Telugu Global
Sports

కాంట్రాక్టు రద్దుతో రొనాల్డోకి 120 కోట్ల నష్టం!

పోర్చుగీస్ కమ్ ప్రపంచ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కోట్ల రూపాయల మేర నష్టపోయాడు. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తో కాంట్రాక్టును అర్థంతరంగా రద్దు చేసుకోడంతో కళ్లు చెదిరే మొత్తాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

Cristiano Ronaldo
X

క్రిస్టియానో రొనాల్డో

పోర్చుగీస్ కమ్ ప్రపంచ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కోట్ల రూపాయల మేర నష్టపోయాడు. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తో కాంట్రాక్టును అర్థంతరంగా రద్దు చేసుకోడంతో కళ్లు చెదిరే మొత్తాన్ని వదులుకోవాల్సి వచ్చింది....

ప్రపంచ ఫుట్ బాల్ లో లీగ్ సాకర్ ఆడుతూ వందల కోట్ల రూపాయలు ఆర్జించే అతికొద్దిమంది ఆటగాళ్లలో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను ప్రముఖంగా చెప్పుకోవాలి.

ఇంగ్లండ్ సాకర్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ తో కొద్దిరోజుల క్రితమే తన కాంట్రాక్టును సగంలోనే రద్దు చేసుకోడంతో భారీ మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

రొనాల్డోను నిండాముంచిన ఇంటర్వ్యూ....

గతసీజన్లోనే మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తో లీగ్ కాంట్రాక్టు కుదుర్చుకొన్న క్రిస్టియానో రొనాల్డో కు కొత్తగా వచ్చిన జట్టు మేనేజర్ తో అభిప్రాయభేదాలు వచ్చాయి.

క్రమశిక్షణ పేరుతో రొనాల్డో లాంటి దిగ్గజ ఆటగాడినే మేనేజర్ ఎరిక్ పలు రకాలుగా వేధించడం మొదలు పెట్టాడు. చివరకు సబ్ స్టిట్యూట్ ఆటగాడి స్థాయికి దిగజార్చాడు.

2022 ప్రీమియర్ లీగ్ లో భాగంగా టోటెన్ హామ్ క్లబ్ తో జరిగిన పోటీలో రొనాల్డోను సబ్ స్టిట్యూట్ గా బరిలోకి దిగాలని మేనేజర్ ఎరిక్ ఆదేశించాడు. దీనికి రొనాల్డో నిరాకరించడం వివాదానికి కారణమయ్యింది.

ఆ తర్వాత నుంచి టీమ్ మేనేజ్ మెంట్ తో పాటు క్లబ్ యాజమాన్యానికి...రొనాల్డోకి మధ్య స్పర్థలు పెరిగిపోతూ వచ్చాయి.

ఇదే సమయంలో..బ్రిటీష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్రిస్టియానో రొనాల్డో తన ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని వెళ్లగక్కడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. తనకు క్లబ్ మనేజర్ తో ఏమాత్రం పొసగడం లేదంటూ రొనాల్డో వాపోయాడు. దీంతో మాంచెస్టర్ యునైటెడ్ తో తన కాంట్రాక్టును సగంలోనే రద్దు చేసుకోవాలని నిర్ణయించాడు.

చర్చల ఫలితం భారీగా నష్టం...

కాంట్రాక్టు రద్దు విషయమై మాంచెస్టర్ యునైటెడ్ సీఈవో రిచర్డ్ ఆర్నాల్డ్ తో రొనాల్డో వ్యక్తిగత మేనేజర్ జోర్జ్ మెండెస్ చర్చలు సమగ్రంగా చర్చలు జరిపారు. ఫలితంగా పరస్పర అవగాహనతో కాంట్రాక్టు రద్దు చేసుకొన్నట్లు ప్రకటించినా...రొనాల్డో 17 మిలియన్ డాలర్ల మేర నష్టపోవాల్సి వచ్చింది. రొనాల్డోకి తాము చెల్లించాల్సిన కోటీ 70 లక్షల డాలర్లను ఇచ్చేది లేదంటూ క్లబ్ యాజమాన్యం స్పష్టం చేసింది. తమ కాంట్రాక్టు నిబంధనలను అతిక్రమించిన కారణంగా రొనాల్డోకి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని సైతం వదులుకోక తప్పదని మాంచెస్టర్ యునైటెడ్ తేల్చి చెప్పింది.

ఫలితంగా..క్రిస్టియానో రొనాల్డో 120 కో్ట్ల రూపాయల మేర నష్టపోవాల్సి వచ్చింది. ప్రొఫెషనల్ లీగ్ ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో తన కెరియర్ లో ఇప్పటి వరకూ నష్టపోయిన అతిపెద్ద మొత్తం ఇదే కావడం విశేషం. రొనాల్డోకి మాంచెస్టర్ యునైటెడ్ వారానికి 5 లక్షల 95వేల డాలర్లు ( 5 లక్షల పౌండ్లు ) చొప్పున చెల్లిస్తూ వచ్చింది.

రొనాల్డోకి దారేది?

మాంచెస్టర్ యునైటెడ్ తో తన కాంట్రాక్టు అర్థంతరంగా రద్దు కావడంతో..వచ్చే సీజన్ నుంచి రొనాల్డో ఏ క్లబ్ తరపున ఏలీగ్ లో ఆడతాడన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తన కెరియర్ లో ఇప్పటికే ఐదు బాలోన్ డి వోర్ అవార్డులు అందుకొన్న 37 సంవత్సరాల రొనాల్డోకి 700కి పైగా గోల్స్ సాధించిన అసాధారణ రికార్డు ఉంది.

జర్మన్ క్లబ్ బైరన్ మ్యూనిక్ తో రొనాల్డో మేనేజర్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు తన దేశానికే చెందిన స్పోర్టింగ్ లిస్బన్ తో సైతం రొనాల్డో చర్చలు జరుపుతున్నట్లు భావిస్తున్నారు.

First Published:  24 Nov 2022 10:23 AM GMT
Next Story