Telugu Global
Sports

ఎనిమిది ఫైనల్స్...ఐదు టైటిల్స్...ఇదీ భారత రికార్డు!

జూనియర్ ( అండర్ -19 ) ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా తిరుగులేని రికార్డు కలిగిన భారత్...ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది.

ఎనిమిది ఫైనల్స్...ఐదు టైటిల్స్...ఇదీ భారత రికార్డు!
X

అండర్ -19 ప్రపంచకప్ లో భారత్ ను విశ్వవిజేతగా నిలిపిన ఘనత విరాట్ కొహ్లీతో కలిపి కేవలం ఐదుగురు క్రికెటర్లకు మాత్రమే ఉంది.

జూనియర్ ( అండర్ -19 ) ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా తిరుగులేని రికార్డు కలిగిన భారత్...ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది.

సౌతాఫ్రికా వేదికగా ఈరోజు జరిగే 2024 ప్రపంచకప్ టోర్నీఫైనల్లో భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మాత్రమే కాదు..హాట్ ఫేవరెట్ గాను టైటిల్ వేటకు దిగుతోంది.

గత 15 ప్రపంచకప్ టోర్నీలలో భారత్ ను విజేతగా నిలిపిన కెప్టెన్లు కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు.

1988లో ప్రారంభమైన తొలి అండర్ -19 ప్రపంచకప్ టోర్నీ నుంచి 2022లో ముగిసిన 15వ ప్రపంచకప్ టోర్నీ వరకూ భారత్ రికార్డుస్థాయిలో ఎనిమిదిసార్లు ఫైనల్స్ చేరుతూ వచ్చింది. ఇందులో గత ఐదు ప్రపంచకప్ టోర్నీలలోనూ భారత్ ఫైనల్స్ చేరడం ద్వారా తన రికార్డును తానే అధిగమించింది.

మహ్మద్ కైఫ్ నుంచి యాష్ ధుల్ వరకూ...

అండర్ -19 ప్రపంచకప్ లో భారత్ 1988 నుంచి పాల్గొంటూ వస్తున్నా తొలి టైటిల్ కోసం 2000 టోర్నీ వరకూ వేచిచూడాల్సి వచ్చింది. శ్రీలంక వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్ లో మహ్మద్ కైఫ్ నాయకత్వంలో భారత్ ప్రపంచకప్ గెలుచుకోగలిగింది. సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ సైతం ఈ జట్టులో సభ్యుడే కావడం విశేషం.

ఆ తర్వాత ఎనిమిదేళ్లకు విరాట్ కొహ్లీ కెప్టెన్ గా భారత్ 2008 ప్రపంచకప్ ను కైవసం చేసుకోగలిగింది.

2012 ప్రపంచకప్ లో ఓపెనర్ ఉన్ముక్త్ చంద్ నాయకత్వంలో పోటీకి దిగిన భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. 2018 ప్రపంచకప్ లో పృథ్వీ షా, 2022 ప్రపంచకప్ లో యాష్ ధుల్ కెప్టెన్లుగా పాల్గొన్న భారత్ మరో రెండుసార్లు విజేతగా నిలవడం ద్వారా ఐదుసార్లు ప్రపంచ టైటిల్ అందుకొన్న ఏకైక జట్టుగా రికార్డుల్లో చేరింది.

అంతేకాదు..2022 ప్రపంచకప్ వరకూ అత్యధికంగా 89 మ్యాచ్ లు ఆడి 69 విజయాలు సాధించిన ఏకైకజట్టు భారత్ మాత్రమే.

ఉదయ్ సహ్రాన్ నాయకత్వంలో ప్రస్తుత ప్రపంచకప్ వేట....

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ప్రస్తుత (2024 ) ప్రపంచకప్ టోర్నీ లీగ్ దశలో తిరుగులేని విజయాలతో టాపర్ గా నిలిచిన భారత్..సూపర్ -6 రౌండ్లో న్యూజిలాండ్, నేపాల్ జట్లను సైతం చిత్తు చేయడం ద్వారా సెమీస్ లో అడుగుపెట్టింది.

హోరాహోరీగా సాగిన తొలి సెమీఫైనల్లో భారత్ 2 వికెట్ల తేడాతో ఆతిధ్య దక్షిణాఫ్రికాను అధిగమించడం ద్వారా వరుసగా ఐదోసారి ఫైనల్ కు అర్హత సంపాదించింది.

ఈరోజు జరిగే టైటిల్ పోరులో మూడుసార్లు విన్నర్ ఆస్ట్ర్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

అంతర్జాతీయ క్రికెట్ కు వారథిగా...

19 సంవత్సరాల లోపు వయసున్న క్రికెటర్ల కోసం ఐసీసీ నిర్వహిస్తున్న ఈ ప్రపంచకప్ పోటీలు అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించడానికి ప్రతిభావంతులైన యువక్రికెటర్లకు వారథిగా, వేదికగా ఉపయోగపడుతున్నాయి.

జూనియర్ ప్రపంచకప్ వేదికగా యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, కేన్ విలియమ్స్ సన్, వెయిన్ పార్నెల్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జో రూట్, ఎయిడెన్ మర్కరమ్, మిషెల్ మార్ష్, యశస్వి జైశ్వాల్, రవి బిష్నోయ్, తిలక్ వర్మ, ధృవ్ జురెల్ లాంటి స్టార్ ప్లేయర్లు ప్రపంచక్రికెట్లోకి దూసుకువచ్చినవారే.

ప్రస్తుత ప్రపంచకప్ లోనూ భారత్ విజేతగా నిలువగలిగితే ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచిన తొలి, ఏకైకజట్టుగా నిలిచిపోతుంది.

First Published:  11 Feb 2024 3:00 AM GMT
Next Story