Telugu Global
Sports

క్రీడాకారుల ఆర్జనలో మేటి క్రిస్టియానో రొనాల్డో!

పోర్చుగీసు ఎవర్ గ్రీన్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఫుట్ బాల్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..ఆర్జనలోనూ తనకు తానే సాటిగా నిలిచాడు.

క్రీడాకారుల ఆర్జనలో మేటి క్రిస్టియానో రొనాల్డో!
X

పోర్చుగీసు ఎవర్ గ్రీన్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఫుట్ బాల్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..ఆర్జనలోనూ తనకు తానే సాటిగా నిలిచాడు.

ప్రపంచ ఫుట్ బాల్ లో 39 సంవత్సరాల పోర్చుగీసు సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో హవా కొనసాగుతోంది. సాకర్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..ఫీల్డ్ వెలుపలా క్రిస్టియానో ఆధిపత్యమే కనిపిస్తోంది.

ఆర్జనలో అందనంత ఎత్తులో....

2024 సంవత్సరంలో అత్యధికంగా ఆర్జించిన ప్రపంచ క్రీడాకారుల జాబితాలో క్రిస్టియానో రొనాల్డో అగ్రభాగాన నిలిచాడు. తన ప్రధాన ప్రత్యర్థులు లయనల్ మెస్సీ, ఎంబప్పేలను అధిగమించడమే కాదు..అందనంత ఎత్తులో నిలిచాడు.

అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్- 2024 లో అత్యధిక సంపాదన కలిగిన మొదటి 10 మంది క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. ఇందులో రొనాల్డో అగ్రభాగంలో నిలిస్తే..లయనల్ మెస్సీ మూడో స్థానానికి పడిపోయాడు.

క్రిస్టియానో సంపాదన 260 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో సౌదీ అరేబియా క్లబ్ అల్ నాజర్ నుంచి 200 మిలియన్ డాలర్లు కాంట్రాక్టు మనీ అందుకొంటున్న ఈ పోర్చుగీసు సాకర్ స్టార్..వ్యక్తిగత ఎండార్స్ మెంట్లు, స్పాన్సర్ షిప్ ల ద్వారా మరో 60 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. మొత్తం మీద క్రిస్టియానో సంపాదన 260 మిలియన్ డాలర్లకు చేరింది. ఫోర్బ్స్ వార్షిక జాబితా అగ్రస్థానంలో నిలవటం క్రిస్టియానోకు ఇది నాలుగోసారి.

రెండోస్థానంలో స్పానిష్ గోల్ఫర్..

క్రిస్టియానో రొనాల్డో తరువాత అత్యధికంగా ఆర్జించిన క్రీడాకారుల జాబితా రెండోస్థానంలో స్పానిష్ గోల్ఫర్ జాన్ రామ్ నిలిచాడు. జాన్ 218 మిలియన్ డాలర్ల సంపాదనతో రెండోస్థానం సాధించాడు. 2024 సీజన్లో 200 మిలియన్ డాలర్లకు పైగా ఆర్జించిన క్రీడాకారులు క్రిస్టియానో, జాన్ రామ్ మాత్రమే.

అర్జెంటీనా సాకర్ స్టార్ లయనల్ మెస్సీ 135 మిలియన్ డాలర్ల సంపాదనతో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. తన కెరియర్ లో ఎనిమిదిసార్లు బాలోన్ డీ ఓర్ అవార్డులు సాధించిన మెస్సీ..ఇంటర్ మియామీ క్లబ్ కు మారటం ద్వారా తన ఆదాయాన్ని 135 మిలియన్ డాలర్లకు పెంచుకోగలిగాడు. 36 సంవత్సరాల మెస్సీ..సాకర్ కాంట్రాక్టు ద్వారా 65 మిలియన్ డాలర్లు, అడిడాస్, ఆపిల్ లాంటి ప్రపంచ మేటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ 70 మిలియన్ డాలర్లు ఆర్జించగలుగుతున్నాడు.

లాస్ ఏంజెలిస్ లేకర్స్ ఫార్వర్డ్ లెబ్రాన్ జేమ్స్ 128.2 మిలియన్ డాలర్ల మొత్తంతో 4వ స్థానంలో ఉన్నాడు. ఫ్రెంచ్ సాకర్ స్టార్ కిల్యాన్ ఎంబప్పే 110 మిలియన్ డాలర్ల ఆర్జనతో 6వ స్థానానికి పడిపోయాడు. బ్రెజిల్ సాకర్ స్టార్ నైమార్ 108 మిలియన్ డాలర్లతో 7వ స్థానంలో ఉన్నాడు. ఎన్ ఎఫ్ఎల్ ప్లేయర్ లామార్ జాక్సన్ 100.5 మిలియన్ డాలర్లతో 10వ స్థానంలో నిలిచాడు.

క్రిస్టియానోను ఇన్ స్టా గ్రామ్ ద్వారా అనుసరించే వారి సంఖ్య 629 మిలియన్లను మించిపోయింది. వయసు మీద పడుతున్న కొద్దీ సంపాదన సైతం పెంచుకొంటున్న ఏకైక సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మాత్రమే.

First Published:  18 May 2024 11:10 AM GMT
Next Story