Telugu Global
Sports

యాషెస్ సిరీస్ లో నేటినుంచే కీలక సమరం!

2023- యాషెస్ (ఐదుమ్యాచ్ ల) సిరీస్ లోని రెండోటెస్టుకు క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం వేదికగా ఈ రోజు తెరలేవనుంది.

యాషెస్ సిరీస్ లో నేటినుంచే కీలక సమరం!
X

యాషెస్ సిరీస్ లో నేటినుంచే కీలక సమరం!

చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్‌ - ఆస్ట్రేలియా జట్ల ఐదుమ్యాచ్ ల యాషెస్‌ సిరీస్‌లో నేడు కీలక రెండోటెస్టు లార్డ్స్ వేదికగా ప్రారంభంకానుంది. ఆతిథ్య ఇంగ్లండ్ కు ఈ పోరు డూ ఆర్ డై గా మారింది.

2023- యాషెస్ (ఐదుమ్యాచ్ ల) సిరీస్ లోని రెండోటెస్టుకు క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియం వేదికగా ఈ రోజు తెరలేవనుంది. గతవారం ముగిసిన తొలిటెస్టులో 2 వికెట్ల తో సంచలన విజయం సాధించిన ఆస్ట్ర్రేలియా వరుసగా రెండో విజయంతో సిరీస్ పై పట్టుబిగించాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు..తొలిటెస్టు ఓటమితో కంగుతిన్న ఇంగ్లండ్ మాత్రం తన విజయాల అడ్డా లార్డ్స్ మైదానంలో కంగారూలను దెబ్బకు దెబ్బతీయాలన్న కసితో పోటీకి దిగుతోంది.

పేస్ బౌలర్ల సమరం...

తొలి టెస్టు ఓటమితో కంగుతిన్న బజ్ బాల్ టీమ్ ఇంగ్లండ్‌.. రెండో టెస్టులో పుంజుకొనితీరాలన్న పట్టుదలతో పోటీకి దిగుతోంది.తన విజయాల అడ్డా లార్డ్స్ పిచ్ ..పేస్, స్వింగ్ బౌలర్లకు మ్యాచ్ జరిగే ఐదురోజులూ అనుకూలించే అవకాశం ఉండడంతో రెండుజట్ల పేస్, స్వింగ్ బౌలర్లు కీలకం కానున్నారు.

బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు మొత్తం 5గురు పేసర్లతో కంగారూల పనిపట్టాలన్న లక్ష్యంతో ఉంది.

ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ మోయిన్ అలీని పక్కనపెట్టి తుదిజట్టులోకి యువఫాస్ట్ బౌలర్ జోష్‌ టంగ్‌కి చోటు కల్పించారు. దీంతో ఈ మ్యాచ్‌ ద్వారా రెండోసారి టెస్ట్ మ్యాచ్ బరిలోకి టంగ్ దిగనున్నాడు. కౌంటీ క్రికెట్లో అంచనాలకు మించి రాణించడం ద్వారా ఇంగ్లండ్ టెస్టు జట్టులో చోటు సంపాదించిన జోష్ టంగ్ టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ ప్రారంభ ఓవర్లలో వికెట్లు పడగొట్టడం పైనే ఇంగ్లండ్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

'బజ్ బాల్ 'ను వీడేది లేదు- బెన్ స్టోక్స్...

ఐదురోజులపాటు జిడ్డాటగా సాగే టెస్టు క్రికెట్ ను వినోదాత్మకంగా మార్చడం కోసం ఇంగ్లండ్ కోచ్ బజ్ బాల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఆత్మరక్షణ వ్యూహాన్ని పక్కనపెట్టి దూకుడుగా ఆడే వ్యూహంతో ప్రత్యర్థులను బిత్తరపోయేటట్లు చేస్తున్న ఇంగ్లండ్ జట్టు ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టులో మాత్రం 2 వికెట్ల పరాజయం చవిచూసింది.

తొలిటెస్టులో తమకు ఓటమి ఎదురైనా బజ్ బాల్ తరహా క్రికెట్ ను వీడే ప్రసక్తేలేదని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పష్టం చేశాడు. ఒక్కమ్యాచ్ లో ఓడినంత మాత్రాన ఆటతీరును ఎలా మార్చుకొంటామంటూ ప్రశ్నించాడు.

ఆత్మవిశ్వాసంతో ఆస్ట్ర్రేలియా...

ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన తొలిటెస్టులో ఓటమి అంచుల నుంచి బయటపడి..2 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన ఆస్ట్ర్రేలియా

ఐదుమ్యాచ్ ల సిరీస్ లో 1-0తో ఆధిక్యం సంపాదించిన ఆస్ట్ర్రేలియా బ్యాక్ టు బ్యాక్ విజయాలకు గురిపెట్టింది. డాషింగ్ ఓపెనర్ ఉస్మాన్‌ ఖ్వాజా ఫుల్‌ ఫామ్‌లో ఉండగా.. స్మిత్‌, వార్నర్‌, లబుషేన్‌, గ్రీన్‌, ట్రావిస్ హెడ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. ఆస్ట్ర్రేలియా నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్ బౌలర్ తో పోటీకి దిగుతోంది.

First Published:  28 Jun 2023 6:45 AM GMT
Next Story