Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ లో ఢిల్లీ డబుల్ రికార్డు!

ప్రారంభ మహిళా ఐపీఎల్ లో వరుసగా రెండుసార్లు 200కు పైగా స్కోర్లు సాధించిన తొలిజట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డు నెలకొల్పింది.

మహిళా ఐపీఎల్ లో ఢిల్లీ డబుల్ రికార్డు!
X

ప్రారంభ మహిళా ఐపీఎల్ లో వరుసగా రెండుసార్లు 200కు పైగా స్కోర్లు సాధించిన తొలిజట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డు నెలకొల్పింది. ఐదుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ రెండోరౌండ్లో యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది.

2023 సీజన్ మహిళా ఐపీఎల్ లో పరుగుల సునామీ వెల్లువలా సాగిపోతోంది. మొదటి ఐదురౌండ్ల మ్యాచ్ ల్లోనూ మూడుసార్లు 200కు పైగా స్కోర్లు నమోదు కావడం విశేషం.

ప్రారంభమ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 207 పరుగులు సాధించిన తొలిజట్టుగా నిలిస్తే..మరో తొలిరౌండ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 223 పరుగుల స్కోరు నమోదు చేసింది.

అంతేకాదు..దానికి కొనసాగింపుగా యూపీ వారియర్స్ తో జరిగిన రెండోరౌండ్ పోరులో సైతం ఢిల్లీ 211 పరుగుల స్కోరుతో వారేవ్వా! అనిపించుకొంది. 200కు పైగా స్క్రోర్లను బ్యాక్ టు బ్యాక్ సాధించిన తొలిజట్టుగా చరిత్రకు తెరతీసింది.

లానింగ్, జాన్సన్ ధనాధన్...

ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగిన లీగ్ రెండోరౌండ్ పోరులో ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్, ఆల్ రౌండర్ జెస్ జాన్సన్ పరుగుల మోత మోగించారు. ఢిల్లీ టాపార్డర్ లో

మెగ్‌ లానింగ్‌ (42 బంతుల్లో 70; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), జెస్‌ జాన్సన్‌ (20 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్‌ (34 నాటౌట్‌) మెరుపు

బ్యాటింగ్ తో తమజట్టుకు భారీస్కోరు అందించారు. ప్రస్తుత టోర్నీలో మెగ్ లానింగ్ కు ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం.

చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ తన కోటా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి..ప్రత్యర్థి యూపీ ఎదుట 212 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.

తహిలా తుదివరకూ పోరాడినా...

సమాధానంగా 212 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన యూపీ వారియర్స్ క్రమం తప్పకుండా వికెట్ వెంట వికెట్ కోల్పోతూ ఎదురీత మొదలు పెట్టింది. కెప్టెన్ అలీసా హేలీ 17 బంతుల్లో 24, కిరణ్ నవగిరి 2 పరుగుల స్కోర్లకే జాన్సన్ బౌలింగ్ లో దొరికిపోడంతో ఢిల్లీ తేరుకోలేకపోయింది.

స్టార్ ప్లేయర్ తహిలా మెక్ గ్రాత్ ఒంటరి పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది.

తహిలా 50 బంతుల్లో 11 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 90 పరుగులతో అజేయంగా నిలిచింది. ఐపీఎల్ తొలిసీజన్ మొదటి ఐదురౌండ్లలో అత్యథికంగా 90 పరుగుల స్కోరు సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డుల్లో చేరింది.

యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు మాత్రమే చేయడంతో ఢిల్లీ 42 పరుగులతో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది.

ఢిల్లీ బౌలర్లో జాన్సన్‌ 3 వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్ లో 42, బౌలింగ్ లో 3 వికెట్లు సాధించిన జెస్‌ జాన్సన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ గా జెస్ జాన్సన్ సత్తా చాటుకొంది.

First Published:  8 March 2023 4:27 AM GMT
Next Story