Telugu Global
Sports

ఫ్రెంచ్ ఓపెన్లో కొండతో కూన ఢీ!

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ లో ఓ ఆసక్తికరమైన పోరుకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఫైనల్లో చోటు కోసం కొండ ను ఓ కూన ఢీకొనబోతోంది.

ఫ్రెంచ్ ఓపెన్లో కొండతో కూన ఢీ!
X

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ లో ఓ ఆసక్తికరమైన పోరుకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఫైనల్లో చోటు కోసం కొండ ను ఓ కూన ఢీకొనబోతోంది.....

2023 సీజన్ గ్రాండ్ స్లామ్ రెండోటోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ కు గతేడాది రన్నరప్ కాస్పర్ రూడ్, రెండుసార్లు విజేత నొవాక్ జోకోవిచ్, యువసంచలనం కార్లోస్ అల్ కరాజ్ చేరుకొన్నారు.

మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రెండుసార్లు విన్నర్ ఇగా స్వయిటెక్, సబలెంకా హాట్ ఫేవరెట్లుగా సమరానికి సిద్ధమయ్యారు.

జోకోవిచ్ కు అల్ కరాజ్ గండం...

తన కెరియర్ లో ఇప్పటికే 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గి..రికార్డుస్థాయిలో 23వ టైటిల్ కు గురిపెట్టిన దిగ్గజ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ కు సెమీఫైనల్లో స్పానిష్ యువసంచలనం కార్లోస్ అల్ కరాజ్ రూపంలో ముప్పు పొంచి ఉంది.

ప్రస్తుత టోర్నీలో అల్ కరాజ్ టాప్ సీడ్ గాను, జోకోవిచ్ మూడో సీడ్ గాను టైటిల్ వేటలో ఉన్నారు.

గ్రాండ్ స్లామ్ సెమీస్ లో జోకో 45వసారి...

ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ లో చోటు కోసం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో జోకోవిచ్ గట్టి పోటీ ఎదుర్కొని రష్యన్ ఆటగాడు కరెన్ కచనోవ్ పై విజయం సాధించాడు. 36 సంవత్సరాల జోకోవిచ్ సెమీస్ బెర్త్ కోసం నాలుగుసెట్ల పోరాటం చేయాల్సి వచ్చింది.

ప్రీ-క్వార్టర్స్ వరకూ కనీసం ఒక్క సెట్టూ ఓడకుండా నెగ్గుతూ వచ్చిన జోకోవిచ్ తొలిసారిగా క్వార్టర్స్ లో ప్రత్యర్థికి ఓ సెట్ ను కోల్పోవాల్సి వచ్చింది.

తొలిసెట్ ను 4-6తో ఓడిన జోకోవిచ్ ఆ తర్వాతి మూడు సెట్లలోనూ 7-6, 6-2, 6-4తో 11వ సీడ్ కచనోవ్ ను కంగు తినిపించాడు.

అత్యుత్తమ ఆటగాడిగా నిలవాలంటే..అత్యుత్తమ ప్రత్యర్థులపై నెగ్గితీరక తప్పదని, సెమీస్ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని జోకోవిచ్ ప్రకటించాడు.

జోకోవిచ్ కెరియర్ లో ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరడం ఇది 12వసారి కాగా..గ్రాండ్ స్లామ్ టోర్నీల కెరియర్ లో 45వసారి కావడం విశేషం. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో

అత్యధికంగా రోజర్ ఫెదరర్ 46 సార్లు సెమీస్ చేరుకోగా..45సార్లు చేరడం ద్వారా జోకోవిచ్ ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు.

అల్ కరాజ్ చేతిలో సిటిస్ పాస్ చిత్తు....

మరో క్వార్టర్ ఫైనల్ పోరులో టాప్ సీడ్ ఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ 6-2, 6-1, 7-6 (7/5) తో గ్రీక్ స్టార్ స్టెఫానోస్ సిటిస్ పాస్ పై విజయం సాధించాడు. ఫైనల్లో చోటు కోసం..గ్రాండ్ స్లామ్ టైటిల్స్ శిఖరం నొవాక్ జోకోవిచ్ తో యువకిశోరం అల్ కరాజ్ ఢీ కోనున్నాడు.

గతంలో మాడ్రిడ్ ఓపెన్లో జోకోవిచ్ తో తలపడిన సమయంలో అల్ కరాజ్ విజేతగా నిలిచాడు. పురుషుల టెన్నిస్ లో కొండలాంటి 36 సంవత్సరాల జోకోవిచ్ తో 20 ఏళ్ల కూన అల్ కరాజ్ తలపడనుండడంతో..ఈ పోరు చూడటానికి భారీసంఖ్యలో అభిమానులు తరలిరానున్నారు.

సెమీస్ లో రెండోసారి రూడ్..

గతేడాది రన్నరప్, నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్..ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్స్ కు వరుసగా రెండోసారి చేరుకొన్నాడు. క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ ఆటగాడు హోల్జెర్ రూనీపై 6-1, 6-2, 3-6, 6-3తో రూడ్ విజయం సాధించాడు.

2022 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో రాఫెల్ నడాల్ చేతిలో ఓటమి పొందటం ద్వారా రూడ్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సీజన్ ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీఫైనల్లో 4వ సీడ్ రూడ్..అలెగ్జాండర్ జ్వరేవ్ తో తలపడాల్సి ఉంది.

మహిళల సింగిల్స్ సెమీస్ లో సబలెంకా..

మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ కు రెండుసార్లు విజేత ఇగా స్వయిటెక్, సబలెంకా చేరుకొన్నారు. క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6-4, 6-4తో ఎలెనా స్వితోలినాను అధిగమించింది. సబలెంకాకు ఇది వరుసగా 12వ గెలుపు.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ పోరులో 43వ ర్యాంకర్ కరోలినా ముచోవాతో సబలెంకా తలపడనుంది. మరో క్వార్టర్ ఫైనల్లో అనస్తాసియా పవిల్విచెంకోను 7-5, 6-2తో ముచోవా ఇంటిదారి పట్టించింది.

తొలిసెమీఫైనల్లో బ్రెజిల్ సంచలనం బీట్రిజ్ హడాడ్ మియాతో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వయిటెక్ తలపడనుంది. క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ స్వయిటెక్ 6-4, 6-2తో కోకో గాఫ్ ను చిత్తు చేయడం ద్వారా ఫ్రెంచ్ ఓపెన్ లో తన రికార్డును 26-2కు పెంచుకోగలిగింది.

First Published:  8 Jun 2023 10:47 AM GMT
Next Story