Telugu Global
Sports

భారత జుడోకాల తడాఖా! కామన్వెల్త్ గేమ్స్ 4వ‌ రోజున 3 పతకాలు

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న 2022 కామన్వెల్త్ గేమ్స్ మొద‌టి నాలుగు రోజుల పోటీలు ముగిసే సమయానికి భారత్ మొత్తం 9 పతకాలతో పతకాల పట్టిక ఆరో స్థానంలో కొనసాగుతోంది.

భారత జుడోకాల తడాఖా!  కామన్వెల్త్ గేమ్స్ 4వ‌ రోజున 3 పతకాలు
X


కామన్వెల్త్ గేమ్స్ నాలుగో రోజు పోటీలలో భారత అథ్లెట్లు మరో మూడు పతకాలు సాధించారు. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న 2022 కామన్వెల్త్ గేమ్స్ మొద‌టి నాలుగు రోజుల పోటీలు ముగిసే సమయానికి భారత్ మొత్తం 9 పతకాలతో పతకాల పట్టిక ఆరో స్థానంలో కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ మిక్సిడ్ టీమ్ ఫైనల్స్ చేరడం ద్వారా భారత జట్టు స్వర్ణ పతకానికి చేరువైంది. పురుషుల హాకీ గ్రూప్ లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య గ్రేట్ బ్రిటన్ తో జరిగిన హోరాహోరీ పోరును భారత్ 4-4 గోల్స్ తో డ్రాగా ముగించింది.మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో హర్జిందర్ కౌర్ భారత్ కు కాంస్య పతకం సంపాదించి పెట్టింది. బ్యాడ్మింటన్ మిక్సిడ్ టీమ్ ఫైనల్స్, టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ ఫైనల్స్ కు చేరడం ద్వారా భారత జట్టు రజత పతకం ఖాయం చేసుకోగలిగింది.

జూడోలో రెండు పతకాలు..

నాలుగో రోజు పోటీలలో భాగంగా జరిగిన జూడో పురుషుల, మహిళల విభాగాలలో భారత్ కు రెండు రజత పతకాలు దక్కాయి. మహిళల 48 కిలోల విభాగంలో సుశీలాదేవి లికమబమ్ రజత పతకంతో సరిపెట్టుకొంది. బంగారు పతకం కోసం దక్షిణాఫ్రికాకు చెందిన మిషేలా వైట్ బూయ్ తో జరిగిన పోరులో సుశీలాదేవి పోరాడి ఓడింది. పురుషుల 60 కిలోల విభాగంలో భారత జుడోకా విజయ్ కుమార్ యాదవ్ కాంస్య పతకం సాధించాడు.

హర్జిందర్ కౌర్ కు కాంస్య

మహిళల వెయిట్ లిఫ్టింగ్ 71 కిలోల విభాగంలో భారత లిఫ్టర్ హర్జిందర్ కౌర్ 212 కిలోల బరువెత్తి కంచు పతకం సాధించింది. హర్జిందర్ స్నాచ్ లో 93 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ లో 119 కిలోల బరువెత్తడం ద్వారా పతకం అందుకోగలిగింది.


టీటీ టీమ్ ఫైనల్లో భారత్..

టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ ఫైనల్స్ కు భారత్ చేరుకొంది. తెలుగుతేజం శరత్ కమల్, సత్యన్ లాంటి మేటి ఆటగాళ్లతో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో నైజీరియాను చిత్తు చేయడం ద్వారా గోల్డ్ మెడల్ రౌండ్లో అడుగుపెట్టింది. మొత్తం 5 మ్యాచ్ ల సెమీస్ లో భారత్ మొదటి మూడు మ్యాచ్ లు నెగ్గడం ద్వారా 3-0తో టైటిల్ సమరానికి సిద్ధ‌మైంది.

బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్

బ్యాడ్మింటన్ మిక్సిడ్ టీమ్ ఫైనల్స్ కు సింధు, కిడాంబీ శ్రీకాంత్, లక్ష్యసేన్, సాయి చిరాగ్ లతో కూడిన భారత జట్టు అలవోకగా ఫైనల్స్ చేరింది. సెమీఫైనల్లో సింగపూర్ ను 3-0తో భారత్ చిత్తు చేసింది. గోల్డ్ మెడల్ రౌండ్లో మలేసియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల సింగిల్స్ లో సింధు, పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్, మిక్సిడ్ డబుల్స్ లో సాయి చిరాగ్- అశ్వని విజయాలు నమోదు చేయడంతో భారత్ వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరుకోగలిగింది.

లాన్ బౌల్స్ ఫైనల్లో తొలిసారి...

లాన్ బౌల్స్ మహిళ టీమ్ ఫైనల్స్ కు భారత జట్టు తొలిసారిగా చేరుకోడం ద్వారా సంచలనం సృష్టించింది. సెమీఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్ ను ఓడించడం ద్వారా రజత పతకం ఖాయం చేసుకొంది. పురుషుల బాక్సింగ్ ఫ్లయ్ వెయిట్ విభాగంలో అమిత్ పంగల్, ఫెదర్ వెయిట్ విభాగంలో హుసాముద్దీన్ మహ్మద్ క్వార్టర్ ఫైనల్స్ రౌండ్లో అడుగుపెట్టారు.

సౌరవ్ గెలుపు- జోత్స్న ఓటమి...

స్క్వాష్ పురుషుల, మహిళల సింగిల్స్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్కాట్లాండ్ ఆటగాడు గ్రెగ్ లోబాన్ ను సౌరవ్ గోశాల్ ఓడించగా...మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోనే కెనడాకు చెందిన హోలీ నాటాన్ చేతిలో జోత్స్న పరాజయం చవిచూసింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 81 కిలోల విభాగంలో అజయ్ సింగ్ నాలుగో స్థానంలోనూ, జిమ్నాస్టిక్స్ వాల్ట్ విభాగంలో ప్రణతి నాయక్ 5వ స్థానంలో నిలిచారు.

పురుషుల హాకీలో చేజారిన గెలుపు..

పురుషుల హాకీ గ్రూప్-బీ కీలక సమరంలో భారత్ నెగ్గాల్సిన మ్యాచ్ ను డ్రాతో సరిపెట్టుకొంది. ఆతిథ్య ఇంగ్లండ్ తో జరిగిన హోరాహోరీ సమరాన్ని 4-4 గోల్స్ తో డ్రాగా ముగించింది. ఒకదశలో 4-1 గోల్స్ తో పైచేయి సాధించిన భారత్...ఆ తర్వాత ప్రత్యర్థికి వరుసగా మూడుగోల్స్ సమర్పించుకోడం ద్వారా పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. భారత ఆటగాళ్లలో లలిత్ ఉపాధ్యాయ 1 గోల్, మన్ దీప్ సింగ్ 2 గోల్స్, హర్మన్ ప్రీత్ సింగ్ ఒక గోలు సాధించారు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో నిక్ బండూరాక్ 2 గోల్స్, ఫిల్ రోపెర్, లయమ్ యాన్సెల్ చెరోగోల్ సాధించడం ద్వారా తమ జట్టు ఓటమిని తప్పించారు. గ్రూప్ లీగ్ ప్రారంభ మ్యాచ్ లో ఘనాను 11-0 గోల్స్ తో చిత్తు చేసిన భారత్...రెండో మ్యాచ్ ను మాత్రం డ్రాతో ముగించాల్సి వచ్చింది.

మొదటి నాలుగు రోజుల పోటీలు ముగిసే సమయానికి భారత్ మూడేసి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు చొప్పున సాధించి..పతకాల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

First Published:  2 Aug 2022 6:48 AM GMT
Next Story