Telugu Global
Sports

ముగ్గరూ ముగ్గురే! పేదరికాన్ని జయించిన అసలు సిసలు విజేతలు

ఆకలి, ఆరాటం, పోరాటం ఎక్కడ ఉంటాయో...అక్కడి నుంచే అసలు సిసలు విజేతలు పుట్టుకు వస్తారని మరోసారి తేలిపోయింది.

ముగ్గరూ ముగ్గురే! పేదరికాన్ని జయించిన అసలు సిసలు విజేతలు
X

ఆకలి, ఆరాటం, పోరాటం ఎక్కడ ఉంటాయో...అక్కడి నుంచే అసలు సిసలు విజేతలు పుట్టుకు వస్తారని మరోసారి తేలిపోయింది. అరకొర క్రీడాసౌకర్యాలు, పేదరికం నేపథ్యంలో నిరంతర పోరాటం చేస్తూ వచ్చిన మణిపూర్ మణిపూస మీరాబాయి చాను, మహారాష్ట్ర్ర మొనగాడు సంకేత్ మహదేవ్ సర్గార్, బెంగాలీ బాబు అచింత షియోలీ సాధించిన విజయాలు, పతకాలే నిదర్శనం.

బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 55 కిలోల విభాగంలో యువలిఫ్టర్ సంకేత్ మహదేవ్ రజత పతకంతో భారత పతకాల ఖాతాను తెరిస్తే...మహిళల 49 కిలోల విభాగంలో మీరాబాయి చాను భారత్ కు తొలి బంగారు పతకం అందించింది. మూడోరోజు పోటీలలో పురుషుల 73 కిలోల విభాగంలో అచింత షియోలీ స్వర్ణ పతకంతో సంచలనం సృష్టించాడు.

27 ఏళ్ల మీరాబాయి చాను, 21 సంవత్సరాల సంకేత్ మహదేవ్, 20 ఏళ్ల అచింత షియోలీ ల విజయాలు...దేశంలోని కోట్లాదిమంది యువతకు స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతాయి.

కట్టెల మోపుల మోతతో....

ఈశాన్య భారత రాష్ట్ర్రం మణిపూర్ లోని ఇంఫాల్ కు చెందిన ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఓ చిరుద్యోగ కుటుంబం నుంచి మీరాబాయి చాను వెలుగులోకి వచ్చింది.

విలువిద్యలో మేటి క్రీడాకారిణి కాబోయి అయిష్టంగానే వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో అడుగుపెట్టింది. బాల్యం నుంచే తీవ్రంగా శ్రమించడం అలవాటు చేసుకొన్న మీరాబాయి తన ఎనిమిదిమంది సభ్యుల కుటుంబానికి అవసరమైన వంటచెరుకు కోసం పొరుగునే ఉన్న అడవికి కాలినడకన 20 కిలోమీటర్ల దూరం వెళ్లి కట్టెల మోపులు మోసుకొంటూ రావడం ద్వారా శారీరక పటుత్వాన్ని, శక్తిసామర్థ్యాలను కూడగట్టుకొంది. అనుదినం శ్రమించడమే నిత్యజీవితంగా చేసుకొన్న చానుకి.. ఆ అనుభవమే వెయిట్ లిఫ్టర్ గా రాణించడానికి ఎంతగానో ఉపయోగపడింది.

మణిపూర్ మణిపూస....

వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి శిక్షణ ప్రారంభించిన ఏడాదికాలంలోనే తొలి బంగారు పతకం గెలుచుకొంది.2009 జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల యువజన విభాగంలో విజేతగా నిలిచిన మీరాబాయి కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే 170 కిలోల బరువు ఎత్తే స్థితికి తన సత్తాను పెంచుకొంది.

గ్లాస్గో వేదికగా 2014లో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో మీరాబాయి రజత పతకం బోణీ కొట్టింది.

అయితే ..2016 రియో ఒలింపిక్స్ కు సైతం అర్హత సంపాదించిన చాను క్లీన్ అండ్ జెర్క్,స్నాచ్ విభాగాలలో మొత్తం 192 కిలోల బరువెత్తడం ద్వారా కుంజరాణి దేవి పేరుతో ఉన్న 12 సంవత్సరాల జాతీయ రికార్డును తెరమరుగు చేసింది. ఒలింపిక్స్ లో మాత్రం పతకం సాధించడంలో విఫలమయ్యింది.
విశ్వవిజేతగా...

2017లో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మీరాబాయి బంగారు పతకం సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన చాను 2019 లో దోహా వేదికగా ముగిసిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో స్వర్ణ విజేతగా అవతరించింది. తన పేరుతో ఉన్న జాతీయ రికార్డును తానే మెరుగుపరచుకొంటూ వచ్చింది.2018లో దేశఅత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్నను మీరాబాయి అందుకోడం ద్వారా మణిపూర్ రాష్ట్ర్రానికే గర్వకారణంగా నిలిచింది.

కామన్వెల్త్ గేమ్స్ లో.....

2014 కామన్వెల్త్ గేమ్స్ లో రజతం, 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం, 2022 బర్మింగ్ హామ్ గేమ్స్ లో బంగారు పతకం సాధించడం ద్వారా చాను అరుదైన ఘనతను సొంతం చేసుకోగలిగింది. వరుసగా రెండు కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణపతకాలు సాధించిన భారత తొలి మహిళా వెయిట్ లిఫ్టర్ గా రికార్డుల్లో చేరింది.

ఒలింపిక్స్ లో రజతరాణి....

గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌ తొలి రోజు పోటీలలో భాగంగా నిర్వహించిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను రజత పతకం సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించిన భారత మహిళగా, రజత పతకం నెగ్గిన తొలి మహిళగా మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి రెండుదశాబ్దాల క్రితం కాంస్యం సాధించగా.. ఇప్పుడు మీరాబాయ్ రజతంతో మెరిసి మురిసింది.

అసాధారణ ప్రతిభకు..సంకేతం!

బర్మింగ్ హామ్ గేమ్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన 21 సంవత్సరాల లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గార్ రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబానికి చెందినవాడంటే ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది.

మహారాష్ట్ర్రలోని సాంగ్లీకి చెందిన మహదేవ్ తొలిరోజుల్లో ఓ తోపుడుబండిపై కూరగాయలు విక్రయించాడు. ఆ తర్వాత ఓ టీ కొట్టు, పాన్ డబ్బాల యజమానిగా మారాడు. కుటుంబపోషణ కోసం కిళ్ళీలు కడుతూ, టీ విక్రయిస్తూ..తన కుమారుడు సంకేత్, కుమార్తె కాజల్ లను వెయిట్ లిఫ్టర్లుగా తీర్చి దిద్దడంలో సఫలమయ్యాడు.

తన కుటుంబసభ్యులకు చేదోడువాదోడుగా ఉంటూ వచ్చిన సంకేత్ గత ఏడాది పాటియాలాలో నిర్వహించిన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ శిబిరంలో పాల్గొనడం ద్వారా భారతజట్టులో చోటు సంపాదించాడు.

బర్మింగ్ హామ్ క్రీడల 55 కిలోల విభాగంలో సంకేత్ స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాలలో మొత్తం 248 కిలోల బరువెత్తి రజత పతకంతో సరిపెట్టుకొన్నాడు. ఆఖరి ప్రయత్నంలో స్వర్ణం కోసం ప్రయత్నించడం ద్వారా గాయపడినా దేశానికి, తన కుటుంబానికి గర్వకారణంగా నిలిచాడు.

తనతండ్రి చిరకాల స్వప్నాన్ని కామన్వెల్త్ పతకంతో సాకారం చేయటం తనకు గర్వకారణమని సంకేత్ ప్రకటించాడు.


ఎంబ్రాయిడరీ వర్కర్ షియోలీ...

కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 73 కిలోల విభాగంలో బెంగాల్ కుర్రాడు అచింట షీయూలీ అంచనాలకు మించి రాణించడం ద్వారా మొత్తం 313 కిలోల సరికొత్త రికార్డుతో స్వర్ణపతకం సాధించాడు.

స్నాచ్ విభాగంలో 143 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ లో 170 కిలోలతో మొత్తం 313 కిలోల బరువెత్తడం ద్వారా సరికొత్త రికార్డులు నమోదు చేశాడు. బంగారు పతకం సాధించడం ద్వారా తన గ్రామం డియోల్ పూర్ తో పాటు దేశానికీ గర్వకారణంగా నిలిచాడు.

పశ్చిమబెంగాల్ లోని హౌరా జిల్లా పంచ్లా సబ్ డివిజన్ గ్రామం డియోల్ పూర్ లోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన షియోలీ బాల్యం నుంచే తమకు జీవనాధారంగా నిలిచిన జరీ, ఎంబ్రాయిడరీ కార్మికుడుగా పని చేస్తూ...ఖాళీ సమయాలలో వెయిట్ లిఫ్టింగ్ పై దృష్టి నిలిపాడు.

ప్రతిరోజు ఉదయం 6-30 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎంబ్రాయిడరీ పని చేయకపోతే తమ కుటుంబానికి ఆహారం ఉండదని, తన తండ్రి జగత్ సైతం ట్రాలీ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారని షియోలీ గుర్తు చేసుకొన్నాడు. తండ్రి ప్రేరణ, ఆఖరి కోరికను కామన్వెల్త్ బంగారు పతకంతో తీర్చడం గర్వకారణంగా ఉందని మురిసిపోయాడు.

తాను అంతర్జాతీయ లిఫ్టర్ గా రూపుదిద్దుకోడం వెనుక తన కుటుంబ ప్రోత్సాహం, త్యాగాలు ఎన్ని ఉన్నాయో..తనకు ఆర్థికంగా అండగా నిలిచిన రిలయన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ తోడ్పాటు అంతే ఉందని గుర్తు చేసుకొన్నాడు.

తన అన్న అలోక్ ప్రతి నెలా తనకు 700 రూపాయల చొప్పున జేబుఖర్చులకు ఇచ్చి వెయిట్ లిఫ్టర్ గా కొనసాగడంలో ప్రధానపాత్ర వహించిన విషయం జీవితకాలం గుర్తుంచుకొంటానంటూ మురిసిపోతున్నాడు.

వెయిట్ లిఫ్టర్ గా తనకు లభించిన గుర్తింపు, అవకాశాల ద్వారా కుటుంబానికి అండగా ఉంటానని..రానున్నకాలంలో తాను సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని షియోలీ ప్రకటించాడు.

2024 పారిస్ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా...మీరాబాయి చాను, సంకేత్, అచింత షియోలీ ఇక ముందు శ్రమించనున్నారు.

నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ ముగ్గురు లిఫ్టర్లు దేశమాత ముద్దుబిడ్డలు అంటే అతిశయోక్తి కాదు.
First Published:  2 Aug 2022 7:16 AM GMT
Next Story