Telugu Global
Sports

వస్తాదుల పోరాటంలో కీలక మలుపు!

అంతర్జాతీయ, ప్రపంచ కుస్తీ పోటీలలో దేశానికి డజన్ల కొద్దీ పతకాలు సాధించిన భారత మహిళా వస్తాదుల పోరాటం కొంతమేరకు ఫలించింది.

Delhi Police to register FIR against wrestling body chief Brij Bhushan, Supreme Court told
X

వస్తాదుల పోరాటంలో కీలక మలుపు!

అంతర్జాతీయ, ప్రపంచ కుస్తీ పోటీలలో దేశానికి డజన్ల కొద్దీ పతకాలు సాధించిన భారత మహిళా వస్తాదుల పోరాటం కొంతమేరకు ఫలించింది. సుప్రీంకోర్టు జోక్యంతో భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు, బీజెపీ ఎంపీ బ్రజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ ఢిల్లీ పోలీలుసులు ముందుకు వచ్చారు...

మనదేశం ఎటుపోతోంది. కేంద్ర, రాష్ట్ర్రప్రభుత్వాలు న్యాయానికి, ధర్మానికి తూట్లు పొడుస్తున్న ప్రతిసారీ దేశసర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొంటూ పరిస్థితిని చక్కదిద్దటం పరిపాటిగా మారిపోయింది.

పలుకుబడి, రాజకీయ అధికారం ఉంటే తమను ఎవ్వరూ ఏమీ చేయలేరన్నట్లుగా ప్రవర్తించిన ప్రతిసారీ సుప్రీంకోర్టు రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఇది కేవలం రాజకీయరంగానికి మాత్రమే కాదు..క్రీడారంగానికి విస్తరించింది.

కుస్తీసమాఖ్యతో మహిళావస్తాదుల కుస్తీ..

దేశానికి, భారత కుస్తీ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన అంతర్జాతీయ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియా, దీపక్ పునియాలతో సహా మొత్తం ఏడుగురు అంతర్జాతీయ దిగ్గజాలు తమకు న్యాయం చేయాలంటూ మరోసారి న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనదీక్ష ప్రారంభించారు.

మహిళా వస్తాదులపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు, బీజెపీకి చెందిన లోక్ సభ సభ్యుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై కేసు నమోదు చేసి.. చర్యలు తీసుకోవాలంటూ నిరసనకు దిగారు. తగిన ఆధారాలున్నా తమ ఫిర్యాదును ఢిల్లీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదంటూ మండి పడ్డారు. ఈ అంశంపై స్పందించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు, దర్యాప్తు కమిటీ చైర్మన్ పీటీ ఉషకు నిరసనకు దిగిన రెజ్లర్లు ఓ లేఖ రాశారు.

వస్తాదులపై పీటీ ఉష గరంగరం....

జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన మహిళా వస్తాదులు న్యాయం చేయండంటూ తనకు లేఖ రాయటంతో భారత ఒలింపిక్స్ సంఘం చైర్మన్ పీటీ ఉష అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

విచారణ కోసం తాము ఓ కమిటీని నియమించినా ..నిరసనకు దిగటాన్ని తప్పుపట్టారు. క్రమశిక్షణ, ఓర్పు లేవంటూ ఎదురుదాడికి దిగారు. భారత ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చుతున్నారని, కుస్తీక్రీడకు ఇది ఏమాత్రం మంచిందికాదని హెచ్చరించారు.

క్రీడాకారులు ఇలా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం తగదని అన్నారు. కమిటీ రిపోర్ట్‌ వచ్చే వరకైనా వారు వేచి ఉండాల్సిందని చెప్పారు. ‘వారు చేసిన పని క్రీడకు, దేశానికి మంచిది కాదు. ఇది ప్రతికూల విధానం’ అని విమర్శించారు. రెజ్లర్లు నిరసన చేయడం క్రమశిక్షణారాహిత్యమని అన్నారు.

బజరంగ్ పూనియా విచారం...

భారత ప్రతిష్టను దిగజార్చుతున్నారని తమపై పీటీ ఉష చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయ రెజ్లర్ బజరంగ్‌ పునియా విచారం వ్యక్తం చేశారు. ఐవోఏ అధ్యక్షురాలి నుంచి తాము మద్దతు ఆశించామని, అయితే ఇలాంటి ప్రతి స్పందనను తాము ఊహించనేలేదని మీడియా ముందు వాపోయారు.

నిరసనను తెలిపే హక్కు ఈ దేశంలోని ప్రతిపౌరునికి ఉందన్న వాస్తవాన్ని పీటీ ఉష గుర్తుంచుకోవాలని మహిళా రెజ్లర్లు ఎదురుదాడికి దిగారు.

మరోవైపు..లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ కుస్తీ సంఘం అధ్యక్షుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా..లైంగిక వేధింపులకు గురై నిరసనకు దిగిన మహిళా వస్తాదులను తప్పుపట్టిన పీటీ ఉష పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తనదైన శైలిలో పరుగుల రాణి పీటీ ఉషకు చురకలంటించారు. తృణమూల్ కాంగ్రెస్, శివసేన ( ఠాక్రే ) ఇతర పార్టీలకు చెందిన సభ్యులు సైతం పీటీ ఉష తీరును ఖండించారు.

బీజెపీ బిక్షతో రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న పీటీ ఉష దోషులను సమర్థించక..నిర్దోషులను ఎందుకు సమర్థిస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు.

మహిళా రెజ్లర్లకు అండగా నీరజ్ చోప్రా..

తమకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగిన మహిళా వస్తాదులకు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, భారత దిగ్గజ అథ్లెట్ నీరజ్ చోప్రా అండగా నిలిచారు. లైంగిక వేధింపులకు గురైన మహిళా రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందేనని నీరజ్ ప్రకటించాడు.

క్రికెటర్లు సైతం తమకు అండగా నిలవాలంటూ మహిళా రెజ్లర్లు మొరపెట్టుకొన్నా..ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా క్రికెట్ ప్రముఖులు మిన్నకుండిపోయారు.

క్రికెటర్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం తమకు బాధ కలిగించిందని, తమకు మద్దుతుగా కాకపోయినా..ఈ అంశంపై స్పందించి ఉండాల్సిందని వినితా పోగట్ అభిప్రాయపడింది.

దిగివచ్చిన ఢిల్లీ పోలీసులు...

బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు కోసం రెజ్లర్లు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో సీరియస్‌ అంశంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం, ఢిల్లీ పోలీసులకు నోటీస్‌ జారీ చేయాలని గురువారం ఆదేశించింది.

తమను లైంగికంగా వేధించిన భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ మహిళా రెజ్లర్లు మొరపెట్టుకొన్నా కేసు నమోదు చేయటానికి నిరాకరిస్తూ వచ్చిన ఢిల్లీ పోలీసులు..సుప్రీంకోర్టు జోక్యంతో దిగి వచ్చారు. బ్రిజ్ భూషణ్ పై ఈరోజే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ ముందుకు వచ్చారు.

విచారణ ముగిసే వరకూ బ్రిజ్ భూషణ్ తన విధులకు దూరంగా ఉండాలంటూ గతంలోనే ఆదేశించారు. అయినా..అదేమీ లెక్కచేయకుండా భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా విధులలో పాల్గొంటూ వస్తాదులపై పెత్తనం చేస్తూ ఉండటాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఈ కారణంగానే మహిళావస్తాదులు తిరిగి నిరసనకు దిగినట్లుగా భావిస్తోంది.

ఉత్తరప్రదేశ్ లోని కేసర్ గంజ్ నియోజక వర్గం నుంచి బీజెపీ సభ్యుడిగా బ్రజ్ భూషణ్ లోక్ సభకు ఎన్నికయ్యారు. బ్రజ్ భూషణ్ బీజెపీ లోక్ సభసభ్యుడు కావటం కారణంగానే..ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తూ రావటం, రెజ్లర్లు తమ మన్ కీ బాత్ వినాలంటూ ప్రధానికి విన్నవించుకొన్నా..ప్రధాని తమదైన శైలిలో మౌనంగా ఉండిపోవడం విమర్శలకు దారితీసింది.

నిరసనకు దిగిన మహిళావస్తాదులకు..సుప్రీంకోర్టు జోక్యంతోనైనా న్యాయం జరుగుతుందని క్రీడావర్గాలు భావిస్తున్నాయి.

First Published:  28 April 2023 12:00 PM GMT
Next Story