నిలదీశాడు. భరత్ కు బదులుగా

ఇషాన్ కిషన్ లాంటి యువ వికెట్ కీపర్ బ్యాటర్లను ఆడిస్తే జట్టుకు ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత భారతటెస్టు జట్టులో రెండో వికెట్ కీపర్ బ్యాటర్ గా ధృవ్ జురెల్ సైతం తనవంతు కోసం ఎదురుచూస్తున్నాడు.

రాజ్ కోట వేదికగా ఈనెల 15 నుంచి జరిగే కీలక మూడోటెస్టులో భరత్ ను పక్కనపెట్టి యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ కు చోటు కల్పించాలన్న డిమాండ్ సైతం వినిపిస్తోంది.

కారు ప్రమాదం గాయాల నుంచి కోలుకొని పూర్తి ఫిట్ నెస్ కోసం తంటాలు పడుతున్న రిషభ్ పంత్ తిరిగి అందుబాటులోకి వస్తే కీలక పరుగులు అందించే వికెట్ కీపర్ బ్యాటర్ లేని లోటును భారత్ భర్తీ చేసుకోగలుగుతుంది.

విదేశీగడ్డపై భారత్ టెస్టు విజయాలు సాధించడం వెనుక రిషభ్ పంత్ బ్యాటింగ్ ప్రతిభ ఎంతో ఉంది. ఇంగ్లండ్ ను ఇంగ్లండ్ గడ్డపైన, ఆస్ట్ర్రేలియాను బ్రిస్బేన్ టెస్టులో భారత్ చిత్తు చేయడంలో రిషభ్ పంత్ పాత్ర మరువలేనిదని సంజయ్ మంజ్రేకర్ గుర్తు చేశాడు. వికెట్ కీపర్ గా మాత్రమే కాదు..బ్యాటర్ గానూ రిషభ్ పంత్ లాంటి క్రికెటర్లు మాత్రమే భారత్ కు అవసరమని..భరత్ లాంటి పరుగులు సాధించలేని బ్యాటర్ లను పట్టుకొని వేలాడటంలో అర్థమే లేదని మంజ్రేకర్ తేల్చి చెప్పాడు.

భారతజట్టులో భరత్ చోటు, భవితవ్యం కేవలం భరత్ చేతిలో మాత్రమే ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  10 Feb 2024 2:45 AM GMT
Next Story