Telugu Global
Sports

బంగారు పతకం వెనుక వెతలు! ట్రిపుల్ జంపర్ పాల్..కమాల్!

కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ విన్నర్ ఎల్దోసీ పాల్ జీవితం దేశంలోని కోట్లాదిమంది యువతకు స్ఫూర్తిగా, ప్రేరణగా నిలిచిపోతుంది.

బంగారు పతకం వెనుక వెతలు! ట్రిపుల్ జంపర్ పాల్..కమాల్!
X

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా...కేంద్ర , రాష్ట్ర్రాలలో ప్రభుత్వాలు మారుతున్నా పేదరికం ఒడి నుంచే బంగారు పతక విజేతలు పుట్టుకువస్తున్నారు.

బర్మింగ్ హామ్ లో ఇటీవలే ముగిసిన 2022 కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు సాధించిన మొత్తం 22 బంగారు పతక విజేతల వెనుక ఎన్నో వెతలు ఉన్నాయి.

ప్రాంతాలు, రాష్ట్ర్రాలు, కులాలు, మతాలు వేరైనా పేదరికం మూలాల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అసలు సిసలు విజేతల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ, ఒక్కో వ్యధ.

Advertisement

పేదరికమే ప్రేరణగా....

ఏడున్నర దశాబ్దాల కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పురుషుల ట్రిపుల్ జంప్ లో భారత్ తరపున బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్ ఎల్దోసీ పాల్ రెక్కాడితే కానీ డొక్కాడని ఓ దినసరి కూలీ కుటుంబం నుంచి వెలుగులోకి వచ్చాడు.

పీటీ ఉష, అంజు బాబీ జార్జి, షైనీ విల్సన్, వల్సమ్మ,సురేశ్ బాబు లాంటి ఎందరో గొప్పగొప్ప అథ్లెట్లను అందించిన కేరళలోని ఎర్నాకుళం సమీపంలోని పంపకుడా ప్రాంతానికి చెందిన ఎల్దోసీ పాల్..ఐదు సంవత్సరాల చిరుప్రాయంలోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటే...అమ్మమ్మ మరియమ్మ

Advertisement

పెంపకంలో పెరిగాడు.

కడుపునిండా రెండోపూట తిండికి లేని ఎల్దోసీ పాల్.. కష్టాలు, కన్నీళ్లతో సహవాసం చేస్తూ ఎదిగాడు. తన కుటుంబాన్ని పట్టిపీడిస్తున్న పేదరికాన్ని, దరిద్రాన్ని జయించడానికి అథ్లెటిక్స్ నే మార్గంగా, ఆయుధంగా చేసుకొన్నాడు.

మెరుపువేగం, అపారమైన శక్తిని ఒంటినిండా నింపుకొన్న పాల్ జూనియర్ స్థాయి నుంచే మంచి ట్రిపుల్ జంపర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. అయితే..ట్రిపుల్ జంపర్లకు ఉండాల్సిన ఒడ్డు,పొడుగు లేకపోడం ప్రతిబంధకంగా మారింది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించే కళాశాలల్లో..స్పోర్ట్స్ కోటా ద్వారా సీటు సంపాదించడానికి పాల్ పడిన పాట్లు అన్నీఇన్నీకావు.

కొత్తమంగళం నుంచి బర్మింగ్ హామ్ వరకూ...

పాల్ ఓ వైపు ట్రిపుల్ జంప్ లో రాణిస్తూనే మరోవైపు చదువును కొనసాగిస్తూ డిగ్రీస్థాయికి ఎదిగాడు. మేటి అథ్లెట్లకు చిరునామాగా నిలిచిన కొత్తమంగళంలోని మార్ అథనాసియస్ కళాశాలలో బీఎస్సీ కోర్సులో చేరటానికి స్పోర్ట్స్ కోటాలో సీటు సంపాదించాడు. ప్రారంభంలో పాల్ ను చూసిన ఆ కళాశాల ప్రధాన శిక్షకుడు జోసెఫ్

పెదవి విరిచారు.

ట్రిపుల్ జంపర్ కు కావాల్సిన కనీస ఎత్తు లేని పాల్ ఏవిధంగా రాణించగలడంటూ సందేహం వ్యక్తం చేశారు. కళాశాల స్థాయి పోటీలలో 13.40 మీటర్ల దూరం గెంతిన

పాల్ ఆ తర్వాతి ఏడాది నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.

ప్రధాన శిక్షకుడు జోసెఫ్ శిక్షణలో రాటుదేలిన పాల్ ఆ తర్వాతి నాలుగేళ్లలోనే తన స్థాయిని 15 మీటర్ల రికార్డుకు పెంచుకొన్నాడు. అంతర్జాతీయస్థాయి ట్రిపుల్ జంపర్ కు కావాల్సిన ఒడ్డుపొడుగు లేమిని అపారమైన శక్తి, మెరుపువేగంతో అధిగమించాడు. 16 మీటర్ల రికార్డును అందుకోడం ద్వారా భారత నౌకాదళంలో ఉద్యోగం సంపాదించాడు.

బర్మింగ్ హామ్ లో గోల్డెన్ జంప్...

బెంగళూరులోని సోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రంలో సాధన చేసిన పాల్ కు కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనే భారతజట్టులో చోటు దక్కింది. ఏమాత్రం అంచనాలు లేకుండా పోటీకి దిగిన పాల్ ..రికార్డుస్థాయిలో 17.3 మీటర్ల రికార్డుతో బంగారు పతకం సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్ ట్రిపుల్ జంప్ లో స్వర్ణపతకం సాధించిన భారత తొలి అథ్లెట్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన తర్వాత్వే ఎల్దోసీ పాల్ పేరు భారత క్రీడాభిమానులకు తెలిసి వచ్చింది.

ఇటీవలే భారత నౌకాదళంలో ఉద్యోగం సంపాదించిన ఎల్దోసీ పాల్ కు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకం విజయంతో 20 లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతి అందనుంది. ఆ మొత్తంతో తన కుటుంబం అవసరాలను తీర్చుతానని, తన తండ్రిని కూలీ పనులు చేయటం మాన్పిస్తానని పాల్ చెబుతున్నాడు.

2022 కామన్వెల్త్ గేమ్స్ లో కేరళ తరపున భారత్ కు పతకం సాధించి పెట్టిన ఏకైక అథ్లెట్ 25 ఏళ్ల ఎల్దోసీ పాల్ మాత్రమే.

తన శిష్యుడు పాల్ సాధించిన బంగారు పతకం విజయాన్ని చూసి 76 సంవత్సరాల ద్రోణాచార్య అవార్డు గ్రహీత జోసెఫ్ మురిసిపోతుంటే..తమ ఆలనాపాలనలో పెరిగిన

బిడ్డను చూసి నాన్న, అమ్మమ్మ పొంగిపోతున్నారు.

కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ విన్నర్ ఎల్దోసీ పాల్ జీవితం దేశంలోని కోట్లాదిమంది యువతకు స్ఫూర్తిగా, ప్రేరణగా నిలిచిపోతుంది.

Next Story