Telugu Global
Sports

ఆస్ట్రేలియా అవుట్ - ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లండ్!

శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సాధించడంతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి వైదొలిగింది. సూపర్ -12 గ్రూప్ -1 రౌండ్ నుంచి గతేడాది రన్నరప్ న్యూజిలాండ్, మాజీ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకోగలిగాయి.

ఆస్ట్రేలియా అవుట్ - ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లండ్!
X

టీ-20 ప్రపంచకప్‌లో అతి పెద్ద సంచలనం నమోదయ్యింది. శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సాధించడంతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి వైదొలిగింది. సూపర్ -12 గ్రూప్ -1 రౌండ్ నుంచి గతేడాది రన్నరప్ న్యూజిలాండ్, మాజీ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకోగలిగాయి.

సొంతగడ్డపై జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ నాకౌట్ రౌండ్‌కు చేరుకోవ‌డంలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా విఫలమైంది. సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రోజు ముగిసిన సూపర్ -12 గ్రూప్ -1 ఆఖరి రౌండ్ పోరులో ఇంగ్లండ్ 4 వికెట్లతో శ్రీలంకను ఓడించడంతో కంగారూ టీమ్ నిష్క్రమించ‌క‌ తప్పలేదు.

పోరాడి నెగ్గిన ఇంగ్లండ్...

న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లతో కూడిన గ్రూప్ -1 రౌండ్ నుంచి ఇప్పటికే న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగా...సెమీస్ రెండో బెర్త్ కోసం..ఆతిథ్య ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు పోటీపడ్డాయి.

ఆఖరి రౌండ్ మ్యాచ్‌ల్లో అప్ఘనిస్థాన్‌ను 4 పరుగులతో అధిగమించడం ద్వారా ఆస్ట్రేలియా రేసులో నిలువగలిగింది. మరో ఆఖరి రౌండ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై శ్రీలంక నెగ్గితే..ఆస్ట్రేలియాకు సెమీస్ బెర్త్ ఖాయమై ఉండేది. కానీ తుది వరకూ పోరాడి ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గడం ద్వారా నాకౌట్ రౌండ్ చేరుకోగలిగింది.

శ్రీలంకకు ఇంగ్లండ్ పగ్గాలు..

సెమీస్ చేరాలంటే నెగ్గితీరాల్సిన ఈ ఆఖరి రౌండ్ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన మాజీ చాంపియన్ శ్రీలంకను ఇంగ్లండ్ 141 పరుగులకే కట్టడి చేసింది. శ్రీలంక ఓపెనర్ నిస్సంక 67, మిడిలార్డర్ ఆటగాడు రాజపక్స 22 పరుగులు మినహా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు, స్ట్రోక్స్, వోక్స్, కరెన్, రషీద్ తలో వికెట్ పడగొట్టారు.

శ్రీలంకను నిలువరించిన స్టోక్స్..

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 142 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్- హేల్స్ జోడీ 7.2 ఓవర్లలో 75 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ బట్లర్ 28, హేల్స్ 47 పరుగులకు ఒకరి వెనుక ఒకరుగా అవుట్ కావడంతో శ్రీలంక పట్టు బిగించగలిగింది. మిడిలార్డర్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్ 4, లైమ్ లివింగ్ స్టన్ 4, మోయిన్ అలీ 1, సామ్ కరెన్ 6 పరుగులకు పెవిలియన్ దారి పట్టినా...బెన్ స్టోక్స్ ఒంటరి పోరాటం చేసి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. స్టోక్స్ 36 బంతుల్లో 2 బౌండ్రీలతో 42 పరుగులు, వోక్స్ 5 పరుగులతో అజేయంగా నిలవడంతో ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగుల స్కోరుతో 4 వికెట్ల విజయంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది.

గ్రూప్ -1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీస్ చేరుకోగా..గ్రూప్ -2 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ సెమీస్ చేరుకొనే అవకాశాలున్నాయి. ఆదివారం జరిగే ఆఖరి రౌండ్ పోటీలలో జింబాబ్వేతో భారత్, నెదర్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా పోటీపడాల్సి ఉంది. భారత్, దక్షిణాఫ్రికాజట్లు తమ ఆఖరి రౌండ్ మ్యాచ్‌ల్లో నెగ్గితే సెమీస్ చేరుకోగలుగుతాయి. అప్పుడు పాకిస్థాన్ సైతం టోర్నీ నుంచి నిష్క్రమించ‌క‌ తప్పదు.

First Published:  5 Nov 2022 12:50 PM GMT
Next Story