Telugu Global
Sports

ముంబై వన్డే లోస్కోరింగ్ థ్రిల్లర్లో.. విన్నర్ భారత్!

2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు ప్రపంచ టాప్ ర్యాంక్ జట్లు భారత్, ఆస్ట్ర్రేలియాతో మూడుమ్యాచ్ ల సిరీస్ తో మొదలు పెట్టాయి. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముగిసిన ఉత్కంఠభరిత లోస్కోరింగ్ పోరులో భారత్ 5 వికెట్ల విజయంతో 1-0 ఆధిక్యం సంపాదించింది.

IND vs AUS 1st ODI: ముంబై వన్డే లోస్కోరింగ్ థ్రిల్లర్లో.. విన్నర్ భారత్!
X

IND vs AUS 1st ODI: ముంబై వన్డే లోస్కోరింగ్ థ్రిల్లర్లో.. విన్నర్ భారత్!

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ఆస్ట్ర్రేలియాతో ప్రారంభమైన తీన్నార్ వన్డే సిరీస్ లో భారత్ కళ్లు చెదిరే విజయంతో బోణీ కొట్టింది. మిడిలార్డర్ జోడీ రాహుల్- జడేజా ఫైటింగ్ బ్యాటింగ్ తో 5 వికెట్లతో విజేతగా నిలిచింది....

2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు ప్రపంచ టాప్ ర్యాంక్ జట్లు భారత్, ఆస్ట్ర్రేలియాతో మూడుమ్యాచ్ ల సిరీస్ తో మొదలు పెట్టాయి. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముగిసిన ఉత్కంఠభరిత లోస్కోరింగ్ పోరులో భారత్ 5 వికెట్ల విజయంతో 1-0 ఆధిక్యం సంపాదించింది.

Advertisement

వాంఖడేలో పేసర్ల హవా!

ముంబై వాంఖడే స్టేడియం అనగానే భారీస్కోర్లకు వేదిక అన్నమాటే గుర్తుకు వస్తుంది. 50 ఓవర్ల వన్డే మ్యాచ్ ల్లో 280 నుంచి 300కు పైగా స్కోర్లు నమోదు కావడం

సాధారణ విషయమే. అయితే..ప్రస్తుత మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిమ్యాచ్ కు సిద్ధం చేసిన పిచ్ మాత్రం..విశ్లేషకులు, రెండుజట్ల కెప్టెన్ల అంచనాలను తారుమారు చేసింది.

బ్యాటర్ల స్వర్గంగా ఉన్న వాంఖడే పిచ్ ఒక్కసారిగా పేస్ బౌలర్ల స్వర్గంగా మారిపోయింది. పైగా లోస్కోరింగ్ మ్యాచ్ గా మిగిలింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన

Advertisement

ఆస్ట్ర్రేలియాను 35.4 ఓవర్లలోనే కేవలం 188 పరుగుల స్కోరుకే భారత్ కుప్పకూల్చింది.

ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ 65 బంతుల్లోనే 5 సిక్సర్లు, 10 బౌండ్రీలతో 81 పరుగులతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడంతో..ఓ దశలో కంగారూజట్టు 300 పరుగులు సాధించడం ఖాయమని అందరూ భావించారు.

అయితే..మార్ష్ ను స్పిన్నర్ జడేజా పడగొట్టడం, మిడిల్ ఓవర్లలో పేసర్ మహ్మద్ షమీ 3 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.

188 పరుగులకే టపటపా!

పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ తో పరుగుల వేటకు దిగిన ఆస్ట్ర్రేలియా ఇన్నింగ్స్ 35.4 ఓవర్లలోనే ముగిసిపోయింది. ఓపెనర్ ట్రావిడ్ హెడ్ 5, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 22, వన్ డౌన్ లబుషేన్ 15, జోష్ ఇంగ్లిస్ 26, కెమెరూన్ గ్రీన్ 15 పరుగులకు అవుట్ కావడంతో కంగారూజట్టు కోలుకోలేకపోయింది. కంగారూజట్టు 19 పరుగుల తేడాతో చివరి 6 వికెట్లు కోల్పోడం విశేషం

భారత బౌలర్లలో పేసర్ల త్రయం మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు, కెప్టెన్ పాండ్యా 1 వికెట్ , స్పిన్నర్లు జడేజా 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.

నిప్పులు చెరిగిన మిషెల్ స్టార్క్...

189 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత టాపార్డర్ ను కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో కకావికలు చేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 5, శుభ్ మన్ గిల్ 20, వన్ డౌన్ విరాట్ కొహ్లీ 4, రెండో డౌన్ సూర్యకుమార్ యాదవ్ 0 పరుగులకు అవుటయ్యారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 25 పరుగుల స్కోరుకు అవుటయ్యే సమయానికి భారత్ 83 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది. అప్పటికే స్టార్క్ 3 వికెట్లతో చెలరేగిపోయాడు.

దీంతో మిడిలార్డర్ జోడీ కెఎల్ రాహుల్- రవీంద్ర జడేజాలపైన భారం పడింది. ఈ ఇద్దరూ సంయమనంతో, బాధ్యతాయుతంగా ఆడి 6వ వికెట్ కు 108 పరుగుల అజేయ భాగస్వామ్యంతో..మరో 61 బంతులు మిగిలి ఉండగానే తమజట్టుకు 5 వికెట్ల అపూర్వ విజయం అందించారు. రాహుల్ -జడేజా జోడీ 56 సింగిల్స్ తీయటం ఈ మ్యాచ్ కే హైలైట్ గా మిగిలిపోతుంది.

రవీంద్ర జడేజా 69 బంతుల్లో 45 పరుగుల నాటౌట్, రాహుల్ 91 బంతుల్లో 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా బోణీ..

ఇప్పటి వరకూ భారతజట్టు టీ-20 మ్యాచ్ ల్లోనే నాయకత్వం వహించిన హార్థిక్ పాండ్యా..వన్డే కెప్టెన్ గానూ తొలివిజయంతో శుభారంభం చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ..సిరీస్ లోని తొలివన్డేకి అందుబాటులో లేకుండాపోడంతో..జట్టు పగ్గాలను వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా చేపట్టి తనజట్టుకు 5 వికెట్ల ఫైటింగ్ విజయాన్ని అందించగలిగాడు.

2013 తర్వాత నుంచి ఆస్ట్ర్రేలియా- భారత్ జట్లు తలపడిన మొత్తం 33 వన్డేలలో టాప్ ర్యాంకర్ భారత్ కు ఇది 17 వ గెలుపు. 2012 తర్వాత ముంబై వాంఖడే స్టేడియంలో వరుస పరాజయాలు చవిచూస్తూ వచ్చిన భారత్ కు ఇదే తొలిగెలుపు కావడం విశేషం.

భారత్ 54- ఆస్ట్ర్రేలియా 80

ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డే వరకూ భారత్, ఆస్ట్ర్రేలియాజట్లు 144 వన్డేలలో తలపడితే..కంగారూజట్టు 80 విజయాలతోనూ , భారత్ 54 విజయాలతోనూ నిలిచాయి.

భారతగడ్డపై ఈ రెండుజట్ల నడుమ జరిగిన 64 వన్డేలలో చెరో 30 విజయాలతో సమఉజ్జీలుగా నిలిచాయి.

సిరీస్ లోని రెండో వన్డే విశాఖపట్నంలోని ఆంధ్ర క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం జరుగనుంది.

Next Story