Telugu Global
Sports

200 లక్ష్యం హాంఫట్..పంజాబ్, ముంబై సూపర్ చేజింగ్ విజయాలు!

ఐపీఎల్ -16 రౌండ్ రాబిన్ లీగ్ లో 200 స్కోర్ల పరంపర కొనసాగుతోంది. 8వ రౌండ్ పోటీలలో పంజాబ్, ముంబై సూపర్ చేజింగ్ విజయాలతో సంచలనం సృష్టించాయి.

200 లక్ష్యం హాంఫట్..పంజాబ్, ముంబై సూపర్ చేజింగ్ విజయాలు!
X

200 లక్ష్యం హాంఫట్..పంజాబ్, ముంబై సూపర్ చేజింగ్ విజయాలు!

ఐపీఎల్ -16 రౌండ్ రాబిన్ లీగ్ లో 200 స్కోర్ల పరంపర కొనసాగుతోంది. 8వ రౌండ్ పోటీలలో పంజాబ్, ముంబై సూపర్ చేజింగ్ విజయాలతో సంచలనం సృష్టించాయి.

ఐపీఎల్ -16వ సీజన్లో సరికొత్త ట్రెండ్ తారాస్థాయికి చేరింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లు 200కు పైగా స్కోర్లు సాధించినా విజయానికి గ్యారెంటీ లేకుండా పోయింది.

70 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ముగిసిన సూపర్ సండే డబుల్ హెడ్డర్ సమరంలో మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్ పైన పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ పైన ముంబై ఇండియన్స్ సూపర్ చేజింగ్ విజయాలతో చెలరేగిపోయాయి.

సూపర్ కింగ్స్ కు కింగ్స్ ఝలక్...

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన 9వ రౌండ్ పోరులో పంజాబ్ కింగ్స్ 201 పరుగుల లక్ష్యాన్ని చేధించడం ద్వారా 4 వికెట్ల సంచలన విజయం నమోదు చేసింది.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల స్కోరుతో..ప్రత్యర్థి ఎదుట 201 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.

చెన్నై ఓపెనర్ డేవన్ కాన్వే 52 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 92 పరుగుల నాటౌట్‌ స్కోరుతో నిలిచాడు. మరో ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (37), శివమ్‌ దూబే (28) సైతం దూకుడుగా ఆడి పరుగుల మోత మోగించారు.రుతురాజ్ గైక్వాడ్ 31 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 37 పరుగులతో రాణించాడు. మరోవైపు శివం దూబే 17 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 28 పరుగులతో మెరుపులు మెరిపించాడు. రవీంద్ర జడేజా పది బంతులకు 12, మొయిన్ అలీ ఆరు బంతుల్లో పది పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. అయితే..ఆఖరి ఓవర్లో బ్యాటింగ్ కు దిగిన ధోనీ కేవలం 4 బంతుల్లోనే రెండు భారీసిక్సర్లతో 13 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో చెన్నై 200 పరుగుల చేయగలిగింది.

పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, సామ్ కరెన్ ణ్, రాహుల్ చాహర్, సికిందర్ రజా తలో వికెట్ పడగొట్టారు. లివింగ్ స్టోన్ వీరబాదుడు...

మ్యాచ్ నెగ్గాలంటే 201 పరుగులు సాధించాల్సిన పంజాబ్ ప్రారంభ ఓవర్లలోనే కెప్టెన్ కమ్ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ నష్టపోయింది. ఓపెనింగ్ జోడీ ధావన్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ జోరుగానే ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే.. ఐదో ఓవర్లో పేసర్ తుషార్ దేశ్ పాండే వేసిన రెండో బంతిని ఆడబోయి.. స్లిప్‌లో ఉన్న పతి రాణాకు ధావన్ చిక్కాడు. ఐదు ఓవర్లు ముగిసే సమయానికే పంజాబ్ వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది.

ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో రవీంద్ర జడేజా వేసిన మూడో బంతికి స్టంప్ ఔట్ అయ్యాడు. అప్పటికి 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 42 పరుగులు చేశాడు . జడేజా వేసిన రెండో బంతిని అథర్వ తైడే .. రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో పంజాబ్ మూడో వికెట్ కూడా కోల్పోయింది. తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న లివింగ్ స్టోన్ 40 పరుగులకు ఔటయ్యాడు. తుషార్ దేశ్ పాండే వేసిన 16వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదిన లివింగ్ స్టోన్.. ఐదో బంతిని రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు.

19వ ఓవర్ ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయిన పంజాబ్ 192 పరుగులు చేసింది. ఆఖరి ఆరు బంతుల్లో విజయానికి 9 పరుగులు కావాల్సి ఉండగా..

సికిందర్ రజా అజేయంగా నిలవడం ద్వారా 4 వికెట్ల విజయం అందించాడు.ఆఖరి ఓవర్ లో సికిందర్ రాజా ఎనిమిది పరుగులు సాధించాడు. చివరకు పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు 201 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో తుషార్ 3, జడేజా 2 వికెట్లు పడగొట్టారు.

పంజాబ్ విజయం సాధించినా ..చెన్నై ఓపెనర్ డేవన్ కాన్వేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొమ్మిది రౌండ్లలో చెన్నైకి ఇది నాలుగో ఓటమి కాగా..పంజాబ్ కు 5వ గెలుపు.

రాజస్థాన్ పై ముంబై రికార్డ్ చేజింగ్ విన్..

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా..ఐపీఎల్ చరిత్రలో 1000వ మ్యాచ్ గా మాజీ చాంపియన్లు ముంబై, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన పోరులో పరుగులు వెల్లువెత్తాయి.

రెండుజట్లూ కలసి 425 పరుగులు సాధించడం ఓ రికార్డు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకేరోజున జరిగిన రెండువేర్వేరు మ్యాచ్ ల నాలుగు ఇన్నింగ్స్ లోనూ 200 స్కోర్లు నమోదు కావడం అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

వాంఖడేలో యశస్వి జైశ్వాల్ షో....

పరుగుల గని, బ్యాటర్ల అడ్డా వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ పోటీలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 212 పరుగుల

భారీస్కోరు సాధించింది. రాజస్థాన్ కు ఆడుతున్న ముంబై యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ షోగా..ఐపీఎల్ 1000వ మ్యాచ్ సాగింది.

బట్లర్ - యశస్వి జోడీ రాజస్థాన్ ఇన్నింగ్స్ ను దూకుడుగా మొదలు పెట్టారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ లో లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా వేసిన తొలి బంతిని బట్లర్ లాంగాన్ మీదుగా సిక్సర్ బాదబోయి.. క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

అప్పటికి బట్లర్ 18 పరుగులు చేశాడు. బట్లర్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ సంజూ శాంసన్ వచ్చిరావడంతోనే సిక్సర్ బాదాడు. కానీ పదో ఓవర్లోనే అర్షద్ ఖాన్ ఓవర్ ఐదో బంతికే తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద చిక్కాడు.

ఓ ఎండ్ లో వరుసగా వికెట్లు పడుతున్నా..యువఓపెనర్ యశస్వి ఏమీ పట్టించుకోకుండా దూకుడుగా ఆడుతూ పరుగుల మోత మోగించాడు. 53 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ సాధించిన జైస్వాల్ ఆ తర్వాత మరో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. మొత్తం 62 బంతుల్లో యశస్వి 124 పరుగులు చేసి చివరి ఓవర్‌లో అవుటయ్యాడు. మొత్తం 16 బౌండ్రీలు, 8 సిక్సర్లతో యశస్వి వీరవిహారమే చేశాడు. రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లకు 212 పరుగులు చేయటం ద్వారా ప్రత్యర్థి ముంబై ఎదుట 213 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్‌కు మూడు, పీయూష్ చావ్లాకు రెండు వికెట్లు దక్కాయి.

గ్రీన్, సూర్య, టిమ్ దంచుడే దంచుడు...

213 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబైకి తొలి ఓవర్లోనే గట్టి దెబ్బ తగిలింది. ముంబై కెప్టెన్ గా ..తన 36వ పుట్టినరోజు నాడు 150 వమ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ 5 బంతుల్లో 3 పరుగుల స్కోరుకే సీమర్ సందీప్ శర్మ బౌలింగ్ లో అవుటయ్యాడు.

అయితే..మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, వన్ డౌన్ కామెరూన్ గ్రీన్ ఏమాత్రం తగ్గకుండా ఆడి రాజస్థాన్ పై భారీషాట్లతో ఎదురుదాడికి దిగారు. పవర్ ప్లే 6 ఓవర్లలో 50కి పైగా స్కోరుతో గట్టి పునాది వేశారు.

మ్యాచ్ కీలకసమయాలలో రాజస్థాన్ జాదూ స్పిన్నర్ అశ్విన్..జోరు మీదున్న ఇషాన్ , గ్రీన్ లను పెవీలియన్ దారి పట్టించాడు. గ్రీన్ 26 బంతుల్లో 4 బౌండ్రీలు, 2సిక్సర్లతో 44 పరుగులకు వెనుదిరిగాడు.

మిస్టర్ 360 టాప్ గేర్...

టీ-20ల్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి రావడంతోనే బ్యాట్ ఝళిపించడం మొదలు పెట్టాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో చెలరేగిపోయాడు. రాజస్థాన్ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. మొదటి 10 ఓవర్లలోనే ముంబై స్కోరును 98కి చేర్చాడు.

కేవలం 29 బంతుల్లోనే 8 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 55 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో..ముంబై గెలుపు బాధ్యతను మిడిలార్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ తీసుకొన్నారు.

ముంబై విజయానికి ఆఖరి రెండు ఓవర్లలో 32 పరుగులు అవసరమైన దశలో టిమ్ డేవిడ్‌ శివమెత్తి పోయాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ సందీప్‌ వేసిన 19వ ఓవర్లో 6,4తో సహా మొత్తం 15 పరుగులు దండుకొన్నాడు. ఆఖరి 6 బంతుల్లో 17 పరుగులు కావాల్సిన ముంబైకి..సిక్సర్ల హ్యాట్రిక్ తో మరో 3 బంతులు మిగిలి ఉండగానే కళ్లు చెదిరే విజయం అందించాడు. ఇన్నింగ్స్ 20 వ ఓవర్ మూడు బంతుల్లో టిమ్ డేవిడ్ వరుసగా మూడుసిక్సర్లు బాది మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

టిమ్ డేవిడ్ కేవలం 14 బంతుల్లోనే 2 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 45 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే నష్టపోయి.19.3 ఓవర్లలోనే 6 వికెట్ల విజయం అందుకొంది.

వాంఖడే వేదికగా ముంబై సాధించిన 213 పరుగులే అత్యధిక చేజింగ్ విజయం కావడం మరో రికార్డుగా మిగిలిపోతుంది. సెంచరీ హీరో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

8 మ్యాచ్ ల్లో ముంబైకి ఇది నాలుగో గెలుపు కాగా..9 రౌండ్లలో రాజస్థాన్ రాయల్స్ కు ఇది నాలుగో ఓటమి.

లక్నో ఏక్నా స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7-30కి జరిగే పోరులో లక్నో సూపర్ జెయింట్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.

First Published:  1 May 2023 7:42 AM GMT
Next Story