Telugu Global
Sports

పడిలేచిన కెరటం..దీప కర్మాకర్!

జిమ్నాస్టిక్స్ క్రీడలో దీప కర్మాకర్ తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకోగలిగింది. త్రిపుర లాంటి మారుమూల రాష్ట్రం నుంచి అంతర్జాతీయస్థాయిలో భారత ఉనికిని కాపాడుతూ వస్తోంది.

పడిలేచిన కెరటం..దీప కర్మాకర్!
X

జిమ్నాస్టిక్స్ క్రీడలో దీప కర్మాకర్ తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకోగలిగింది. త్రిపుర లాంటి మారుమూల రాష్ట్ర్రం నుంచి అంతర్జాతీయస్థాయిలో భారత ఉనికిని కాపాడుతూ వస్తోంది.

దీప కర్మాకర్..భారత క్రీడాభిమానులకు, ప్రధానంగా జిమ్నాస్టిక్స్ ప్రియులకు పరిచయం ఏమాత్రం అవసరం లేని పేరు. ఆరేళ్ల చిరుప్రాయం నుంచి 30 సంవత్సరాల వయసు వరకూ తాను నమ్ముకొన్న క్రీడలోనే కొనసాగుతూ ఒలింపిక్స్ లో నాలుగోస్థానంలో నిలవడంతో పాటు..ఆసియా పోటీలలో ' బంగారు కొండ 'లా నిలిచింది.

ఆటుపోట్లను తట్టుకొని..

క్రీడాకారులూ మనుషులే. డబ్బులు అడ్డదారుల్లో ఊరికే వస్తాయోమో కానీ..విజయాలు, పురస్కారాలు, రికార్డులు, బంగారు పతకాలు మాత్రం ఉత్తపుణ్యానికి రావనటానికి దీప కర్మాకర్ ను మించిన నిదర్శనం మరొకటిలేదు.

భారత మారుమూల రాష్ట్ర్రం త్రిపుర రాజధాని అగర్తలలో 30 సంవత్సరాల క్రితం జన్మించిన దీప ఆరేళ్ల చిరుప్రాయం నుంచే జిమ్నాస్టిక్స్ పట్ల ఆసక్తి పెంచుకొంది. ప్రముఖ శిక్షకుడు బీఎస్ నంది శిక్షణలో రాటుదేలుతూ వచ్చింది. ప్రోత్సాహం అంతంత మాత్రంగా ఉన్నా జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటూ భారత మహిళా జిమ్నాస్టిక్స్ తో పాటు తన ఉనికిని కాపాడుకొంటూ మరికొద్దివారాలలో ప్రారంభంకానున్న పారిస్ ఒలింపిక్స్ వరకూ తన ప్రస్థానం కొనసాగిస్తూరాగలిగింది.

మోకాలిశస్త్రచికిత్స నుంచి నిషేధం వరకూ..

కష్ట్లాలు ఒకదాని వెనుక ఒకటిగా వస్తాయనటానికి దీప కర్మాకర్ క్రీడాజీవితమే నిదర్శనం. 2017లో మోకాలి శస్త్ర్రచికిత్సతో ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీనికితోడు తాను ఉపయోగించిన ఔషధాల కారణంగా డోప్ పరీక్షలో దోషిగా తేలడంతో భారత ఒలింపిక్స్ సంఘం 21 మాసాల నిషేధం విధించడంతో దీప క్రీడాజీవితం ముగిసిపోయిందని అందరూ భావించారు. జిమ్నాస్ట్ గా దీపను క్రీడాభిమానులు మాత్రమే కాదు..భారత ఒలింపిక్స్ సంఘం సైతం దాదాపుగా మరచిపోయింది.

2018 జులైలో టర్కీలోని మెర్సిన్ వేదికగా జరిగిన ప్రపంచకప్ చాలెంజ్ జిమ్నాస్టిక్స్ పోటీలలో బంగారు పతకం సాధించడం ద్వారా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చింది.

అంతేకాదు..తాష్కెంట్ వేదికగా జరిగిన 2024 ఆసియా జిమ్నాస్టిక్స్ పోటీల వాల్టింగ్ విభాగంలో స్వర్ణపతకం సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది. 30 సంవత్సరాల వయసులో జిమ్నాస్టిక్స్ ఆసియా టైటిల్ సాధించిన భారత తొలి, ఏకైక మహిళగా చరిత్ర సృష్టించింది.

కొరియా, జపాన్, ఉజ్బెక్ జిమ్నాస్ట్ ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న దీప 13.566 పాయింట్లతో అగ్రభాగంలో నిలవడం ద్వారా స్వర్ణ పతకం కైవసం చేసుకొంది.

గతంలో నాలుగు కాంస్య పతకాలు మాత్రమే సాధించిన దీపకు ఇదే తొలి స్వర్ణం. భారత జిమ్నాస్టిక్స్ చరిత్రలో పతకాలు సాధించిన జిమ్నాస్ట్ లలో అశీశ్ కుమార్ ( 2006- ఫ్లోర్ ఎక్సర్ సైజెస్ ), ప్రణతి నాయక్ ( 2019, 2022 మహిళల వాల్ట్ ) మాత్రమే ఉన్నారు.

జిమ్నాస్టిక్స్ కు మరో పేరు దీప...

జిమ్నాస్టిక్స్ కు..సంగీతానికి దగ్గర సంబంధం ఉంది. ఈ రెండురంగాలలో రాణించాలంటే చక్కటి గురువు పర్యవేక్షణలో బాల్యం నుంచే సాధన చేస్తూ ఉండితీరాలి.

ఉన్నతశిఖరాలు అధిరోహించాలంటే తమ జీవితాన్నే అంకితం చేయాలి. అలా చేయగలిగితేనే ఆశించిన లక్ష్యాలు సాధించే అవకాశం ఉంటుంది.

జిమ్నాస్టిక్స్ అనగానే చైనా, అమెరికా, జపాన్, కొరియా, రష్యా, సోవియెట్ మాజీ రిపబ్లిక్ దేశాల ఆధిపత్యమే కనిపిస్తుంది. ఒంటివిరుపుల విన్యాసాల ఈ క్రీడలో భారత్ కు ఏమాత్రం చరిత్ర కానీ, గొప్పగొప్ప రికార్డులు కానీ, నేపథ్యం కానీ లేనేలేవు. అలాంటి క్రీడలో భారత్ కు చెందిన ఓ మహిళ ఒలింపిక్స్ లో నాలుగో స్థానం సాధించడం, ఆసియా జిమ్నాస్టిక్స్ పోటీలలో బంగారు పతకం సాధించడం అంటే మాటలుకాదు. అలాంటి అపురూప విజయాలు సాధించడం ద్వారా దీప కర్మాకర్ భారత జిమ్నాస్టిక్స్ 'బంగారు కొండ'గా నిలిచింది.

వాల్టింగ్ క్వీన్ దీప.....

వాల్టింగ్ విభాగంలో తిరుగులేని భారత జిమ్నాస్ట్ గా, ప్రపంచంలోని నలుగురు అత్యుత్తమ జిమ్నాస్ట్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకొన్న దీప గ్లాస్గో వేదికగా ముగిసిన 2014 కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్య పతకం సాధించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ క్రీడావేదిక పై పతకం సాధించిన భారత తొలి మహిళా జిమ్నాస్ట్ గా రికార్డుల్లో చేరింది.

అదే ఏడాది జరిగిన ఆసియా జిమ్నాస్టిక్స్ పోటీలలో కాంస్యం, 2015 ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ పోటీలలో 5వ స్థానం సంపాదించింది.

వెంట్రుక వాసిలో చేజారిన ఒలింపిక్స్ పతకం..

2016 రియో ఒలింపిక్స్ లో పాల్గొనడమే కాదు..వాల్టింగ్ విభాగంలో నాలుగోస్థానం సాధించిన భారత తొలి మహిళా జిమ్నాస్ట్ గా రికార్డు నెలకొల్పింది. వాల్ట్ విభాగం ఫైనల్స్ చేరడంతో పాటు వెంట్రుకవాసి ( 0.15 పాయింట్ల ) తేడాతో కాంస్య పతకం చేజార్చుకొంది. ప్రపంచ మేటి జిమ్నాస్ట్ లు సిమోన్ బైల్స్, మారియా పెసెకా, గులియా స్టీన్ గ్రుబెర్ స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధిస్తే..దీప మాత్రం 4వ స్థానంలో నిలవాల్సి వచ్చింది.

పారిస్ ఒలింపిక్స్ కు అర్హత...

ఆసియా జిమ్నాస్టిక్స్ లో బంగారు పతకం సాధించడం ద్వారా మరి కొద్దివారాల్లో ప్రారంభంకానున్న పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి దీప అర్హత సంపాదించింది. తన కెరియర్ లో రెండోసారి ఒలింపిక్స్ కు అర్హత సంపాదించిన దీప..కొద్దిపాటి అదృష్టం కలసి వస్తే ఏదో ఒక పతకంతో స్వదేశానికి తిరిగిరావడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన గురువు విశ్వేశ్వర్ నంది అండగా ఉన్నంతకాలం ఏదైనా సాధించే ధైర్యం, సత్తా తనకు ఉంటాయని దీప ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.

భారత మహిళా జిమ్నాస్టిక్స్ కే అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన దీప కష్టానికి 2024 ఒలింపిక్స్ లో తగిన ఫలితం దక్కాలని కోరుకొందాం.

First Published:  8 Jun 2024 2:28 PM GMT
Next Story