Telugu Global
Sports

నిరుపేద క్రికెటర్ల కోసం నటరాజన్ క్రికెట్ అకాడమీ!

ఐపీఎల్ ఆడుతూ కోట్ల రూపాయలు సంపాదించే క్రికెటర్లు ఎందరో ఉన్నారు. అయితే తన సంపాదనలో కొంతభాగం ప్రతిభావంతులైన నిరుపేద క్రికెటర్ల కోసం వివిధ రూపాలలో ఖర్చు చేసే ఆటగాళ్ళు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు.

నిరుపేద క్రికెటర్ల కోసం నటరాజన్ క్రికెట్ అకాడమీ!
X

నిరుపేద క్రికెటర్ల కోసం నటరాజన్ క్రికెట్ అకాడమీ!

ఐపీఎల్ ఆడుతూ కోట్ల రూపాయలు సంపాదించే క్రికెటర్లు ఎందరో ఉన్నారు. అయితే తన సంపాదనలో కొంతభాగం ప్రతిభావంతులైన నిరుపేద క్రికెటర్ల కోసం వివిధ రూపాలలో ఖర్చు చేసే ఆటగాళ్ళు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో భారత్ కమ్ హైదరాబాద్ సన్ రైజర్స్ పేసర్ నటరాజన్ అందరికంటే ముందుంటాడు.

తమిళనాడులోని సేలం జిల్లా చిన్నంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్ సకలసదుపాయాలు కలిగిన ఓ క్రికెట్ గ్రౌండ్ ను ఏర్పాటు చేసి..ప్రతిభావంతులైన యువక్రికెటర్లకు, క్రికెటేతర క్రీడలకు చెందిన క్రీడాకారులకు అందుబాటులో ఉంచాడు.

ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఆడుతున్న నటరాజన్ కు ఏడాదికి 4 కోట్ల రూపాయలు కాంట్రాక్టు మనీగా అందుతోంది. కొద్ది సంవత్సరాల క్రితమే క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన నటరాజన్ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అన్నమాటను నిలబెట్టుకొన్నాడు.

సొంతగ్రామంలోనే నటరాజన్ క్రికెట్ గ్రౌండ్...

క్రికెట్ గ్రౌండ్ కోసం కొద్దిసంవత్సరాల క్రితమే 10 లక్షల రూపాయలు ఖర్చుచేసి తన గ్రామంలోనే నటరాజన్ అరఎకరం పొలం కొన్నాడు. వ్యవసాయభూమిగా ఉన్న ఆ భూమిని సకలసదుపాయాలు కలిగిన క్రికెట్ గ్రౌండ్ గా తీర్చిదిద్దటానికి అహర్నిశలూ శ్రమించాడు.

తనలాంటి నిరుపేద క్రికెటర్ల కోసం ఓ క్రికెట్ గ్రౌండ్ ను ఏర్పాటు చేసి, ఉచితంగా శిక్షణ ఇస్తానని చెప్పిన మాటను నటరాజన్ నిలబెట్టుకొన్నాడు. చిన్నంపట్టి గ్రామంలో నిర్మించిన నటరాజన్ క్రికెట్ గ్రౌండ్ ను భారత మాజీ వికెట్ కీపర్, క్రికెట్ వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో నటరాజన్ కుటుంబసభ్యులతో పాటు తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడు అశోక్ శిఖామణి, సేలం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆర్. శివకుమార్, సినీనటుడు యోగి బాబు తదితరులు పాల్గొన్నారు.

తమిళనాడు క్రికెట్ సంఘం కోచ్ హేమంగ్ బదానీ, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ తో పాటు తమిళనాడు జట్టు సభ్యులు సైతం నటరాజన్ గ్రౌండ్ ను సందర్శించి వెళ్లారు.

ప్రతిభావంతులైన గ్రామీణ క్రికెటర్ల కోసం సొంతడబ్బుతో ఓ క్రికెట్ గ్రౌండ్ ను ఏర్పాటుచేసి ఉచితంగా శిక్షణ ఇస్తున్న నటరాజన్ ను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. చివరకు హైదరాబాద్ ఫ్రాంచైజీ సైతం నటరాజన్ ను ప్రశంసలతో ముంచెత్తింది.

2019-20 సిరీస్ ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌బౌలర్‌గా వెళ్లిన నటరాజన్...అనూహ్యపరిణామాల నడుమ కేవలం నెలరోజుల వ్యవధిలోనే క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించడం ద్వారా సంచలనం సృష్టించాడు.

అనంతరం మోకాలి గాయంతో జట్టుకు దూరమై తన బౌలింగ్ లో లయను కోల్పోయాడు. ఆ తర్వాత కోలుకున్నా.. గాయాలు వెంటాడటంతో భారతజట్టుకు దూరమైనా..ఐపీఎల్ కెరియర్ ను మాత్రం కొనసాగించగలుగుతున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్ లోనూ నటరాజన్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు.

నెట్ బౌలర్ నుంచి టెస్ట్ బౌలర్ గా....

తమిళనాడులోని ఓ రోజువారీ కూలీ కుటుంబం నుంచి భారత క్రికెట్ లోకి దూసుకొచ్చిన నటరాజన్ క్రికెటర్ గా ఎదగటానికి పడరాని పాట్లు పడ్డాడు.

2020 సీజన్ ఐపీఎల్ లో అంచనాలకు మించి రాణించిన యార్కర్ల కింగ్ నటరాజన్ ఆ తరువాత...భారతజట్టులో చోటు కోసం ఎంతో కాలం వేచిచూడాల్సిన అవసరం లేకపోయింది.

ఆస్ట్ర్రేలియా పర్యటనలో భారతజట్టుకు నెట్ బౌలర్ గా సేవలు అందించిన నటరాజన్...కంగారూలతో టీ-20 సిరీస్ లో తనజట్టును విజేతగా నిలపడంలో ప్రధానపాత్ర వహించాడు.

తన భార్య తొలికాన్పు సమయానికి స్వదేశానికి తిరిగిరావాల్సిన నటరాజన్ జట్టు అవసరాల కోసం ఆస్ట్ర్రేలియాలోనే ఉండిపోడం కలసి వచ్చింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ తన తొలిబిడ్డ జననం కోసం జట్టును వీడి స్వదేశానికి తిరిగి వస్తే...అదే పరిస్థితిలో ఉన్న నటరాజన్ మాత్రం జట్టుతోనే ఉండిపోయాడు. నటరాజన్ త్యాగం, అంకితభావానికి తగిన ప్రతిఫలం అన్నట్లుగా...సిడ్నీటెస్టులో పాల్గొనే భారత తుదిజట్టులో చోటు దక్కింది.

ఐపీఎల్ తో అగ్రపథానికి.....

క్రికెట్ అంటే ధనవంతుల క్రీడ. అత్యాధునిక శిక్షణ సదుపాయాలు అందుబాటులో ఉన్నవారు మాత్రమే ప్రపంచ శ్రేణి క్రికెటర్లు కాగలరనుకొంటే అంతకుమించిన పొరపాటు మరొకటి లేదని యార్కర్ల మొనగాడు తంగారసు నటరాజన్ తన విజయగాథతో చాటిచెప్పాడు.

తమిళనాడులోని సేలం జిల్లా చిన్నప్పంపట్టి గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన నటరాజన్ బాల్యంలో అష్టకష్టాలు పడ్డాడు. స్థానిక బట్టల మిల్లులో తండ్రి మోత కూలీ. తల్లి తమ వీధిలో చిరుతిళ్ల దుకాణం నడుపుతూ ఐదుగురు పిల్లల కుటుంబాన్ని పోషించడానికి నానాపాట్లు పడుతూ ఉండేవారు. నటరాజన్ తమ గ్రామంలోని పాఠశాలలో చదువుకొంటూ తోటికుర్రాళ్లతో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ తనలో దాగి ఉన్న అసాధారణ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

20 ఏళ్ల లేటువయసులో....

టెన్నిస్ బాల్ క్రికెట్ తో యార్కర్లు వేస్తూ చెలరేగిపోయే నటరాజన్ కు 20 ఏళ్ల వయసు వచ్చే వరకూ క్రికెట్ బాల్ తో ఆడిన అనుభవమే లేదు. తన స్నేహితుడు, మెంటార్ జైప్రకాశ్ ప్రోద్భలం,సహాయసహకారాలతో చెన్నై చేరిన నటరాజన్ క్రికెట్ బాల్ తో ప్రాక్టీసు చేస్తూ...నాలుగో డివిజన్ లీగ్ క్రికెట్ ఆడుతూ తన బౌలింగ్ కు సానపెట్టుకొన్నాడు.

అంచెలంచెలుగా ఎదిగి తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో దిండిగల్ డ్రాగన్స్ , లైకా కోవై కింగ్స్ జట్ల తరపున ఆడటం ద్వారా యార్కర్ల మొనగాడిగా గుర్తింపు తెచ్చుకొ్న్నాడు. నేరుగా తమిళనాడు రంజీజట్టుకు ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగాడు.

నటరాజన్ లోని అసాధారణ ప్రతిభను గుర్తించిన కింగ్స్ పంజాబ్ యాజమాన్యం 2017 సీజన్ ఐపీఎల్ వేలంలో 3 కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేసింది. తగిన అవకాశాలు లేకపోడం, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోడంతో నటరాజన్ వెనుకబడి పోయాడు. ఆ తర్వాత నటరాజన్ పైన హైదరాబాద్ ఫ్రాంచైజీ కన్ను పడింది. కేవలం 40 లక్షల రూపాయ ధరకే నటరాజన్ ను తమజట్టులో చేర్చుకొంది.

బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్,మెంటార్ లక్ష్మణ్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ ల మార్గదర్శనంతో నటరాజన్ 2020 సీజన్లో విశ్వరూపమే ప్రదర్శించాడు. విరాట్ కొహ్లీ వికెట్ తో బోణీ....

గల్ఫ్ దేశాలు వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీని అవుట్ చేయడం ద్వారా నటరాజన్ తన జైత్రయాత్రను మొదలు పెట్టాడు.

బెంగళూరు సూపర్ స్టార్ ఏబీ డివిలియర్స్, చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఢిల్లీ క్యాపిటల్స్ మేటి ఆటగాళ్లు ...లీగ్ మ్యాచ్ ల్లో నటరాజన్ యార్కర్లకు దాసోహమనక తప్పలేదు.

ఐపీఎల్ లో కనబరచిన ప్రతిభతో నటరాజన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారతజట్టు కు నెట్ బౌలర్ గా సేవలు అందించడానికి ఎంపికయ్యాడు. టీ-20 జట్టుకు ఎంపికైన వరుణ్ చక్రవర్తి గాయం కాస్త నటరాజన్ పాలిట వరంగా మారింది. ఆస్ట్ర్రేలియాతో డిసెంబర్ లో జరిగిన మూడో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన నటరాజన్..ఆవెంటనే టీ-20 క్యాప్ సైతం సాధించి సత్తా చాటుకొన్నాడు. తనజట్టు సిరీస్ విజేతగా నిలవడంలో ప్రధానపాత్ర వహించాడు.

ఆస్ట్ర్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లోని ఆఖరి మ్యాచ్ ద్వారా నటరాజన్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. తన తొలిటెస్ట్ తొలిఇన్నింగ్స్ తొలిరోజుఆటలోనే రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.

క్రికెట్ మూడుఫార్మాట్లలో...కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రికెటర్ ఘనతను 29 సంవత్సరాల నటరాజన్ సొంతం చేసుకొన్నాడు.

నటరాజన్ దొడ్డమనసు....

ఐపీఎల్ ద్వారా తాను ఆర్జించిన కోట్లరూపాయల మొత్తం నుంచి కొంత సొమ్ముతో తల్లిదండ్రులకు మంచిఇల్లు కట్టించాడు. తండ్రిని కూలీపని మాన్పించడమే కాదు..

ఇద్దరు చెల్లెళ్లు, ఓ తమ్ముడు ఎంత చదివితే అంతవరకూ చదివించాలని నిర్ణయించాడు. అంతేకాదు..మిత్రులసాయంతో తమ ఊరిలో ఓ క్రికెట్ అకాడమీని సైతం ఏర్పాటు చేయగలిగాడు.40 నుంచి 60 మంది వరకూ ప్రతిభావంతులైన ఇరుగుపొరుగు గ్రామాల యువక్రికెటర్లకు ఉచితశిక్షణ ఇప్పిస్తున్నాడు. వారందరికీ కిట్ బ్యాగులు తానే సమకూర్చుతున్నాడు.

ఆకలి, పేదరికం అంటే పూర్తిగా తెలిసిన నటరాజన్ తన కష్టార్జితాన్ని కేవలం తనకుటుంబం కోసమే కాకుండా...తనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన క్రికెట్ కోసం, ఇరుగుపొరుగు కోసం ఖర్చు చేయటం అతని దొడ్డమనసుకు నిదర్శనం.

నటరాజన్ లాంటి పోరాటయోధులు, విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఆటగాళ్ల అవసరం భారత క్రికెట్ కు ఎంతైనా ఉంది. సేలం ఎక్స్ ప్రెస్, యార్కర్ల కింగ్ నటరాజన్ గాయాల నుంచి పూర్తిగా తేరుకొని ..సుదీర్ఘకాలం భారత క్రికెట్ కు సేవలు అందించాలని కోరుకొందాం.

First Published:  26 Jun 2023 9:45 AM GMT
Next Story