Telugu Global
Sports

పాక్‌తో నేడు భారత్ అమీతుమీ

గ్రూపు టాపర్ ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో నిలవడానికి మిగిలిన మూడు జట్లు తహతహలాడుతున్నాయి. భారత్ నాకౌట్ రౌండ్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్, బార్బడోస్ జట్లను ఓడించి తీరాల్సి ఉంది.

పాక్‌తో నేడు భారత్ అమీతుమీ
X

కామన్వెల్త్ గేమ్స్ మహిళా క్రికెట్ గ్రూప్ - ఏ లీగ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల చావోరేవో సమరానికి బర్మింగ్ హామ్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. తమ గ్రూప్ ప్రారంభ మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్లతో ఓడిన భారత్ కు, బార్బడోస్ చేతిలో పరాజయం చవిచూసిన పాక్ జట్లకు ఈ పోరు కీలకంగా మారింది. ఆస్ట్రేలియా, భారత్, బార్బడోస్, పాకిస్థాన్‌ జట్లతో కూడిన ఈ గ్రూప్ మొదటి రెండుస్థానాలలో నిలిచిన జట్లకే సెమీ ఫైనల్స్ చేరే అవకాశం ఉంది. దీంతో..గ్రూపు టాపర్ ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో నిలవడానికి మిగిలిన మూడు జట్లు తహతహలాడుతున్నాయి. భారత్ నాకౌట్ రౌండ్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్, బార్బడోస్ జట్లను ఓడించి తీరాల్సి ఉంది.



భారత్ దే పైచేయి..

మహిళా టీ-20 క్రికెట్లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ భారత్‌దే పైచేయిగా ఉంది. ప్రస్తుత కామన్వెల్త్ గేమ్స్ కు ముందు వరకూ భారత్, పాక్ జట్లు మొత్తం 11సార్లు తలపడితే భారత్ 9 విజయాలు, పాక్ 2 విజయాలు నమోదు చేశాయి. భారత్ 81.81 విజయ శాతం నమోదు చేస్తే.. పాక్ జట్టు 18.18 విజయశాతం మాత్రమే సాధించగలిగింది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు ఎక్కువ మంది యువ ప్లేయర్లతో ఉరకలేస్తోంది. షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగేజ్, స్మృతి మంథానా లాంటి మేటి బ్యాటర్లతో భారత బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆల్ రౌండర్ మారూఫ్ నాయకత్వంలోని పాక్ జట్టు లో అనుభవం ఉన్న ప్లేయర్లు పలువురు ఉన్నా నిలకడలేమితో కొట్టి మిట్టాడుతోంది. ఈ కీలక సమరంలో ఓడిన జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించక తప్పదు.



తొలిసారిగా మహిళా క్రికెట్..

అలనాటి ఆంగ్ల పాలిత ప్రాంతాల క్రీడలు కామన్వెల్త్ గేమ్స్ 7 దశాబ్దాల చరిత్రలో.. మహిళా క్రికెట్‌ను ఓ పతకం అంశంగా నిర్వహించడం ఇదే మొదటిసారి. గతంలో 1998లో కౌలాలంపూర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారిగా పురుషుల వన్డే క్రికెట్ ను నిర్వహించారు. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా బంగారు పతకం సాధించింది. ఆ తర్వాత 24 సంవత్సరాలకు బర్మింగ్ హామ్ కామన్వెల్త్‌ గేమ్స్ లో మహిళా టీ-20 క్రికెట్ కు అవకాశం కల్పించారు. 2022 కామన్వెల్త్ గేమ్స్ బరిలో మొత్తం ఎనిమిది అగ్రశ్రేణి జట్లు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీ పడుతున్నాయి. ఈ టోర్నీని గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ గా నిర్వహిస్తున్నారు. గ్రూప్- ఏలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, భారత్, బార్బడోస్ తలపుడుతుంటే.. గ్రూప్- బి లీగ్ లో ఆతిథ్య ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు ఢీ కొంటున్నాయి. జూలై 29 నుంచి ఆగస్టు 4 వరకూ గ్రూప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఆగస్టు 6న సెమీఫైనల్స్ , ఆగస్టు 7న కాంస్యంతో పాటు స్వర్ణ-రజత విజేతల మ్యాచ్ లు నిర్వహిస్తారు.

First Published:  31 July 2022 4:58 AM GMT
Next Story