Telugu Global
Sports

కామన్వెల్త్ గేమ్స్.. గెలిచే మ్యాచ్ చేజార్చుకున్న టీమ్ ఇండియా

లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడిన సమయంలో టీమ్ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరించి భారీ మూల్యం చెల్లించుకుంది.

కామన్వెల్త్ గేమ్స్.. గెలిచే మ్యాచ్ చేజార్చుకున్న టీమ్ ఇండియా
X

బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి మహిళా క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. గ్రూప్ మ్యాచ్‌లో భాగంగా భారత మహిళా జట్టు ఇవాళ ఆస్ట్రేలియా మహిళా జట్టుతో తలపడింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడిన సమయంలో టీమ్ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరించి భారీ మూల్యం చెల్లించుకుంది. ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన, షెఫాలి వర్మ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. స్మృతి మంధాన వరుసగా బౌండరీలు బాదుతూ వేగంగా ఆడింది. దూకుడు మీద ఉన్న స్మృతి మంధాన (24) డార్సీ బ్రౌన్ బౌలింగ్‌లో హీలీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. తర్వాత వచ్చిన యాస్తిక భాటియా (8) షెఫాలీతో కలసి రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించింది. యాస్తిక ఔటైన తర్వాత షెఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కలిసి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లపై విచురుకు పడ్డారు. 33 బంతుల్లో 48 పరుగులు చేసిన షెఫాలీ.. జోనస్సేన్ బౌలింగ్‌లో హీలీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది.

ఆ తర్వాత మిగిలిన భారత బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. హర్మన్ ప్రీత్ కౌర్ (52) చివరి ఓవర్ వరకు నిలిచినా.. భారీ టార్గెట్‌ను సెట్ చేయలేకపోయింది. డెత్ ఓవర్లలో ఆసీస్ బౌలర్లు వికెట్లు తీయడంతో భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేసింది.

155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను రేణుక సింగ్ దెబ్బ తీసింది. రేణుక ధాటికి టాపార్డర్ మొత్తం తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరింది. ఆలిస్సా హీలీ (0), బెత్ మూనీ (10), మెగ్ లాన్నింగ్ (8), తాహిల మెక్‌గ్రాత్ (14)లను రేణుక పెవీలియన్ పంపించింది. రేచెల్ హేన్స్ (9)ను దీప్తి శర్మ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే అప్పుడే భారత జట్టు నిర్లక్ష్యంగా ఆడింది.

ఆష్లే గార్డెనర్ (52), గ్రేస్ హారిస్(37) లను కట్టడి చేయడంలో విఫలమైంది. వీరిద్దరూ భారత బౌలర్లపై విరుచుకపడ్డారు. వేగంగా పరుగులు తీస్తూ లక్ష్యం వైపు ఆసీస్‌ను తీసుకెళ్లారు గ్రేస్, జోనస్సేన్‌లు అవుటైనా.. అలానా కింగ్ (18)తో కలసి గార్డెనర్ లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జూలై 31న భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తప్పకుండా విజయం సాధిస్తేనే సెమీఫైనల్‌కు చేరుతుంది.

First Published:  29 July 2022 2:28 PM GMT
Next Story