Telugu Global
Sports

ప్రపంచకప్ కొడితే 33 కోట్ల ప్రైజ్ మనీ!

భారత్ - ఆస్ట్ర్రేలియాజట్ల నడుమ ఈ రోజు జరిగే ప్రపంచకప్ ఫైనల్లో విన్నర్, రన్నరప్ గా నిలిచిన జట్ల కోసం రికార్డుస్థాయిలో ప్రైజ్ మనీ ఎదురుచూస్తోంది.

ప్రపంచకప్ కొడితే 33 కోట్ల ప్రైజ్ మనీ!
X

భారత్ - ఆస్ట్ర్రేలియాజట్ల నడుమ ఈ రోజు జరిగే ప్రపంచకప్ ఫైనల్లో విన్నర్, రన్నరప్ గా నిలిచిన జట్ల కోసం రికార్డుస్థాయిలో ప్రైజ్ మనీ ఎదురుచూస్తోంది.

ఐసీసీ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీని ప్రస్తుత 2023- వన్డే ప్రపంచకప్ విజేతకు ఇవ్వనున్నారు. భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న వన్డే ప్రపంచకప్ గత ఆరువారాలుగా దేశంలోని 10 నగరాలు వేదికలుగా 47 మ్యాచ్ లతో సాగి..ఈ రోజు జరిగే ఫైనల్స్ తో ముగియనుంది.

అంతర్జాతీయ క్రికెట్ లోని పది అగ్రశ్రేణిజట్ల నడుమ జరిగిన ఈ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీ బరిలోకి దిగిన మొత్తం జట్లతో పాటు విజేతగా , రన్నరప్ గా నిలిచిన జట్లకు భారీమొత్తంలో ఐసీసీ ప్రైజ్ మనీ అందచేయనుంది.

విజేతకు 11 కిలోల ట్రోఫీ.....

ఐసీసీ వన్డే విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు 11 కిలోల బరువైన బంగారు పోత పోసిన ట్రోఫీతో పాటు...గతంలో ఎన్నడూలేని విధంగా 33 కోట్ల రూపాయలు ( 4 మిలియన్ డాలర్లు ) పైజ్ మనీ చెక్ ను బహుకరించనున్నారు.

ఫైనల్లో ఓడినజట్టుకు 2 మిలియన్ డాలర్లు ( 16 కోట్ల 62 లక్షల 54వేల 200 రూపాయలు) ఇస్తారు.

న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాజట్లకు చెరో 6 కోట్లు...

సెమీఫైనల్లో పరాజయాలు పొందిన న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాజట్లకు చెరో 6 కోట్ల 83 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తారు. రౌండ్ రాబిన్ లీగ్ దశలో విజయాలు సాధించిన జట్లకు మ్యాచ్ కు 66 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీ దక్కనుంది.

లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిదిమ్యాచ్ లు నెగ్గిన భారతజట్టు 6 కోట్ల రూపాయలు సొంతం చేసుకొంది. గత 48 సంవత్సరాల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 83 కోట్ల 13 లక్షల 10వేల 500 రూపాయల మొత్తాన్ని ప్రైజ్ మనీగా ఐసీసీ కేటాయించింది.

350 కి పైగా పరుగులు చేస్తేనే...!

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే టైటిల్ పోరులో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్నజట్టుకే విజయావకాశాలు ఉంటాయని స్థానిక క్యూరేటర్ చెబుతున్నారు.

తొలుత బ్యాటింగ్ కు దిగిన జట్టు మ్యాచ్ నెగ్గాలంటే 350కి పైగా పరుగులు చేయాల్సిందేనని అంటున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో చేజింగ్ అంతతేలిక కాదని తేల్చి చెప్పారు.

దీంతో టాస్ కీలకంగా మారనుంది. టాస్ నెగ్గిన జట్టు సగం మ్యాచ్ నెగ్గినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్ లెక్క సరిచేస్తుందా?

2003 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియాతో తలపడిన సమయంలో భారత్ 125 పరుగుల పరాజయం చవిచూసింది. ఆ ఓటమికి బదులు తీర్చుకొనే అవకాశం ప్రస్తుత ప్రపంచకప్ టైటిల్ పోరు ద్వారా భారత్ కు దక్కింది. సెమీస్ వరకూ కనబరచిన జోరు, దూకుడునే కొనసాగించగలిగితే కంగారూజట్టును ఓడించడం రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టుకు అంత కష్టమేమీకాదు.

36 సంవత్సరాల రోహిత్, 35 సంవత్సరాల విరాట్ కొహ్లీ, 36 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్ లకు ఇదే ఆఖరివన్డే ప్రపంచకప్ కావడంతో..ఆరునూరైనా నెగ్గితీరాలన్న పట్టుదలతో ఉన్నారు. తమ చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కోసమైన సర్వశక్తులూ ధారపోసి ఫైనల్లో విజేతగా నిలుస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు.

గతంలో భారత వేదికగా జరిగిన ప్రపంచకప్ టోర్నీల ఫైనల్స్ లను కోల్ కతా ఈడెన్ గార్డెన్స్, ముంబై వాంఖడే స్టేడియాలు వేదికలుగా నిర్వహిస్తే..ప్రస్తుత ప్రపంచకప్ టైటిల్ పోరును మాత్రం లక్షా 30వేల సీటింగ్ సామర్థ్యంతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు.

First Published:  19 Nov 2023 6:04 AM GMT
Next Story