Telugu Global
Sports

శ్రీలంక గాయాలకు క్రికెట్ మందు!

దుబాయ్ వేదికగా ముగిసిన 15వ ఆసియాకప్ విజేత శ్రీలంకజట్టుకు ఆ దేశఅభిమానులు బ్రహ్మరథం పట్టనున్నారు. రాజధాని కొలంబో నగరంలో నిర్వహించే విజయోత్సవ ర్యాలీలో ఆసియాకప్ హీరోలు ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణిస్తూ సంబరాలు జరుపుకోనున్నారు.

శ్రీలంక గాయాలకు క్రికెట్ మందు!
X

దుబాయ్ వేదికగా ముగిసిన 15వ ఆసియాకప్ విజేత శ్రీలంకజట్టుకు ఆ దేశఅభిమానులు బ్రహ్మరథం పట్టనున్నారు. రాజధాని కొలంబో నగరంలో నిర్వహించే విజయోత్సవ ర్యాలీలో ఆసియాకప్ హీరోలు ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణిస్తూ సంబరాలు జరుపుకోనున్నారు...

శ్రీలంక...హిందూమహాసముద్రంలో భారత్ కు దక్షిణకొసన కొలువుతీరిన అందమైన ద్వీపదేశం. 2 కోట్ల 20 లక్షల జనాభా కలిగిన ఈ దేశం రాజకీయనాయకుల నిర్వాకంతో

కొద్దివారాల క్రితమే అంతర్జాతీయంగా దివాళాతీసింది. చమురుదిగుమతులకు అవసరమైన విదేశీమారక ద్రవ్యం కొరతతో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటాయి.

ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా మారడంతో అంతర్యుద్ధం పరిస్థితులు నెలకొన్నాయి. కోపోద్రిక్తులైన ప్రజలు అధ్యక్షభవనంపై దాడికి దిగడంతో దేశాధ్యక్షుడు గొట్టబయ రాజపక్స దేశం విడిచి సింగపూర్ కు పలాయనం చిత్తగించారు.

దేశపరిస్థితి అల్లకల్లోలంగా మారడంతో అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త రనీల్ విక్రమసింగే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పరిస్థితి చక్కదిద్దటానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొలంబో వేదికగా జరగాల్సిన 2022 ఆసియాకప్ క్రికెట్ టోర్నీని నిర్వహించలేమంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. దీంతో..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పోటీలు నిర్వహించడానికి ఆసియాక్రికెట్ మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది.

అశాంతిని అధిగమించి...

దేశమంతా అనిశ్చితి, అశాంతి పరిస్థితులు నెలకొన్న స్థితిలో దసున్ సనక నాయకత్వంలోని శ్రీలంకజట్టు గుండెదిటవు చేసుకొని ఆసియాకప్ టోర్నీ బరిలోకి దిగింది.

గ్రూప్ - బీ లీగ్ ప్రారంభమ్యాచ్ లో అప్ఘనిస్థాన్ చేతిలో అనుకోని ఓటమి ఎదురైనా..ఆ తర్వాత ఆడిన ఐదుకు ఐదుమ్యాచ్ లూ నెగ్గడం ద్వారా ఆరోసారి శ్రీలంకజట్టు ఆసియాకప్ చాంపియన్ గా నిలిచింది. తమ విజయం ద్వారా దేశంలోని లక్షలాదిమంది అభిమానులకు అంతులేని ఆనందం కలిగించింది.

ఇదే మొదటిసారి కాదు...

దులీప్ మెండిస్ , సనత్ జయసూర్య, కుమార సంగక్కర, మహేల జయవర్థనే, లాసిత్ మలింగ, ముత్తయ్య మురళీధరన్ లాంటి ప్రపంచమేటి క్రికెటర్లు ఎందరినో అందించిన

ఘనత శ్రీలంక క్రికెట్ కు ఉంది. అంతేకాదు..గతంలోనే టీ-20, వన్డే ప్రపంచకప్ టో్ర్నీలలో విజేతగా నిలిచిన రికార్డు శ్రీలంక పేరుతో ఉంది.

ఇక ..ఆసియాదేశాలలో అత్యుత్తమ జట్టు ఏదో తేల్చుకోడానికి ఆసియాక్రికెట్ మండలి 1984 నుంచి నిర్వహిస్తూ వస్తున్న ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో ఇప్పటి వరకూ ఆరుసార్లు విజేతగా నిలిచిన ఘనత శ్రీలంకకు మాత్రమే దక్కుతుంది.

గతంలోనే వన్డే ప్రపంచకప్, టీ-20 ప్రపంచకప్, ఐదుసార్లు ఆసియాకప్ నెగ్గినా కలగని ఆనందం, సంతోషం ప్రస్తుత ఆసియాకప్ విజయంతో శ్రీలంక అభిమానులు, రాజకీయనాయకుల్లో కలిగింది.

స్వదేశంలో ఘనస్వాగతం...

దుబాయ్ నుంచి ఆసియాకప్ తో కొద్దిగంటల క్రితం స్వదేశానికి చేరిన శ్రీలంకజట్టు సభ్యులకు కొలంబోలోని బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రీడామంత్రిత్వశాఖ అభిమానులు ఘనస్వాగతం పలికారు.

మంగళవారం సాయంత్రం కొలంబో నుంచి కటునాయకే వరకూ నిర్వహించే విక్టరీ పరేడ్ లో ఆసియాకప్ హీరోలు.ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణిస్తూ అభిమానులతో కలసి సంబరాలు జరుపుకోనున్నారు.

2022 ఆసియా నెట్ బాల్ పోటీలలో విజేతగా నిలిచిన శ్రీలంకజట్టు సభ్యులు సైతం...క్రికెటర్లతో కలసి విజయోత్సవాలలో పాలుపంచుకోనున్నారు.

నమ్మకం, ఆత్మవిశ్వాసమే ప్రధానం...

ఆత్మవిశ్వాసం, నమ్మకమే ప్రస్తుత ఆసియాకప్ లో తమ విజయానికి కారణమని శ్రీలంక కెప్టెన్ కమ్ ఆల్ రౌండర్ దసున్ సనక ప్రకటించాడు. దేశంలోని అనిశ్చితి వాతావరణం, ప్రతికూల పరిస్థితుల్లో సైతం తమజట్టు ఐక్యంగా ఉందని, జట్టు సభ్యుల్లో నమ్మకం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో తనవంతు ప్రయత్నం చేశానని సనక చెప్పాడు. ఎంత ప్రతిభ ఉన్నా విజేతగా నిలవాలంటే నమ్మకం ఉండాలని సనక చెప్పుకొచ్చాడు.

మరోవైపు...విపత్కర పరిస్థితుల్లో తమ ఆటగాళ్లు గొప్పవిజయం సాధించడం ద్వారా దేశప్రజల్లో సంతోషాన్ని నింపారంటూ దేశాధ్యక్షుడు రనీల్ విక్రమసింగే ఓ సందేశం ద్వారా కొనియాడారు.

పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఎలా విజేతలుగా నిలువవచ్చునో తమ క్రికెటర్లు తమ ఆటతీరుతో నిరూపించారని రనీల్ విక్రమసింగే గుర్తు చేశారు. తమ క్రికెట్ జట్టు సాధించిన విజయం స్పూర్తితో దేశం సైతం ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి బయటపడగలదన్న విశ్వాసాన్ని దేశాధ్యక్షుడు వ్యక్తం చేశారు.

మొత్తం మీద..గొట్టబయ రాజపక్స లాంటి రాజకీయనాయకులు తమ అనుచిత నిర్ణయాలతో దేశానికి చేసిన గాయాలకు...క్రికెటర్ భానుక రాజపక్స తన ఆటతీరుతో

మందు వేయగలిగాడు.

పాకిస్థాన్ తో ముగిసిన ఫైనల్లో మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగిన భానుక రాజపక్స ఒంటరిపోరాటం చేసి 71 పరుగుల అజేయస్కోరుతో తనజట్టుకు 23 పరుగుల సంచలన విజయం అందించడం ద్వారా హీరోగా నీరాజనాలు అందుకొంటున్నాడు.

నింగినితాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న శ్రీలంక ప్రజల గాయాలకు ఆసియాకప్ విజయంతో క్రికెట్ హీరోలు వేసిన మందు ఎంత వరకూ పనిచేస్తుందో మరి.!

First Published:  13 Sep 2022 6:05 AM GMT
Next Story