Telugu Global
Sports

ఓపెనర్‌గా విరాట్.. భారత్ మల్లగుల్లాలు!

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి గాడిలో పడటం భారత టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. టీ-20 ఫార్మాట్‌లో విరాట్‌ను ఓపెనర్‌గా ఆడించే విషయమై చర్చ రసవత్తరంగా సాగుతోంది.

ఓపెనర్‌గా విరాట్.. భారత్ మల్లగుల్లాలు!
X

క్రికెట్..చిత్రవిచిత్రాలకు నిలయం. హీరోలు జీరోలుగా, జీరోలు హీరోలుగా మారిపోవడం ఈ జెంటిల్మెన్ గేమ్‌లో అత్యంత సాధారణ విషయం. గత మూడేళ్లుగా వరుస వైఫల్యాలతో భారత జట్టుకే అలంకరణగా మారిన మాజీ కెప్టెన్ కమ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 1020 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి సెంచరీ సాధించడం ద్వారా తిరిగి గాడిలో పడగలిగాడు.

దుబాయ్ వేదికగా ఇటీవలే ముగిసిన ఆసియా కప్ సూపర్ - 4 ఆఖరి రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో విరాట్ అదరగొట్టాడు. అప్ఘనిస్థాన్‌తో ముగిసిన ఆఖరి రౌండ్ పోరులో ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన విరాట్ 122 పరుగులతో అజేయ సెంచరీ సాధించాడు. స్టాండిన్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో కలసి సెంచరీ భాగస్వామ్యం సైతం నమోదు చేశాడు. తన కెరియర్‌లో 71వ, అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌ల్లో తొలి శతకం సాధించడం ద్వారా ఊపిరి పీల్చుకొన్నాడు.

విరాట్ జోరు...రాహుల్ బేజారు...

అప్ఘనిస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన వెంటనే జరిగిన మీడియా సమావేశంలో స్టాండిన్ కెప్టెన్ హోదాలో కెఎల్ రాహుల్ పాల్గొన్న సమయంలో ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఓపెనర్‌గా అదరగొట్టిన విరాట్‌నే ఇక ముందు కూడా అదే స్థానంలో కొనసాగిస్తారా? అంటూ ఓ మీడియా ప్రతినిధి రాహుల్‌ను ప్రశ్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాహుల్..తనను గోళ్ళు గిల్లుకొంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోమంటారా? అంటూ తనను ప్రశ్నించిన మీడియా ప్రతినిధిని ఎదురు ప్రశ్నించాడు.

విరాట్ వన్ డౌన్‌లోనే బెటర్ - గంభీర్

భారత టీ-20 జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మాత్రమే స్పెషలిస్ట్ ఓపెనర్లని, గత కొంత కాలంగా రోహిత్- రాహుల్ జోడీ నెలకొల్పిన అత్యుత్తమ భాగస్వామ్యాలు, నిలకడగా రాణించిన తీరును మరచిపోరాదని క్రికెట్ వ్యాఖ్యాత, భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ హెచ్చరించాడు. విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా ఆడించే విషయమై చర్చకు తావేలేదని..ఆ ఆలోచనే వద్దని చెప్పాడు. విరాట్ లాంటి గొప్ప బ్యాటర్‌కు వన్ డౌన్‌ను మించిన చోటు మరొకటి లేదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ఓపెనర్లలో ఒకరు వెంటనే అవుటైతే..విరాట్ వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగటం జట్టుకు మేలు చేస్తుందని, ఒకవేళ ఓపెనర్లిద్దరూ పాతుకుపోయి ఆడి చక్కటి భాగస్వామ్యం నమోదు చేస్తే..అప్పుడు వన్ డౌన్ స్థానంలో విరాట్‌కు బదులుగా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు దిగాలని సూచించాడు. స్పెషలిస్ట్ ఓపెనర్లలో ఒకరు గాయపడితే.. ఆపద్ధర్మంగా అప్పుడు విరాట్‌ను ఓపెనర్‌గా దించవచ్చునని గౌతం గంభీర్ చెప్పాడు. గత ఐపీఎల్‌లో వరుస వైఫల్యాలు చవిచూసిన విరాట్..రెండో అంచె మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగి గణనీయమైన సంఖ్యలోనే పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా దిగిన ప్రతిసారీ విరాట్ పర్వాలేదని పిస్తున్నాడు. అయితే...రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లాంటి ప్రపంచ మేటి ఓపెనర్లు అందుబాటులో ఉన్న సమయంలో విరాట్‌కు ఓపెనర్‌గా చోటే లేదని గంభీర్ విశ్లేషించాడు.

మరోవైపు..ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో జరికే మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ల్లో విరాట్‌ను ఓపెనర్‌గా ఆడించడం ద్వారా ప్రయోగం చేయవచ్చునని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం...విరాట్‌ను ఓపెన‌ర్‌గా ఆడించడానికి ఏమాత్రం సుముఖంగా లేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

First Published:  18 Sept 2022 6:26 AM GMT
Next Story