Telugu Global
Sports

నాడు విశ్వనాథన్ ఆనంద్, నేడు ప్ర్రఙ్జానంద్!

భారత యువగ్రాండ్ మాస్టర్ ప్ర్రఙ్జానంద్ 2024 ప్రపంచ చెస్ సెమీస్ చేరి చరిత్ర సృష్టించాడు. సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తరువాత ఈ ఘనత సాధించిన భారత తొలి చెస్ ప్లేయర్ గా నిలిచాడు.

నాడు విశ్వనాథన్ ఆనంద్, నేడు ప్ర్రఙ్జానంద్!
X

నాడు విశ్వనాథన్ ఆనంద్, నేడు ప్ర్రఙ్జానంద్!

భారత యువగ్రాండ్ మాస్టర్ ప్ర్రఙ్జానంద్ 2024 ప్రపంచ చెస్ సెమీస్ చేరి చరిత్ర సృష్టించాడు. సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తరువాత ఈ ఘనత సాధించిన భారత తొలి చెస్ ప్లేయర్ గా నిలిచాడు.

ప్రపంచ చదరంగం పురుషుల విభాగంలో భారత యువఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. అజర్ బైజాన్ రాజధాని బాకు వేదికగా జరుగుతున్న 2024 ప్రపంచ పురుషుల చెస్ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్స్ కు నలుగురు భారత గ్రాండ్ మాస్టర్లు తొలిసారిగా చేరుకోడం ద్వారా సంచలనం సృష్టించిన కొద్దిరోజులకే 18 సంవత్సరాల గ్రాండ్ మాస్టర్ రమేశ్ ప్ర్రఙ్జానంద్ సెమీస్ చేరడం ద్వారా చరిత్ర సృష్టించాడు.

హోరాహోరీ పోరులో అర్జున్ పై గెలుపు...

సెమీఫైనల్లో చోటు కోసం జరిగిన హోరాహోరీ సమరంలో భారత్ కే చెందిన ఇద్దరు కుర్రగ్రాండ్ మాస్టర్లు ఇరగేసి అర్జున్, ప్ర్రఙ్జానంద్ తలపడ్డారు. మొత్తం రెండుగేమ్ ల ఈ పోరులో తెలంగాణాకు చెందిన ఇరగేసి అర్జున్ 53 ఎత్తుల్లో విజేతగా నిలిస్తే ..రెండోగేమ్ ను ప్ర్రఙ్జానంద్ గెలుచుకోడంతో విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్ గేమ్ అనివార్యమయ్యింది.

మొదటి ర్యాపిడ్ గేమ్ లను డ్రాగా ముగించడంలో ఇద్దరు ఆటగాళ్లు సఫలం కాగలిగారు. ఆ తర్వాత 10 నిముషాలపాటు మాత్రమే సాగే కీలక గేమ్ లో గ్రాండ్ మాస్టర్ ప్ర్రఙ్జానంద్ విజేతగా నిలవడం ద్వారా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలిగాడు.

ప్ర్రఙ్జానంద్ కు 50వేల డాలర్లు ఖాయం..

తమిళనాడులోని ఓ మథ్యతరగతి కుటుంబానికి చెందిన ప్ర్రఙ్జానంద్ ప్రపంచ చెస్ సెమీస్ చేరుకోడం ద్వారా ఈ ఘనత సాధించిన భారత రెండోగ్రాండ్ మాస్టర్ గా చరిత్ర సృష్టించాడు. గతంలో సూపర్ గ్రాండ్ మాస్టర్ , ఐదుసార్లు విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చదరంగ సెమీస్ చేరిన భారత తొలి ఆటగాడు కాగా..ఇప్పుడు తమిళనాడుకే చెందిన మరో ఆటగాడు ప్ర్రఙ్జానంద్ వచ్చి చేరాడు.

సెమీఫైనల్స్ చేరడం ద్వారా ప్ర్రఙ్జానంద్ 50వేల డాలర్ల ప్రైజ్ మనీ ఖాయం చేసుకోగలిగాడు. ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో గ్రాండ్ మాస్టర్ ఫేబియానో కరూనాతో ప్ర్రఙ్జానంద్ తలపడనున్నాడు.

ప్రస్తుత ప్రపంచ చాంపియన్, చైనా సూపర్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ తో తలపడే ప్రత్యర్థి కోసం క్యాండిడేట్స్ టోర్నీని ప్రపంచ చదరంగ సమాఖ్య నిర్వహిస్తోంది. క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచిన ఆటగాడికే ప్రపంచ టైటిల్ కోసం డింగ్ లిరెన్ తో జరిగే పోరులో తలపడటానికి అర్హత దక్కుతుంది.

మరో క్వార్టర్ ఫైనల్లో అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫేబియానో కరూనా..గ్రాండ్ మాస్టర్ లీనియర్ డోమింగ్వేజ్ పై విజయం సాధించాడు. కరూనా 2782 ఎలో రేటింగ్ తో ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు.

భారత గ్రాండ్ మాస్టర్లు విదిత్ గుజరాతీ, గుకేశన్ ల పోరు క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది.

మహిళా సెమీస్ లో సంచలనం..

మహిళల సెమీఫైనల్లో బల్గేరియాకు చెందిన 29వ సీడ్, ఇంటర్నేషనల్ మాస్టర్ నూర్ గ్యుల్ సలిమోవా సంచలనం సృష్టించింది. ఉక్రెయిన్ గ్రాండ్ మాస్టర్ అన్నా ముజ్యచుక్ ను 3.5- 2.5 పాయింట్ల తేడాతో టైబ్రేక్ ద్వారా చిత్తు చేసింది.

ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో రెండోసీడ్ అలెగ్జాండ్రా గోర్యచికినాతో నూర్ గ్యుల్ తలపడనుంది.

First Published:  19 Aug 2023 5:45 AM GMT
Next Story