Telugu Global
Sports

రికార్డుల మోతతో వన్డే ప్రపంచకప్ షురూ!

2023 -ఐసీసీ వన్డే ప్రపంచకప్ రికార్డుల మోతతో ప్రారంభమయ్యింది.ఇంగ్లండ్- న్యూజిలాండ్ జట్ల ప్రారంభమ్యాచ్ లో 27 సంవత్సరాల రికార్డు తుడిచిపెట్టుకు పోయింది.

రికార్డుల మోతతో వన్డే ప్రపంచకప్ షురూ!
X

2023 -ఐసీసీ వన్డే ప్రపంచకప్ రికార్డుల మోతతో ప్రారంభమయ్యింది.ఇంగ్లండ్- న్యూజిలాండ్ జట్ల ప్రారంభమ్యాచ్ లో 27 సంవత్సరాల రికార్డు తుడిచిపెట్టుకు పోయింది..

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ తొలిమ్యాచ్ లోనే రికార్డుల మోత మోగింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ సంచలన విజయంతో శుభారంభం చేసింది.

కివీ టాపార్డర్ 'టాప్ గేర్'!

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ తొలిపోరులో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ను చిత్తు చేసింది.

ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 282 పరుగుల స్కోరుకే పరిమితమయ్యింది.

సమాధానంగా ..న్యూజిలాండ్ విజయలక్ష్యాన్ని 36.2 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ నష్టానికే సాధించింది. ఓపెనర్ డేవన్ కాన్వే 121 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 152 పరుగులు, యువఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 పరుగుల స్కోర్లతో అజేయంగా నిలిచారు.

ఈ ఇద్దరూ 2వ వికెట్ కు 273 పరుగుల అన్ బీటెన్ పార్ట్నర్ షిప్ తో చెలరేగిపోయారు. రచిన్ రవీంద్ర కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

రచిన్ రవీంద్ర సరికొత్త రికార్డు...

న్యూజిలాండ్ జట్టులోని భారత సంతతి ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర..ప్రపంచకప్ అరంగేట్రం మ్యాచ్ లోనే అజేయ శతకం బాదిన మొనగాడిగా నిలిచాడు. ఓపెనర్ డేవన్ కాన్వేతో కలసి రెండో వికెట్ కు 273 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంలో రచిన్ కీలకపాత్ర పోషించాడు. 23 సంవత్సరాల రచిన్ ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్ ను చీల్చి చెండాడు. గ్రౌండ్ నలుమూలలకూ బౌండ్రీలు, సిక్సర్ల షాట్లతో మోత మోగించాడు.

మొత్తం 11 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 123 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కేవలం 96 బంతుల్లోనే ఈ స్కోరు నమోదు చేశాడు. 23 సంవత్సరాల 301 రోజుల వయసులో ప్రపంచకప్ సెంచరీ సాధించిన కివీ బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు.

1996 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ తరపున నేథన్ ఆస్టిల్ సాధించిన 24 రోజుల 132 రోజుల శతకాన్ని రచిన్ రవీంద్ర తెరమరుగు చేశాడు.

83 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన రచిన్..2015 ప్రపంచకప్ లో కివీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 88 బంతుల్లో సాధించిన సెంచరీ రికార్డును సైతం అధిగమించగలిగాడు.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో శతకం బాదిన 13వ అత్యంత పిన్నవయస్కుడైన బ్యాటర్ గా, ప్రపంచకప్ అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన 18వ బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ పోరులో భాగంగా ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే రెండోమ్యాచ్ లో పాకిస్థాన్ తో నెదర్లాండ్స్ తలపడనుంది.

First Published:  6 Oct 2023 3:00 AM GMT
Next Story