Telugu Global
Sports

ప్రపంచకప్ ఫైనల్లో భారత తురుపుముక్క ఆ జాదూ బౌలరేనా?

ప్రపంచకప్ ఫైనల్ బరిలోకి దిగే భారతతుదిజట్టులో మార్పులు, చేర్పులపై క్రికెట్ దిగ్గజాలు తలో మాట చెబుతున్నారు.

ప్రపంచకప్ ఫైనల్లో భారత తురుపుముక్క ఆ జాదూ బౌలరేనా?
X

ప్రపంచకప్ ఫైనల్ బరిలోకి దిగే భారతతుదిజట్టులో మార్పులు, చేర్పులపై క్రికెట్ దిగ్గజాలు తలో మాట చెబుతున్నారు. వెటరన్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కు చోటు ఖాయమని భావిస్తున్నారు.

దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను గత ఆరువారాలుగా అలరిస్తూ వచ్చిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్లైమాక్స్ దశకు చేరింది. రెండుసార్లు విన్నర్ భారత్, ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా టైటిల్ సమరానికి అర్హత సంపాదించాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే సూపర్ సండే టైటిల్ ఫైట్ ప్రారంభానికి ముందే తుదిజట్టు కూర్పు పై భారత టీమ్ మేనేజ్ మెంట్లో మాత్రమే కాదు..క్రికెట్ పండితుల్లో సైతం మధనం ప్రారంభమయ్యింది.

విన్నింగ్ ఫార్ములాలో మార్పు తప్పదా?

వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు గాయమై జట్టు నుంచి వైదొలిగిన తర్వాత నుంచి భారతజట్టు అదనపు బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్ తో పాటు..ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే నెట్టుకొస్తోంది. అయితే..టాపార్డర్ లోని మొదటి ఐదుగురు ( రోహిత్, గిల్, విరాట్, అయ్యర్, రాహుల్ ) స్పెషలిస్ట్ బ్యాటర్లే దంచికొడుతూ పరుగుల మోత మోగిస్తుంటే..4వ డౌన్ సూర్యకుమార్ యాదవ్ కు అవకాశమే లేకుండా పోతోంది.

ధర్మశాల వేదికగా న్యూజిలాండ్ తో మ్యాచ్ నుంచి ముంబై వేదికగా ముగిసిన సెమీఫైనల్స్ వరకూ భారత్ ఒకేజట్టును కొనసాగిస్తూ వచ్చింది. విన్నింగ్ ఫార్ములానే పాటిస్తూ నూటికి నూరుశాతం విజయాలు నమోదు చేసింది.

అహ్మదాబాద్ పిచ్ పైన మార్పు అనివార్యమా...

లీగ్ దశ నుంచి సెమీఫైనల్ వరకూ ఆడిన 10 మ్యాచ్ ల్లో సాధించిన విజయాలు ఒక ఎత్తయితే...ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో ఆడే ఫైనల్స్ మరో ఎత్తు కావడంతో తుదిజట్టు ఎంపిక కీలకంగా మారింది. సెంటిమెంటల్ గా విన్నింగ్ జట్టునే భారత టీమ్ మేనేజ్ మెంట్ కొనసాగిస్తుందా? లేక అహ్మదాబాద్ పిచ్, వాతావరణాన్ని బట్టి తుదిజట్టులో మార్పు చేస్తుందా? అన్నది ఆసక్తిని రేపుతోంది.

మరోవైపు...జాదూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు తుదిజట్టులో అదనపు స్పిన్ ఆల్ రౌండర్ గా చోటు ఖాయమని భారత మాజీ పేసర్ కమ్ దిగ్గజ ఆల్ రౌండర్ మదన్ లాల్ చెబుతున్నారు.

అహ్మదాబాద్ పిచ్ స్పిన్ బౌలర్లకు అనువుగా ఉంటుందని, దీనికితోడు టాప్ గేర్ లో ఉన్న భారత్ కు బ్యాటింగ్ ఆర్డర్లో అదనపు బ్యాటర్ అవసరమే లేదు కనుక సూర్య స్థానంలో అశ్విన్ కు తుదిజట్టులో చోటు కల్పించడం తప్పదని చెబుతున్నారు.

కంగారూలపై అశ్విన్ కు భలే రికార్డు...

పైగా..ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా జాదూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు తిరుగులేని రికార్డు ఉంది. చెన్నై వేదికగా ప్రస్తుత ప్రపంచకప్ లో ఆడినప్రారంభమ్యాచ్ లో అశ్విన్ తన కోటా 10 ఓవర్లలో ఓ మేడిన్ ఓవర్ వేసి 34 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ కీలక వికెట్ పడగొట్టాడు. మిడిల్ ఓవర్లలో కంగారూలను అశ్విన్ కట్టిడి చేసిన తీరు అందరినీ ఆకట్టుకొంది. అంతేకాదు..అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత స్పిన్ జోడీ కుల్దీప్, జడేజా చెలరేగిపోడం కూడా..అశ్విన్ వైపు మెగ్గుచూపే అవకాశాలను పెంచింది. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా స్పిన్ జోడీ షంషీ, కేశవ్ మహారాజ్ లను ఎదుర్కొనటానికి ఆస్ట్ర్రేలియా బ్యాటర్లు పడిన పాట్లు ఎన్నీ ఇన్నీకావు. చచ్చీచెడీ 3 వికెట్ల తో నెగ్గడం ద్వారా 8వసారి కంగారూజట్టు ఫైనల్స్ చేరుకోగలిగింది.

36 ఏళ్ల అశ్విన్ కు ఇదే ఆఖరి ప్రపంచకప్ కావడంతో ఫైనల్స్ చాన్స్ దక్కడం ఖాయమని భావిస్తున్నారు.

తుదిజట్టులో మార్పుకు అవకాశమే లేదు- గవాస్కర్...

గత ఆరురౌండ్లలో తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చిన భారత్ ఫైనల్స్ కోసం తుదిజట్టులోమార్పులు చేస్తుందని తాను అనుకోడం లేదని విఖ్యాత కామెంటీటర్, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పారు. విన్నింగ్ ఫార్ములాతో ఆశించిన ఫలితాలు వస్తున్నప్పుడు మార్పు ఎందుకని ప్రశ్నించారు.

ప్రస్తుత ప్రపంచకప్ లీగ్ లో భారత్ తన ఒకే ఒక్కమ్యాచ్ ను పాక్ ప్రత్యర్థిగా అహ్మదాబాద్ వేదికగానే ఆడింది. ఈ పోరులో పాక్ జట్టును భారత బౌలర్లు 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూల్చారు. పేసర్ జస్ ప్రీత్ బుమ్రా 7 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

వరుసగా 11వ విజయానికి గురి...

1983, 2011 ప్రపంచకప్ టోర్నీలలో విజేతగా, 2003 ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన భారతజట్టు 12 సంవత్సరాల విరామం తర్వాత మూడోసారి ప్రపంచకప్ నెగ్గాలన్న పట్టుదలతో ఉంది.

ప్రస్తుత ప్రపంచకప్ లీగ్ దశలోని 9 మ్యాచ్ లు, సెమీఫైనల్లోనూ నెగ్గడం ద్వారా వరుసగా 10 మ్యాచ్ లు నెగ్గిన ఏకైకజట్టుగా నిలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లోనూ భారత్ విజయం సాధించడంతో పాటు ట్రోఫీని అందుకోగలిగితే వెస్టిండీస్, ఆస్ట్ర్రేలియాజట్ల సరసన నిలువగలుగుతుంది.

1975, 1979 ప్రపంచకప్ టోర్నీలలో వెస్టిండీస్, 2003, 2007 టోర్నీలలో ఆస్ట్ర్రేలియా ఒక్క ఓటమీ లేకుండా ప్రపంచకప్ ను గెలుచుకొన్నాయి. అదే రికార్డును భారత్ సైతం అందుకోవాలన్న పట్టుదలతో ఉంది.

ఫైనల్లో భారత్ తురుపుముక్క ఎవరన్నది సూపర్ సండే టైటిల్ సమరంలోనే తేలిపోనుంది.

First Published:  18 Nov 2023 2:30 AM GMT
Next Story