Telugu Global
Sports

ఆసియాకప్ నెగ్గినా శ్రీలంకకు 2వేల కోట్ల రూపాయల నష్టం!

దుబాయ్ వేదికగా ముగిసిన 15వ ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో శ్రీలంకజట్టు విజేతగా నిలిచినా ఆ దేశక్రికెట్ బోర్డులో లేశమంతైనా ఆనందం ఏమాత్రం కనిపించడం లేదు.

ఆసియాకప్ నెగ్గినా శ్రీలంకకు 2వేల కోట్ల రూపాయల నష్టం!
X

దుబాయ్ వేదికగా ముగిసిన 15వ ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో శ్రీలంకజట్టు విజేతగా నిలిచినా ఆ దేశక్రికెట్ బోర్డులో లేశమంతైనా ఆనందం ఏమాత్రం కనిపించడం లేదు.

తమ దేశం నిర్వహించాల్సిన ఈ టో్ర్నీకి ఎమిరేట్స్ ఆతిథ్యమివ్వడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు వివిధ రూపాలలో 2వేల కోట్ల రూపాయలకు పైగా నష్టపోవాల్సి వచ్చింది....

క్రికెట్ అంటేనే వందలకోట్ల రూపాయల వ్యాపారం. ఐసీసీ ( అంతర్జాతీయ క్రికెట్ మండలి ) లేదా ఏసీసీ ( ఆసియా క్రికెట్ మండలి ) నిర్వహించే టోర్నీల ద్వారా జరిగే వ్యాపారం అంతాఇంతాకాదు.

భారత్, ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ లాంటి దేశాలలో ఒక్కో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా వందకోట్ల నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకూ వ్యాపారం జరుగుతుంది.

మీడియా ప్రసారహక్కులు, మ్యాచ్ టికెట్ల విక్రయం ద్వారా వివిధ రూపాలలో వచ్చే మొత్తంతో పాటు..ఒక్కో మ్యాచ్ నిర్వహణతో 200కోట్ల రూపాయల మేర వ్యాపారకార్యకలాపాలు జరగటం సాధారణ విషయమే.

శ్రీలంకబోర్డు లబోదిబో...

కొద్దివారాల క్రితం తమ దేశంలో చోటు చేసుకొన్న పరిణామాల పుణ్యమా అంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం 15వ ఆసియాకప్ పోటీలకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే...శ్రీలంక ప్రభుత్వం దివాళాతీయటం, ఆర్థికవ్యవస్థ దారుణంగా పతనం కావడంతో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. దీనికితోడు ఆసియాకప్ నిర్వహణకు అవసరమైన విదేశీమారక ద్రవ్యం తగినంతగా లేకపోడంతో టోర్నీకి ఆతిథ్యమివ్వడం తమవల్ల కాదంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది.

టోర్నీ ప్రారంభానికి రెండువారాల ముందు మాత్రమే...ఆసియాకప్ ను శ్రీలంకకు బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్, షార్జా స్టేడియాలు వేదికలుగా నిర్వహించాలని ఆసియా క్రికెట్ మండలి నిర్ణయించింది.

మొత్తం ఆరుదేశాల ( భారత్, శ్రీలంక, పాక్, హాంకాంగ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ )జట్లు ఈటోర్నీ బరిలో నిలిచాయి. గ్రూప్ లీగ్ నుంచి సూపర్ -4 రౌండ్ వరకూ 12 మ్యాచ్ లు, ఫైనల్‌ తో సహా మొత్తం 13 మ్యాచ్ లు నిర్వహించారు. ఈ ఆరుదేశాలకు చెందిన అభిమానులు మ్యాచ్ లకు భారీసంఖ్యలో తరలి రావడంతో దుబాయ్, షార్జా క్రికెట్ స్టేడియాలు నిండుకుండల్లా, కళకళలాడుతూ కనిపించాయి. నిర్వాహక సంఘానికి కనకవర్షమే కురిసింది.

కొలంబో వేదికగా జరగాల్సిన ఈటోర్నీ దుబాయ్ వేదికగా నిర్వహించినా శ్రీలంకజట్టే విజేతగా నిలవడం కొంతమేరకు ఊరట కలిగించినా...ఆర్థికంగా జరిగిన నష్టం అంతాఇంతాకాదు.

వ్రతం చెడినా.....

అదే శ్రీలంక వేదికగా ఆసియాకప్ టోర్నీ నిర్వహించి ఉంటే...క్రికెట్ బోర్డుకు ఆదాయంతో పాటు శ్రీలంక ప్రభుత్వానికి సైతం విదేశీటూరిస్టుల రాకతో విలువైన విదేశీమారక ద్రవ్యం లభించి ఉండేదే.

కొలంబోతో పాటు శ్రీలంకలోని ఇతర వేదికల్లో ఆసియాకప్ మ్యాచ్ లు జరిగి ఉంటే...మ్యాచ్ కు 150 నుంచి 200 కోట్ల శ్రీలంక రూపాయల వ్యాపారం జరిగి ఉండేది. మొత్తం 13 మ్యాచ్ ల నిర్వహణ ద్వారా 2000కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగి ఉండేదని చెబుతున్నారు. ఇది కాక...మొత్తం ఆరుదేశాలజట్లు, సహాయకసిబ్బంది కొలంబోలోని స్టార్ హోటళ్లలో విడిది చేయటం ద్వారా భారీగా ఆదాయం సమకూరి ఉండేది. అంతేకాదు...వివిధజట్లకు చెందిన వేలాదిమంది విదేశీ అభిమానులు సైతం శ్రీలంకకు తరలివచ్చి ఉండేవారే.

ఏదిఏమైనా..ఆసియాకప్ ను నిర్వహించలేని అశక్తతో కారణంగా ప్రత్యక్షంగా శ్రీలంక క్రికెట్ బోర్డు, పరోక్షంగా శ్రీలంక ప్రభుత్వం వందలకోట్ల రూపాయల మేర నష్టపోవాల్సి వచ్చింది.

దేశప్రతిష్టతో పాటు..ఆర్థికంగాను భారీగా నష్టం జరిగినా...చివరకు శ్రీలంకజట్టే విజేతగా నిలవడం, ఆసియా దిగ్గజాలు భారత్, పాకిస్థాన్ జట్లను చిత్తు చేసిన తీరు చూస్తే..వ్రతం చెడినా ఫలితం దక్కిందంటూ సంతృప్తి చెందితీరక తప్పదు.

First Published:  12 Sep 2022 9:38 AM GMT
Next Story