Telugu Global
Sports

సానియానే షోయబ్ కు విడాకులిచ్చిందా?

భారత మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ సానియా మీర్జా పెళ్ళి పుష్కరకాలం ముచ్చటగా ముగిసింది. పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో పెళ్ళి చేసుకోడంతో సానియా విడాకులవార్త బయటకు వచ్చింది.

సానియానే షోయబ్ కు విడాకులిచ్చిందా?
X

భారత మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ సానియా మీర్జా పెళ్ళి పుష్కరకాలం ముచ్చటగా ముగిసింది. పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో పెళ్ళి చేసుకోడంతో సానియా విడాకులవార్త బయటకు వచ్చింది.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో పెళ్ళి చేసుకొన్నట్లు ప్రకటించడంతో భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా 12 సంవత్సరాల వివాహబంధానికి తెరపడినట్లయ్యింది.

తన టెన్నిస్ కెరియర్ నుంచి వివాహం వరకూ ప్రతిదీ సంచలనమే అన్నట్లుగా జీవించిన సానియా రిటైర్మెంట్ తరువాత ఏడాదికే షోయబ్ మాలిక్ నుంచి వేరు పడిపోవాల్సి వచ్చింది.

షోయబ్ మాలిక్ తో నిఖానే ఓ సంచలనం..

సానియా మీర్జా టెన్నిస్ ప్లేయర్ గా దూసుకుపోతున్న సమయంలో షోయబ్ మాలిక్ తో ప్రేమలో పడింది. ఆ ప్రేమ కాస్త సంచలన సంఘటనలు, కీలక మలుపులతో నిఖాగా 2012లో రూపుదిద్దుకొంది.

అప్పటికే ఓ వివాహం చేసుకొన్న షోయబ్ మాలిక్ ..సానియాను రెండోపెళ్ళి చేసుకోడం కలకలమే రేపింది. తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సానియా మంకుపట్టు పట్టి మరీ షోయబ్ ను నిఖా చేసుకొన్నట్లు అప్పట్లో భారీగానే ప్రచారం జరిగింది.

ఇక్కడ సానియా- అక్కడ షోయబ్....

వివాహం చేసుకొన్నవారు ఓ కుటుంబంగా, సంసారబంధంతో ఒక్కచోటే కలసి ఉంటారు. అయితే సానియా, షోయబ్ మాలిక్ లు మాత్రం వేర్వేరుగా ఉంటూ తమ వివాహబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దుబాయ్ లో కాపురం పెట్టినా సానియా భారత్ లో, షోయబ్ మాలిక్ పాకిస్థాన్ లోనే గడుపుతూ వచ్చారు.

ఇద్దరూ వేర్వేరుగా ఉంటూ తమ తమ కెరియర్ లను కొనసాగిస్తూ రావడంతో విడాకులంటూ ప్రచారం కూడా జోరందుకొంది.

పాకిస్థాన్ కోడలిగా సానియా, భారత్ అల్లుడిగా షోయబ్ మాలిక్ చెలామణి అవుతూ 2018లో ఓ మగబిడ్డకు తల్లిదండ్రులుగా మారారు. అయితే..పాకిస్థాన్ జట్టులో షోయబ్ మాలిక్ చోటు కోల్పోడం, సానియా మీర్జా టెన్నిస్ నుంచి రిటైర్ కావడంతో గత ఏడాదికాలంగా విడాకులు తీసుకొంటున్నారంటూ, విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం పతాకస్థాయికి చేరింది.

దీనికితోడు సానియా సైతం తన ఇన్ స్టా ద్వారా విడాకులు, వేరుపడిపోడం లాంటి అర్థాలు వచ్చేలా కామెంట్లూ పెడుతూ వచ్చింది.

సానియా పోయే..సనా వచ్చే...!

మరోవైపు...పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్ ను తాను నిఖా చేసుకొన్నట్లు షోయబ్ మాలిక్ కరాచీలో ప్రకటించడం, తమ పెళ్ళిఫోటోను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టడంతో సానియా మీర్జాతో తెగతెంపులు చేసుకొన్నట్లు స్పష్టమయ్యింది. ఇంతకాలం వదంతులు, ఉహాగానాలుగా జరిగిన ప్రచారం చివరకు వాస్తవమేనని తేలిపోయింది.

షోయబ్ మాలిక్ కు ఇది మూడో పెళ్ళి కాగా..సనాకు ద్వితీయ వివాహం. పాక్ ప్రముఖ గాయకుడు ఉమెయిర్ జస్వాల్ ను 2020లో వివాహం చేసుకొన్న కొద్దవారాలలోనే విడాకులిచ్చినట్లు సనా ప్రకటించింది. ఆ తర్వాత నుంచి షోయబ్ మాలిక్ తో చెట్టాపట్టాలేసుకు తిరగడంతో సానియా విడాకుల వార్త బయటకు వచ్చింది.

ఇది సానియా ' ఖులానే'......

షోయబ్ మాలిక్ తన మూడో వివాహం వార్తను ప్రకటించిన వెంటనే..సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా సోషల్ మీడియా ద్వారా తమ వివరణను బయట పెట్టారు.

ఇస్లాం సాంప్రదాయం ప్రకారం మహిళలు వివాహబంధం నుంచి తమకు తాముగా బయటపడటానికి వీలుగా ఖులా చెబుతారని, ఖులా అంటే తన భర్త నుంచి తనకుతానుగా విడిపోవడమేనంటూ ఇమ్రాన్ మీర్జా వివరణ ఇచ్చారు.

ఇది కేవలం సానియా చెప్పిన ఖులా మాత్రమేనని, షోయబ్ మాలిక్ కు తన కుమార్తే విడాకులిచ్చినట్లుగా పరోక్షంగా తెలిపారు. ఆరేళ్ల తన కుమారుడు ఇజాన్ మీర్జాతో కలసి తల్లిదండ్రుల వద్దే సానియా ఉంటూ వస్తోంది.

భారత మహిళా టెన్నిస్ లో రెండు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన సానియా పలు గ్రాండ్ స్లామ్ డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ టైటిల్స్ తో పాటు 43 డబ్లుటిఏ టైటిల్స్ గెలుచుకొంది.

టెన్నిస్ ప్లేయర్ గా 150 కోట్ల రూపాయలకు పైగా సంపాదించడంతో పాటు హైదరాబాద్, దుబాయ్ నగరాలలో ఖరీదైన, విలాసవంతమైన ఆస్తులు కూడబెట్టుకోగలిగింది. తన పేరుతోనే హైదరాబాద్ లో పలు టెన్నిస్ అకాడమీలను సైతం నిర్వహిస్తోంది.

సానియా మాటల్లోనే చెప్పాలంటే...విడిపోవడం నిజంగా బాధాకరమే..!

First Published:  21 Jan 2024 1:30 AM GMT
Next Story