Telugu Global
Sports

కామన్వెల్త్ గేమ్స్ కుస్తీలో భారత్ మస్త్ మస్త్.. వినేశ్ గోల్డెన్ హ్యాట్రిక్.. కుస్తీలోనే 12 పతకాలు

మహిళల 53 కిలోల విభాగం కుస్తీలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ పోగట్ వరుసగా మూడోసారి బంగారు పతకం సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది. కామన్వెల్త్ గేమ్స్ కుస్తీలో స్వర్ణ పతకాలు సాధించడం వినేశ్ పోగట్ కు ఇది మూడోసారి.

కామన్వెల్త్ గేమ్స్ కుస్తీలో భారత్ మస్త్ మస్త్.. వినేశ్ గోల్డెన్ హ్యాట్రిక్.. కుస్తీలోనే 12 పతకాలు
X

కామన్వెల్త్ గేమ్స్ కుస్తీలో భారత వస్తాదులు వీరవిహారం చేస్తున్నారు. పురుషుల, మహిళల విభాగాలలో ఏకంగా 12 పతకాలు సాధించిపెట్టారు. పోటీల తొమ్మిదోరోజున భారత్ కు పతకాల వరద వచ్చి పడింది. కుస్తీ పురుషుల, మహిళల విభాగాలలో రవి దహియా, వినేశ్ పోగట్, నవీన్ బంగారు పతకాలు అందిస్తే.. పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ లో భవినాబెన్ స్వర్ణపతకం గెలుచుకొంది. లాన్ బౌల్స్ పురుషుల ఫోర్స్ విభాగంలో భారతజట్టు రజత పతకం సాధించగా.. పురుషుల హాకీ, మహిళా క్రికెట్ ఫైనల్స్ కు భారతజట్లు అర్హత సంపాదించాయి. బాక్సింగ్ మహిళల, పురుషుల విభాగాల ఫైనల్స్ కు నిఖత్ జరీన్, నీతు గంగాస్, అమిత్ పంగల్ చేరుకొన్నారు.

Advertisement

గోల్డెన్ రెజ్లర్ వినేశ్ పోగట్..

మహిళల 53 కిలోల విభాగం కుస్తీలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ పోగట్ వరుసగా మూడోసారి బంగారు పతకం సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది. కామన్వెల్త్ గేమ్స్ కుస్తీలో స్వర్ణ పతకాలు సాధించడం వినేశ్ పోగట్ కు ఇది మూడోసారి. కాగా పురుషుల 57 కిలోల విభాగంలో రవి దహియా, 74 కిలోల విభాగంలో నవీన్ బంగారు పతకాలు సాధించారు. పాకిస్థాన్ వస్తాదు మహ్మద్ షరీఫ్ ను నవీన్ చిత్తు చేయడం ద్వారా విజేతగా నిలిచాడు. మహిళల 50 కిలోల విభాగంలో పూజా గెహ్లాట్, 76కిలోల విభాగంలో పూజా సిహాగ్ కాంస్య పతకాలు సాధించారు. పురుషుల 97 కిలోల తరగతిలో దీపక్ నెహ్రా భారత్ కు కాంస్య పతకం అందించాడు. పాకిస్థాన్ వస్తాదు తయాబ్ రాజాను దీపక్ అధిగమించాడు.

Advertisement

ఫైనల్స్ లో నలుగురు భారత బాక్సర్లు..

బాక్సింగ్ పురుషుల, మహిళల విభాగాలలో నలుగురు గోల్డ్ మెడల్ రౌండ్ కు అర్హత సంపాదించారు. పురుషుల సూపర్ హెవీవెయిట్ రౌండ్ ఫైనల్స్ కు సాగర్ అహ్లావాత్ చేరుకోగా మహిళల లైట్ ఫ్లైవెయిట్ తరగతి గోల్డ్ మెడర్ రౌండ్ కు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ అర్హత సంపాదించింది. పురుషుల ఫ్లైవెయిట్ విభాగం ఫైనల్స్ కు అమిత్ పంగల్, మహిళ మినిమమ్ వెయిట్ తరగతి ఫైనల్స్ కు నీతు చేరుకొంది. జాస్మిన్, మహ్మద్ హుసాముద్దీన్ తమతమ విభాగాల్లో సెమీస్ లో పరాజయాలు చవిచూసినా కాంస్య పతకాలు సాధించగలిగారు.

ట్రాక్ అడ్ ఫీల్డ్ లో జంట రజతాలు..

అథ్లెటిక్స్ మహిళల 10,000 మీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి రజత పతకం సాధించింది. పురుషుల 3000మీటర్ల స్టీపుల్ చేజ్ లో అనినాశ్ సాబ్లే సైతం రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారా టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ లో భవినాబెన్ పటేల్ స్వర్ణ, సోనాల్ బెన్ పటేల్ కాంస్య పతకాలు గెలుచుకొన్నారు. పురుషుల లాన్ బాల్స్ ఫోర్స్ ఫైనల్లో నార్దర్న్ ఐర్లాండ్ చేతిలో ఓటమి పొందిన భారత జట్టు రజత పతకం అందుకొంది


బ్యాడ్మింటన్ సెమీస్ లో సింధు, శ్రీకాంత్..

బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ కు పీవీ సింధు, పురుషుల సింగిల్స్ సెమీస్ కు కిడాంబీ శ్రీకాంత్, లక్ష్యసేన్ చేరుకొన్నారు. గత కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్య, రజత పతకాలు సాధించిన సింధు ప్రస్తుత క్రీడల్లో బంగారు పతకానికి గురిపెట్టింది. టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్ , మిక్సిడ్ డబుల్స్ ఫైనల్స్ కు తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ జట్లు చేరుకొన్నాయి, సత్యన్ తో జంటగా పురుషుల డబుల్స్, ఆకుల శ్రీజతో జోడీగా మిక్సిడ్ డబుల్స్ సెమీఫైనల్స్ లో శరత్ కమల్ విజయాలు నమోదు చేశాడు.

మహిళా క్రికెట్ జట్టు సంచలనం..

కామన్వెల్త్ గేమ్స్ మహిళల విభాగంలో తొలిసారిగా నిర్వహిస్తున్న టీ-20 క్రికెట్ ఫైనల్స్ కు భారతజట్టు చేరి సంచలనం సృష్టించింది. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ పై 4 పరుగుల సంచలన విజయంతో గోల్డ్ మెడల్ రౌండ్లో అడుగుపెట్టింది. బంగారు పతకం కోసం జరిగే పోరులో ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.


పతకాల పట్టిక 5వ స్థానంలో భారత్..

గేమ్స్ తొమ్మిదో రోజు పోటీలు ముగిసే సమయానికి భారత్ మొత్తం 13 స్వర్ణాలతో పతకాల పట్టిక ఐదోస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 59 స్వర్ణాలతో సహా 155 పతకాలతో పతకాల పట్టిక అగ్రస్థానంలో నిలిచింది. 50 స్వర్ణాలతో సహా మొత్తం 148 పతకాలతో ఆతిథ్య ఇంగ్లండ్ రెండు, 22 బంగారు పతకాలతో సహా 84 పతకాలతో కెనడా మూడు, 17 స్వర్ణాలతో సహా 44 పతకాలతో న్యూజిలాండ్ నాలుగో స్థానాలలో ఉన్నాయి. గత క్రీడల పతకాల పట్టిక మూడోస్థానంలో నిలిచిన భారత్ ..ప్రస్తుత క్రీడలు ముగియటానికి మరో రెండురోజుల పోటీలు మాత్రమే మిగిలిఉండగా..13 స్వర్ణ, 11 రజత, 16 కాంస్యాలతో సహా 40 పతకాలు సంపాదించడం ద్వారా 5వ స్థానంలో కొనసాగుతోంది.

Next Story