Telugu Global
Sports

అయోమయం..బుమ్రా భవితవ్యం ?

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చుతుందేమో కానీ..ఒక్క గాయం క్రికెటర్ల కెరియర్ ను గాడితప్పేలా చేస్తుందనటానికి భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా అనుభవమే నిదర్శనం...

అయోమయం..బుమ్రా భవితవ్యం ?
X

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చుతుందేమో కానీ..ఒక్క గాయం క్రికెటర్ల కెరియర్ ను గాడితప్పేలా చేస్తుందనటానికి భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా అనుభవమే నిదర్శనం....

క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ భారత తురుపుముక్క, మెరుపు ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా కెరియర్ గందరగోళంగా మారింది. వెన్నెముక గాయం బుమ్రా భవితవ్యాన్ని

ప్రశ్నార్థకంగా మారింది.

అంతర్జాతీయ క్రికెట్లో భారత్, ఐపీఎల్ ముంబై ఫ్రాంచైజీ కీలక బౌలర్ గా ఉన్న బుమ్రా గతేడాది జరిగిన టీ-20 ప్రపంచకప్ నుంచి గాయంతో భారతజట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు.

ప్రపంచ మేటిబౌలర్ బుమ్రా...

ప్రపంచక్రికెట్లో జస్ ప్రీత్ బుమ్రా కు నాణ్యమైన పేస్ బౌలర్ గా పేరుంది. సాంప్రదాయ టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్...ఫార్మాట్ ఏదైనా ఒకేతీరుగా రాణించడం, ప్రభావశీలమైన ఫాస్ట్ బౌలర్ గా బుమ్రాకు తిరుగులేని రికార్డే ఉంది. యార్కర్లు సంధించడంలో బుమ్రా తర్వాతే ఎవరైనా.

అయితే..గత మూడేళ్లుగా బుమ్రా ఎడాపెడా క్రికెట్ మ్యాచ్ లు ఆడేస్తూ తరచూ గాయాలకు గురికావడం భారతజట్టు విజయావకాశాలను దెబ్బతీస్తూ వస్తోంది. కీలక సిరీస్ లు, టోర్నీల సమయంలో బుమ్రా భారతజట్టుకు అందుబాటులో లేకుండా పోడం తీవ్రప్రభావాన్ని చూపుతోంది.

ప్రపంచకప్, టెస్టులీగ్ లకు దూరం...

జస్ ప్రీత్ బుమ్రాను వెన్నెముక గాయం వెంటాడుతూనే ఉంది. చికిత్స తీసుకొన్నా, శస్త్ర్రచికిత్స చేయించుకొన్నా ఫిట్ నెస్ ఏమాత్రం మెరుగుపడకపోగా..సమస్య మరింత జఠిలంగా మారింది.

ఆస్ట్ర్రేలియా వేదికగా గతేడాది ముగిసిన టీ-20 ప్రపంచకప్ కు మాత్రమే కాదు..టెస్టు లీగ్ లో భాగంగా జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కు, 2023 ఐపీఎల్ సీజన్ కు దూరం కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.

వాస్తవానికి.. ఆస్ట్ర్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి రెండుటెస్టులకు బుమ్రా అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఎంపిక సంఘం గతంలోనే ప్రకటించింది. అయితే..గాయం తిరగబెట్టడంతో మరో సర్జరీ అవసరమని వైద్యనిపుణులు సలహా ఇవ్వడంతో..మరో ఆరుమాసాలపాటు క్రికెట్ కు దూరం కానున్నాడు.

న్యూజిలాండ్ లో బుమ్రాకు ఆపరేషన్..

వెన్నెముక గాయంతో విలవిలలాడుతున్న బుమ్రాకు న్యూజిలాండ్ లో సర్జరీ చేయించాలని బీసీసీఐ నిర్ణయించింది. స‌ర్జరీ కోసం బుమ్రాను న్యూజిలాండ్‌కు పంపాలని నిర్ణయించింది. ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్‌ జోఫ్రా అర్చ‌ర్‌కు వైద్యం చేసిన వైద్యుడు రోవ‌న్ షౌట‌ర్...భారత పేసర్ బుమ్రాకు సైతం శస్త్రచికిత్స నిర్వహించనున్నారు.

గాయం కార‌ణంగా గత ఐదు నెల‌లుగా క్రికెట్ కు దూరంగా ఉన్న బుమ్రా ..వెన్నెముక గాయం నుంచి పూర్తిగా కోలుకోలేని కారణంగా 2023 ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. షేన్‌బాండ్ స‌ల‌హాతో..

ముంబై ఫ్రాంచైజీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ సలహాలు, సూచనల మేరకే బుమ్రాకు న్యూజిలాండ్ ప్రముఖ వైద్యునితో శస్త్రచికిత్స చేయించాలని నిర్ణయించారు.

అక్లాండ్‌లో ప్రముఖ వైద్యుడిగా పేరున్న రోవ‌న్ గ‌తంలో న్యూజిలాండ్ ఆట‌గాళ్లకు సైతం చికిత్సి అందించడం ద్వారా సత్వరమే కోలుకొనేలా చేశారు. ప్ర‌స్తుతం ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంఛైజీకి బౌలింగ్ కోచ్‌గా షేన్‌బాండ్‌ సైతం గతంలో చికిత్స తీసుకొన్నాడు.బీసీసీఐ వైద్య బృందం, జాతీయ క్రికెట్ అకాడ‌మీ కలసి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు సమాచారం. స‌ర్జ‌రీ అనంతరం బుమ్రా కోలుకునేందుకు 20 నుంచి 24 వారాలు ప‌ట్ట‌నుంది. దాంతో, అత‌ను ఐపీఎల్‌తో పాటు వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైన‌ల్ మ్యాచ్‌కు దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంది. అయితే. స్వ‌దేశంలో అక్టోబ‌ర్ నెల‌లో జ‌రిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు బుమ్రాను ఫిట్‌గా ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది.

2022 సెప్టెంబర్లో చివరిసారిగా..

గత ఏడాది సెప్టెంబ‌ర్‌లో చివ‌రిగా మైదానంలోకి బుమ్రా దిగాడు. వెన్నెముక భాగంలో నొప్పితో బాధ‌ప‌డుతున్న బుమ్రాకు ఎన్‌సీఏలో స్కాన్ తీయిస్తే స‌మ‌స్య తీవ్రంగా ఉంద‌ని తెలిసింది. దాంతో, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సైతం ఆడ‌లేదు. అయితే.. ఈమ‌ధ్యే అత‌డిని శ్రీ‌లంక వ‌న్డే సిరీస్‌కు ఎంపిక చేసిన బీసీసీఐ వెంట‌నే పక్కన పెట్టింది. అత‌ను పూర్తిగా కోలుకునేందుకు మ‌రింత స‌మ‌యం ఇవ్వాల‌నుకుంది. అయితే.. బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీ వ‌ర‌కైనా అత‌ను ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని అంతా అనుకున్నారు. కానీ, బుమ్రాకు ఎన్‌సీఏ నుంచి ఫిట్ నెస్ సర్టిఫికెట్ దక్కలేదు.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు ద్వారా ఏడాదికి 7 కోట్ల రూపాయలు అందుకొంటున్న బుమ్రా..ఐపీఎల్ కాంట్రాక్టుపై ముంబై ఫ్రాంచైజీ నుంచి సీజన్ కు 7 కోట్ల రూపాయల చొప్పున ఆర్జిస్తున్నాడు.

29 సంవత్సరాల బుమ్రా భారత్ తరపున 72 వన్డేలు, 60 టీ-20 మ్యాచ్ లు, 30కి పైగా టెస్టులు , ఐపీఎల్ లో ముంబై తరపున 120 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది.

ఐపీఎల్ లో గత సీజన్ వరకూ 145 వికెట్లు పడగొ్ట్టాడు.

టెస్టుల్లో 128 వికెట్లు, వన్డేలలో 121 వికెట్లు, టీ-20ల్లో 70 వికెట్లు పడగొట్టిన రికార్డు బుమ్రా కు ఉంది.

క్రికెట్ కు బుమ్రా ఎంతకాలం దూరంగా ఉంటే..అంతకాలంపాటు ఇటు భారతజట్టు, అటు ముంబై ఇండియన్స్ నష్టపోక తప్పదు. వ్యక్తిగతంగా బుమ్రాకు సైతం నష్టమే.

First Published:  8 March 2023 4:56 AM GMT
Next Story