Telugu Global
Sports

రిషబ్ పంత్ కు డబుల్ సర్జరీ!

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యువక్రికెటర్ రిషభ్ పంత్ కు జంట ఆపరేషన్లు నిర్వహించాలని డాక్టర్లు నిర్ణయించారు.

రిషబ్ పంత్ కు డబుల్ సర్జరీ!
X

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యువక్రికెటర్ రిషభ్ పంత్ కు జంట ఆపరేషన్లు నిర్వహించాలని డాక్టర్లు నిర్ణయించారు. డెహ్రాడూన్ నుంచి ముంబైకి ప్రత్యేక విమానం ద్వారా తరలించారు....

క్రికెట్ ఫీల్డ్ లో ఇప్పటి వరకూ భారతజట్టు కోసం పోరాడిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్..కారు ప్రమాదంతో ప్రస్తుతం తనజీవితం కోసం అలుపెరుగని పోరాటమే చేస్తున్నాడు.

గత నెల 25 నుంచి ఉత్తరాఖండ్ లో తన స్నేహితులతో కలసి వేడుకలు చేసుకొని ..డిసెంబర్ 30న డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తున్నసమయంలో రూర్కీ సమీపంలో రిషభ్ పంత్ కారు ప్రమాదంలో చిక్కుకొంది.

అత్యంత ఖరీదైన మెర్సిడెస్ కారును రిషభ్ పంత్ స్వయంగా డ్రైవ్ చేస్తూ వచ్చాడు. డెహ్రాడూన్- ఢిల్లీ జాతీయ రహదారిలో.. తెల్లవారుజామున వేగంగా వస్తున్న ఆ కారు డివైడర్ ను బలంగా ఢీ కొట్టి మూడుసార్లు పల్టీలు కొట్టడంతో మంటలు చెలరేగాయి. రోడ్డుకు అటువైపుగా వెళుతున్న హర్యానా రోడ్ వేస్ బస్సు డ్రైవర్, కండక్టర్ ఆ ప్రమాదాన్ని చూసి...మంటలు రేగుతున్న కారు అద్దాలు పగుల కొట్టి రిషభ్ పంత్ ను కాపాడి రూర్కీ ఆస్పత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం పంత్ ను మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్ మ్యాక్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

విమానంలో ముంబైకి తరలింపు...

కారు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన రిషభ్ పంత్ కు నుదిటి భాగం నుంచి కాలివేలు వరకూ పలురకాలుగా గాయాలయ్యాయి. ఇప్పటికే ప్లాస్టిక్ సర్జరీతో సహా పలు రకాలుగా చికిత్స అందించారు.

గత కొద్దిరోజులుగా ఐసీయులో ఉన్న పంత్ ను..కొద్దిరోజుల క్రితమే ప్రయివేటు రూమ్ కు మార్చారు. అయితే ప్రముఖులు, పరామర్శకుల తాకిడి ఎక్కువ కావడంతో..తగిన విశ్రాంతి తో పాటు మరింత మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో తరలించారు.

గాయాల నుంచి పూర్తిగా కోలుకోడానికి రిషభ్ పంత్ కు 3 నెలల నుంచి 6 నెలల సమయం పట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు..సందర్శకులతో చికిత్స పొందుతున్న పంత్ కు తగిన విశ్రాంతే లేకుండా పోతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స...

ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న రిషభ్ వద్దకు పరామర్శకులను అనుమతించరాదని నిర్ణయించారు. పంత్ కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు.

రిషభ్ పంత్ చికిత్స కార్యక్రమాన్ని కోకిలాబెన్ సీనియర్ వైద్యుడు డాక్టర్ దిన్ షా పర్డీవాలా పర్యవేక్షిస్తున్నారు. పంత్ కుడికాలి నరం తెగిపోడంతో శస్త్రచికిత్స నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే..శరీరమంతా తగిలిన గాయాల నుంచి కోలుకొన్న తర్వాతే పంత్ కు శస్త్రచికిత్సలు నిర్వహించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

రిషభ్ పంత్ కు జంట ఆపరేషన్లు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే...లండన్ లో శస్త్రచికిత్సలు నిర్వహించే అవకాశం లేకపోలేదని బీసీసీఐ ప్రతినిధి అంటున్నారు. రిషభ్ రెండు మోకాళ్లు, కుడిచేయి మణికట్టు ప్రమాదంలో విరిగిపోయాయి.

క్రికెట్ కు 9 మాసాలు దూరం...

రిషభ్ పంత్ పూర్తిగా కోలుకోడానికి కనీసం 9 మాసాల సమయం పడుతుందని, అప్పటి వరకూ క్రికెట్ కు దూరంగా ఉండాల్సిందేనని వైద్యనిపుణుల బృందం తెలిపింది.

మెదడు, వెన్నెముక భాగంలోని గాయాలకు ఎమ్మారై స్కానింగ్ నిర్వహించారు.

మరోవైపు..భారత క్రికెటర్లకు బీసీసీఐ కల్పించిన మెడికల్ ఇన్సూరెన్సు కింద పంత్ కు చికిత్స నిర్వహిస్తున్నారు. డెహ్రాడూన్ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో తరలించడానికి పెట్టిన ఖర్చును క్రికెట్ బోర్డే భరించింది.

25 సంవత్సరాల రిషభ్ పంత్ క్రికెటర్ గా మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ కాంట్రాక్టు, ఎండార్స్ మెంట్ల ద్వారా ఇప్పటికే 85 కోట్ల రూపాయల వరకూ ఆర్జించాడు. ఖరీదైన, అత్యంత భద్రతతో కూడిన మెర్సిడెస్ కారులో ప్రయాణించిన కారణంగానే రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడినట్లు చెబుతున్నారు.

First Published:  5 Jan 2023 5:30 AM GMT
Next Story