Telugu Global
Sports

దిగ్గజాల మాట.. విజయాల బాట!

ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ లో భారత్ ఓటమికి, పాక్, ఇంగ్లండ్ జట్ల విజయాలకు కారణమేంటో పలువురు క్రికెట్ దిగ్గజాలు, నిపుణులు బయటపెట్టారు. పరోక్షంగా బీసీసీఐనే తప్పుపట్టారు..

దిగ్గజాల మాట.. విజయాల బాట!
X

ప్రపంచకప్ సెమీఫైనల్లోనే ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్ ఘోరపరాజయం చవిచూడటం పట్ల పలువురు విఖ్యాత క్రికెట్ దిగ్గజాలు తమతమ విశ్లేషణలు బయట పెట్టారు. ప్రస్తుత గ్లోబలైజేషన్ రోజుల్లో బీసీసీఐ గిరిగీసుకు కూర్చొనే విధానమే భారతజట్టు కొంపముంచిందని తేల్చి చెప్పారు.

వైఫల్యానికి అదేకారణం..

టీ-20 ఫార్మాట్లో గత ఏడాది కాలంగా అత్యధికమ్యాచ్ లు నెగ్గడంతో పాటు..అత్యధిక సిరీస్ విజయాలు సాధించిన టాప్ ర్యాంకర్ భారత్..ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల ఘోరపరాజయం పొందటానికి అసలు కారణాన్ని విఖ్యాత క్రికెట్ శిక్షకుడు, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బయట పెట్టాడు. ఇంగ్లండ్ విజయానికి, భారత పరాజయానికి తేడా ఏంటో తెలియ చెప్పారు. భారత క్రికెటర్లను కేవలం ఐపీఎల్ కే పరిమితం చేయడంతో విదేశీ వికెట్ల పైన ఆడిన అనుభవం లేకుండా పోయిందని, ..అదే ఇంగ్లండ్ ఆటగాళ్లను చూస్తే..విదేశీలీగ్ ల్లో , ప్రధానంగా ఆస్ట్ర్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ లో పాల్గొన్న అనుభవం పుష్కలంగా ఉండడంతో సఫలం కాగలిగారని తెలిపాడు.ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీ జోస్ బట్లర్- అలెక్స్ హేల్స్ కు అడిలైడ్ ఓవల్ తో పాటు కంగారూల్యాండ్ లోని పలు స్టేడియాలలో ఆడిన అనుభవం ఎంతో ఉందని గుర్తు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అలెక్స్ హేల్స్ కు అడిలైడ్ ఓవల్ హోం గ్రౌండ్ లాంటిదని, అదే గ్రౌండ్లో బిగ్ బాష్ లీగ్ ఆడుతూ టన్నుల కొద్దీ పరుగులు సాధించిన అనుభవం ఉందని, ఆ అనుభవంతోనే భారత బౌలర్లను చితకబాదాడని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చారు. భారతసీనియర్ క్రికెటర్ అశ్విన్ కు కంగారూ పిచ్ లపై టెస్టుమ్యాచ్ లు ఆడిన అనుభవం మాత్రమే ఉందని, అలాగే సూర్యకుమార్ యాదవ్, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ లాంటి పలువురు తొలిసారిగా ఆస్ట్రేలియాలో టీ-20 మ్యాచ్ లు ఆడటం విజయావకాశాలను ప్రభావితం చేసినట్లు వివరించారు. భారత క్రికెటర్లను విదేశీలీగ్ ల్లో ఆడటానికి అనుమతిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

యువక్రికెటర్లకు అనుమతి ఇవ్వండి- కుంబ్లే

2024 టీ-20 ప్రపంచకప్ లో భారతజట్టు మెరుగైన ప్రదర్శన చేయాలంటే బీసీసీఐ పెద్దమనసుతో వ్యవహరించాలని భారత మాజీ చీఫ్ కోచ్ అనీల్ కుంబ్లే సూచించారు. వెస్టిండీస్, అమెరికా క్రికెట్ సంఘాల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న వచ్చే టీ-20 ప్రపంచకప్ కు ముందే..భారత యువక్రికెటర్లకు అక్కడి పిచ్ లపైన ఆడిన అనుభవం రావాలంటే..కరీబియన్ ప్రీమియర్ లీగ్, అమెరికన్ ప్రీమియర్ లీగ్ ల్లో పాల్గొనటానికి అనుమతించాలని సలహా ఇచ్చారు. ఏ దేశానికి ఆ దేశమే సొంతంగా క్రికెట్ లీగ్ లు నిర్వహించుకొంటూ విదేశీ ఆటగాళ్లను అనుమతిస్తున్నాయని, అలాగే తమ ఆటగాళ్లను సైతం విదేశీలీగ్ ల్లో పాల్గొనేలా చేయటం ద్వారా లబ్ది పొందుతున్నట్లు కుంబ్లే గుర్తుచేశారు. వివిధ క్రికెట్ లీగ్ ల్లో పాల్గొనడం ద్వారా యువక్రికెటర్లకు చేకూరే అనుభవం, లాభం అంతాఇంతా కాదని, పాకిస్థాన్ విజయవంతమైన టీ-20జట్టుగా నిలవడానికి అదే ప్రధానకారమణమని కుంబ్లే తేల్చిచెప్పారు.

Advertisement

బ్యాటర్ కమ్ బౌలర్లూ కావాలి..

స్పెషలిస్టు బౌలర్లు సైతం తమ తమ జట్లకు బ్యాటర్లుగా కీలక పరుగులు సాధించి పెడుతుంటే.. స్పెషలిస్ట్ బ్యాటర్లు అవసరమైన సమయంలో ఎందుకు బౌలర్లుగా బాధ్యత తీసుకోరంటూ కుంబ్లే ప్రశ్నించాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఆల్ రౌండ్ క్రికెటర్లకే భారతజట్టులో చోటు కల్పించాలని, స్పెషలిస్టులంటూ ముద్రవేసి బాధ్యతలు పరిమితం చేయరాదని అభిప్రాయపడ్డారు.

ద్వారాలు తెరవండి- గవాస్కర్

ప్రపంచీకరణతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో బీసీసీఐ గిరిగీసుకు కూర్చొనే విధానాలు భారత క్రికెట్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నట్లు విఖ్యాత కామెంటీటర్, భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విశ్లేషించారు. విదేశీ క్రికెటర్లకు మన ద్వారాలు తెరిచి స్వాగతం పలుకుతున్నప్పుడు..భారత క్రికెటర్లకు ఆ అవకాశం ఎందుకివ్వరంటూ బీసీసీఐని గవాస్కర్ నిలదీశారు. భారత్ క్రికెటర్లను కేవలం ఐపీఎల్ కే పరిమితం చేయకుండా..విదేశీ క్రికెట్ లీగ్ ల్లో పాల్గొనటానికి అనుమతించాలని, ఇప్పటికైనా బీసీసీఐ కళ్లు తెరవాలని సలహా ఇచ్చారు.

Next Story