Telugu Global
Sports

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కంచుమోత! సౌరవ్ గోశాల్, శంకర్ సరికొత్త చరిత్ర

కామన్వెల్త్ గేమ్స్ 6వ రోజు పోటీలు ముగిసే సమయానికి పతకాల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా..ఇప్పటి వరకూ 6వ‌ స్థానంలో ఉన్న భారత్ 7వ స్థానానికి పడిపోయింది.

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కంచుమోత!  సౌరవ్ గోశాల్, శంకర్ సరికొత్త చరిత్ర
X

బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ 6వ రోజు పోటీలలో భారత అథ్లెట్లు కంచు మోత మోగించారు. స్క్వాష్ పురుషుల సింగిల్స్ లో సౌరవ్ గోశాల్, పురుషుల హైజంప్ లో తేజస్విన్ శంకర్ తొలిసారిగా పతకాలు నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించారు. మహిళల హాకీ, క్రికెట్ మెడల్ రౌండ్లో భారత జట్లు అడుగుపెట్టాయి. బాక్సర్లు అమిత్ పంగల్, హుసాముద్దీన్, నిఖత్ జరీన్ సైతం తమతమ విభాగాలలో క్వార్టర్ ఫైనల్స్ విజయాలు సాధించారు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ హెవీ వెయిట్ విభాగాలలో భారత లిఫ్టర్లు లవ్ ప్రీత్ సింగ్, గురుదీప్ సింగ్ కాంస్య పతకాలు సొంతం చేసుకొన్నారు. గత ఐదురోజులుగా పతకాల పట్టికలో

ఆరో స్థానంలో కొనసాగుతూ వచ్చిన భారత్ 6వ‌రోజు ఫలితాల తర్వాత 7వ స్థానానికి పడిపోయింది.

మహిళల జూడోలో రజతం...

జూడో మహిళల 78 కిలోల విభాగం గోల్డ్ మెడల్ రౌండ్లో భారత జుడోకా తులికా మాన్ తుది వరకూ పోరాడి రజత పతకంతో సరిపెట్టుకొంది. బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయ ఇండోర్‌ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో స్కాట్లాండ్ జుడోకా సారా యాడ్లింగ్టన్ బంగారు పతకం అందుకోగా తులికా వెండి పతకం సాధించింది.

సౌరవ్ గోశాల్ కు అరుదైన పతకం...

కామన్వెల్త్ గేమ్స్ స్క్వాష్ చరిత్రలో పతకం సాధించిన భారత తొలి అథ్లెట్ ఘనతను సౌరవ్ గోశాల్ దక్కించుకొన్నాడు. పురుషుల సింగిల్స్ కాంస్య పతకం పోరులో సౌరవ్ ఆతిథ్య ఇంగ్లండ్ కు చెందిన జేమ్స్ విల్స్ ట్రాప్ ను ఓడించడం ద్వారా రికార్డుల్లో చేరాడు. సౌరవ్ 11-6, 11-1, 11-4తో అలవోక విజయం సాధించాడు. గత కామన్వెల్త్ గేమ్స్ మిక్సిడ్ డబుల్స్ లో రజత పతకం సాధించిన సౌరవ్ గోశాల్ కు ఆసియా క్రీడల సింగిల్స్ లో రజత, స్వర్ణ, మూడు కాంస్య పతకాలు సాధించిన అరుదైన రికార్డు ఉంది.

హైజంప్ లో శంకర్ షో...

2022 కామన్వెల్త్ గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ కు తొలి పతకాన్ని తేజస్విని శంకర్ అందించాడు. పురుషుల హైజంప్ లో శంకర్ అంచనాలకు మించి రాణించడం ద్వారా కాంస్య పతకం అందుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే పురుషుల హైజంప్ లో తొలి పతకం సాధించిన భారత తొలి హైజంపర్ గా శంకర్ చరిత్ర సృష్టించాడు.తన మొదటి రెండు ప్రయత్నాలలోనే 2.22 మీటర్ల ఎత్తు లంఘించడం ద్వారా శంకర్ కాంస్యం దక్కించుకున్నాడు. గత కామన్వెల్త్ గేమ్స్ 6వ స్థానంలో నిలిచిన శంకర్..ప్రస్తుత క్రీడల్లో మొదటి ముగ్గురు అత్యుత్తమ హైజంపర్లలో ఒకడిగా నిలిచాడు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో తుది నిమిషంలో భారత జట్టులో సభ్యుడిగా చేరిన శంకర్ ఏకంగా కాంస్య పతకంతో మెరిశాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో 2.24 మీటర్ల రికార్డు దూకి 6వ స్థానం మాత్రమే సాధించిన శంకర్ 2022 గేమ్స్ లో మాత్రం 2.22 మీటర్ల రికార్డుతోనే కాంస్యం అందుకోడం విశేషం.

వెయిట్ లిఫ్టింగ్ లో జంట కాంస్యాలు...

వెయిట్ లిఫ్టింగ్ పురుషుల హెవీవెయిట్ విభాగంలో భారత్ కు మరో రెండు కంచు పతకాలు దక్కాయి. 109 కిలోల విభాగంలో లవ్ ప్రీత్ సింగ్, గురుదీప్ సింగ్ చేరో కాంస్య పతకం సాధించారు. బాక్సింగ్ మహిళల 50 కిలోల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీఫైనల్ చేరడం ద్వారా ఏదో ఒక పతకం ఖాయం చేసింది. సెమీస్ లో నెగ్గితే రజత లేదా స్వర్ణ...లేదా ఓడితే కనీసం కాంస్య పతకం దక్కించుకునే అవకాశాలున్నాయి. మహిళల 48 కిలోల విభాగంలో నీతు గంగాస్, పురుషుల 57 కిలోల విభాగంలో హుసాముద్దీన్ మహ్మద్ సైతం సెమీస్ చేరడం ద్వారా భారత్ కు మరో రెండు పతకాలు ఖాయం చేశారు. ఒలింపిక్స్ పతక విజేత లవ్లీన్ బోర్గెయిన్ సెమీస్ చేరడంలో విఫలమైంది. క్వార్టర్ ఫైనల్స్ ఓటమితో ఇంటిదారి పట్టింది.

మహిళల హాకీ సెమీస్ లో భారత్...

హాకీ మహిళల సెమీస్ రౌండ్ కు భారత్ అర్హత సంపాదించింది. కెనడాతో జరిగిన గ్రూప్ లీగ్ కీలక సమరంలో భారత్ 3-2 గోల్స్ తో విజేతగా నిలిచింది.రెండో రౌండ్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాజయం నుంచి తేరుకొన్న భారత్...నెగ్గితీరాల్సిన పోరులో కెనడాను అధిగమించగలిగింది. పురుషుల గ్రూప్ లీగ్ పోటీలో భారత్ 8-0 గోల్స్ తో కెనడాను ఓడించడం ద్వారా సెమీస్ కు చేరువైంది. గ్రూప్ ప్రారంభ పోరులో ఘనాను 11-0తో చిత్తు చేసి...ఇంగ్లండ్ తో ముగిసిన రెండో రౌండ్ పోరును 4-4 డ్రాతో సరిపెట్టుకొన్న భారత్ గ్రూపు టాపర్ గా నిలిచింది.

మహిళా క్రికెట్ మెడల్ రౌండ్లో భారత్...

మహిళా క్రికెట్ గ్రూప్ ఆఖరిలీగ్ పోటీలో భారత్ 100 పరుగులతో బార్బడోస్‌ను చిత్తు చేయడం ద్వారా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్ లీగ్ ప్రారంభ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో పోరాడి ఓడిన భారత్.. ఆ తరువాత పాక్ జట్టును అధిగమించడం ద్వారా నాకౌట్ రౌండ్ అవకాశాలను నిలుపుకొంది. బార్బడోస్ తో జరిగిన పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్ షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగేస్ మెరుపు బ్యాటింగ్ తో 162 పరుగుల భారీస్కోరు అందించారు. చేజింగ్ కు దిగిన బార్బడోస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 62 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగింది. ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో ఇంగ్లండ్ లేదా న్యూజిలాండ్ జట్లలో ఏదో ఒక జట్టుతో భారత్ తలపడాల్సి ఉంది. ఏడున్నర దశాబ్దాల కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో మహిళా క్రికెట్ ను పతకం అంశంగా ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.

పతకాల పట్టికలో 7వ స్థానంలో భారత్...

గేమ్స్ 6వ రోజు పోటీలు ముగిసే సమయానికి పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతుండగా..ఇప్పటి వరకూ 6వ‌ స్థానాన్ని అంటిపెట్టుకొంటూ వచ్చిన భారత్ 7వ స్థానానికి పడిపోయింది. మొత్తం 5 స్వర్ణ, 6 రజత, 8 కాంస్యాలతో సహా 19 పతకాలు సాధించింది. 6వ రోజు పోటీలలో భారత అథ్లెట్లు ఓ రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించినా ప్రయోజనం లేకపోయింది. ఇంగ్లండ్, కెనడా, న్యూజిలాండ్, స్కాట్లాండ్, సౌతాఫ్రికా పతకాల పట్టికలో మొదటి ఆరు స్థానాలలో నిలిచాయి.

First Published:  4 Aug 2022 6:15 AM GMT
Next Story