Telugu Global
Sports

ఉత్ప్రేర‌కాల‌ ఊబిలో భారత క్రీడాకారులు?

భారత క్రీడారంగాన్నిడ్రగ్స్ భూతం వెంటాడుతోంది. లేనిబలంతో అడ్డదారిలో పతకాలు గెలుచుకోడానికి పలువురు క్రీడాకారులు మాదకద్రవ్యాల బాట పడుతున్నారు.

ఉత్ప్ర్రేరకాల ఊబిలో భారత క్రీడాకారులు?
X

భారత క్రీడారంగాన్నిడ్రగ్స్ భూతం వెంటాడుతోంది. లేనిబలంతో అడ్డదారిలో పతకాలు గెలుచుకోడానికి పలువురు క్రీడాకారులు మాదకద్రవ్యాల బాట పడుతున్నారు.

ఆసియాక్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ లో గతంలో ఎన్నడూలేనంత స్థాయిలో పతకాలు సాధించామన్న భారత్ ఆనందాన్ని కొందరు క్రీడాకారులు ఆవిరి చేస్తున్నారు.

అడ్డదారిలో రికార్డులు, పతకాలు సాధించడానికి మాదకద్రవ్యాల గడ్డి కరుస్తున్నారు.

' నాడా' వలలో 142 మంది..

డ్రగ్స్ రహిత క్రీడల కోసం ప్రపంచ దేశాలతో పాటు భారత్ సైతం తనవంతుగా ప్రయత్నం చేస్తోంది. క్రీడాకారులు అడ్డదారి తొక్కకుండా ఆదిలోనే అదపు చేయటానికి ఏటా పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు నిర్వహించడానికి మాదకద్రవ్యాల నిరోధక భారత సంస్థ ( నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీని భారత ప్రభుత్వం కొద్ది సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసింది.

అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్య నిబంధనల ప్రకారం భారత్ కు ప్రాతినిథ్యం వహించే ప్రతి ఒక్క క్రీడాకారుడూ విధిగా ఈ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

అందులో భాగంగా పలు కఠినతరమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఏడాదికోసారి మాదకద్రవ్యాల నిరోధిక సంస్థ నిర్వహించే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

2022-23 సంవత్సరం కోసం నాడా నిర్వహించిన పరీక్షల్లో వివిధ క్రీడలకు చెందిన 142 మంది నిషేధిత మాదకద్రవ్యాలు వాడినట్లు పరీక్షల్లో తేలింది. 2022 ఏప్రిల్- మార్చి 2023 మధ్యకాలంలో తాము నిర్వహించిన పరీక్షల వివరాలను నాడా బయటపెట్టింది.

క్రికెటర్లకు సైతం డోప్ టెస్టులు...

క్రికెట్ కు, అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘానికి ఏమాత్రం సంబంధం లేకపోయినా..క్రికెటర్లకు సైతం ఏటా డ్రగ్స్ వాడిందీ లేనిదీ నిర్ధారించే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మొత్తం27మంది క్రికెటర్లకు సైతం డోప్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 13మంది వివిధ రుగ్మతల చికిత్స కోసం ముందస్తు అనుమతితో డ్రగ్స్ ప్రభావం తక్కువగా ఉండే ట్యాబ్లెట్లు, సిరప్ లను ఉపయోగించారు.

భారత టీ-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మందన, రవీంద్రజడేజా, హర్మన్ ప్రీత్ కౌర్, హార్థిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ నాడా ముందస్తు అనుమతితో డ్రగ్స్ తో కూడిన మందులు వినియోగించినవారిలో ఉన్నారు.

80 మంది అథ్లెట్ల పై నిషేధం వేటు...

2022-23 సీజన్లో నాడాకు చెందిన మాదక ద్రవ్యాల నిరోధక క్రమశిక్షణ సంఘం డోప్ టెస్టులో దోషులుగా తేలినవారిలో 80 మందికి నిబంధనల ప్రకారం పలు రకాల శిక్షలు విధించింది.

ఏడాదికాలంలో మొత్తం 4వేల 342 మందికి డోప్ టెస్టులు నిర్వహించారు. వివిధ అంతర్జాతీయ పోటీలు జరుగుతున్న సమయంలో 2 వేల 596 మందికి, 1746 మందికి సాధారణ పరీక్షలు నిర్వహించినట్లు నాడా ప్రకటించింది.

నిషేధిత మాదక ద్రవ్యాలను 142 మంది వాడినట్లుగా తేలింది. వీరిలో 49 మంది అథ్లెట్లు, 22 మంది వెయిట్ లిఫ్టర్లు, 17 మంది రెజ్లర్లు, 13 మంది పవర్ లిఫ్టర్లు ఉన్నారు.

పోటీలలో పాల్గొంటున్న సమయంలో 59 మంది రక్తనమూనాలను సేకరించి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. మరో 289 మంది నమూనాలను సాధారణ పరిస్థితుల్లో సేకరించారు.

పారిస్ ఒలింపిక్స్ ను దృష్టిలోఉంచుకొని...

పారిస్ వేదికగా జరిగే 2024 ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే భారతజట్టును డ్రగ్స్ రహిత జట్టుగా పంపాలని నాడా నిర్ణయించింది. ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అర్హత సాధించిన క్రీడాకారులు, అథ్లెట్ల పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.

వీరిలో అథ్లెటిక్స్, హాకీ, బాక్సింగ్, షూటింగ్, విలువిద్య, బ్యాడ్మింటన్, కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, టెన్నిస్ క్రీడలకు చెందినవారు ఉన్నారు.

First Published:  10 Jan 2024 11:43 AM GMT
Next Story