Telugu Global
Sports

రొనాల్డో మ్యాజిక్..సౌదీ క్లబ్ కు అభిమానుల వెల్లువ!

ప్రపంచ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో కాంట్రాక్టు కుదుర్చుకోడంతో సౌదీ అరేబియాక్లబ్ అల్-నాజర్ దశ తిరిగింది.

రొనాల్డో మ్యాజిక్..సౌదీ క్లబ్ కు అభిమానుల వెల్లువ!
X

ప్రపంచ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో కాంట్రాక్టు కుదుర్చుకోడంతో సౌదీ అరేబియాక్లబ్ అల్-నాజర్ దశ తిరిగింది. రొనాల్డో పుణ్యమా అంటూ ఇంతకాలం కొంతమందికి మాత్రమే తెలిసిన అల్ -నాజర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త అభిమానులను పంచుకోగలిగింది....

పోర్చుగల్ కెప్టెన్, ప్రపంచ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో రెండున్నర ఏళ్ల కాంట్రాక్టు కుదుర్చుకొన్నట్లు సౌదీ సాకర్ క్లబ్ అల్-నాజర్ ప్రకటించి 24 గంటలు గడచిందో లేదో అభిమానుల వెల్లువ ప్రారంభమయ్యింది.

2000 కోట్ల రూపాయల కాంట్రాక్టు...

ఇప్పటి వరకూ యూరోప్ కు చెందిన యువెంటస్, రియల్ మాడ్రిడ్, లిస్బన్, మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ లకు మాత్రమే ఆడిన సూపర్ స్టార్ స్ట్ర్రయికర్ క్రిస్టియానో రొనాల్డో...తొలిసారిగా ఓ ఆసియాక్లబ్ కు ఆడాలని నిర్ణయించుకోడాన్ని సౌదీ అరేబియాకు చెందిన అల్-నాజర్ క్లబ్ పూర్తిస్థాయిలో సొమ్ము చేసుకొంది.

37 సంవత్సరాల రొనాల్డోకు 2023 నుంచి 2025 వరకూ కాంట్రాక్టుగా 2వేల కోట్ల రూపాయలు ( 200 మిలియన్ యూరోల) చెల్లించేలా కాంట్రాక్టు కుదుర్చుకొంది.

రొనాల్డోకు ఏడాదికి 800 కోట్ల రూపాయల చొప్పున చెల్లించనుంది.

ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్న రొనాల్డో ప్రభావం అల్ -నాజర్ క్లబ్ పైన సైతం పడింది. ఇప్పటి వరకూ

అరకొరగా అభిమానులు మాత్రమే ఉన్న అల్- నాజర్ క్లబ్ కు రొనాల్డో చేరికతో రాత్రికి రాత్రే సరికొత్త అభిమానుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది.

దటీజ్...క్రిస్టియానో రొనాల్డో!

గత ఏడాది వరకూ ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కు ఆడిన క్రిస్టియానో రొనాల్డో..సరికొత్తగా అల్- నాజర్ క్లబ్ తో కాంట్రాక్టు కుదుర్చుకోడంతో అభిమానులంతా సౌదీ క్లబ్ వైపు మొగ్గు చూపారు. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ తో సహా పలు సోషల్ మీడియా వేదికల్లో రొనాల్డోను అనుసరిస్తున్న లక్షలాదిమంది అభిమానులు కాస్త...ఒక్కసారిగా అల్ -నాజర్ క్లబ్ వైపు చేరిపోయారు.

ఇన్ స్టాగ్రామ్ వేదికగా ద్వారా అల్ నాజర్ క్లబ్ ను అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య గత 24 గంటల్లో 8 లక్షల 60వేల నుంచి ఒక్కసారిగా 52 లక్షల మందికి పెరిగిపోయింది.

ట్విట్టర్ వేదికగా అల్- నాజర్ క్లబ్ ఫాలోవర్స్ సంఖ్య 5 లక్షలకు పెరిగింది. తమ క్లబ్ ను సోషల్ మీడియా ద్వారా అనుసరించేవారి సంఖ్య 8 లక్షల నుంచి అరకోటికి చేరిపోడంతో క్లబ్ యాజమాన్యం పట్టలేని ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది.

అల్- నాజర్ క్లబ్ తరపున రొనాల్డో తొలిమ్యాచ్ ఆడక ముందే ఇంతగా ప్రభావం చూపితే...ఇక ఫీల్డ్ లోకి దిగితే ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తాడన్నది రానున్న కాలమే చెప్పాలి.

First Published:  1 Jan 2023 9:00 AM GMT
Next Story