Telugu Global
Sports

ఇటు ధోనీ, అటు గిల్...నేడే ఐపీఎల్ టైటిల్ సమరం!

ఐపీఎల్-16వ సీజన్ టైటిల్ సమరానికి అహ్మదాబాద్ వేదికగా రంగం సిద్ధమయ్యింది. రాత్రి 7-30కి జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ సవాలు విసురుతోంది.

Chennai Super Kings vs Gujarat Titans Today Match at 7:30 PM
X

ఇటు ధోనీ, అటు గిల్...నేడే ఐపీఎల్ టైటిల్ సమరం!

ఐపీఎల్-16వ సీజన్ టైటిల్ సమరానికి అహ్మదాబాద్ వేదికగా రంగం సిద్ధమయ్యింది. రాత్రి 7-30కి జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ సవాలు విసురుతోంది.

దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను గత ఐదువారాలుగా కదిపికుదిపేసిన ఐపీఎల్-16వ సీజన్ సమరం ముగింపు దశకు చేరింది. లీగ్ దశతో పాటు..క్వాలిఫైయర్స్ లో అత్యుత్తమంగా రాణించిన రెండుజట్లే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7-30 గంటలకు ఈ టైటిల్ సమరం ప్రారంభంకానుంది.

ఐదో టైటిల్ కు చెన్నై గురి...

లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలవడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ కు అర్హత సాధించిన చెన్నై..హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన తొలి క్వాలిఫైయర్ లో గుజరాత్ టైటాన్స్ ను 15 పరుగులతో అధిగమించడం ద్వారా నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది.

గత 15 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో 13 టోర్నీలలో పాల్గొని నాలుగుసార్లు విజేతగా నిలిచిన చెన్నై..రికార్డుస్థాయిలో ఐదో టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.

అపారఅనుభవం కలిగిన కూల్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం..చెన్నైకి అదనపు బలంగా ఉంది. తన కెరియర్ లో ఇప్పటికే 249 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన 42 సంవత్సరాల ధోనీ..ఈ రోజు జరిగే టైటిల్ ఫైట్ తో 250 మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు.

అదనుచూసి దెబ్బకొట్టడంలో మొనగాడిగా, తెలివైన కెప్టెన్ గా పేరున్న ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ రోజు జరిగే ఫైనల్లో చెన్నై విజేతగా నిలిస్తే..ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐదో ఐపీఎల్ టైటిల్ తో ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని ధోనీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

స్థానబలంతో గుజరాత్ టైటాన్స్....

గత సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్..తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలవడం ద్వారా సత్తా చాటుకొంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అత్యంత పటిష్టంగా, సమతూకంగా ఉన్న గుజరాత్ కు హోంగ్రౌండ్ అహ్మదాబాద్ స్టేడియం పిచ్ సైతం అత్యంత అనువుగా ఉంది. పైగా లక్షమంది అభిమానులు సైతం కొండంత అండగా నిలువనున్నారు.

క్వాలిఫైయర్ -1 లో చెన్నై చేతిలో ఎదురైన పరాజయానికి..ఈరోజు జరిగే టైటిల్ సమరంలో నెగ్గడం ద్వారా బదులు తీర్చుకోవాలన్న పట్టుదలతో గుజరాత్ టైటాన్స్ ఉంది.

కెప్టెన్ హార్థిక్ పాండ్యా, కోచ్ అశీష్ నెహ్రాల నేతృత్వంలో అత్యంత ప్రమాదకరమైన జట్టుగా గుర్తింపు పొందిన గుజరాత్ వరుసగా రెండో టైటిల్ నెగ్గాలంటే..ధోనీ రూపంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కొండని ఢీ కొనకతప్పదు.

శుభ్ మన్ గిల్ పైన గుజరాత్ భారం...

గత నాలుగుమ్యాచ్ ల్లో మూడు శతకాలు బాదడం ద్వారా భీకరమైన ఫామ్ లో ఉన్న యువఓపెనర్ శుభ్ మన్ గిల్ పైనే గుజరాత్ బ్యాటింగ్ పూర్తిస్థాయిలో ఆధారపడి ఉంది. వన్ డౌన్ సాయి సుదర్శన్, విజయ్ శంకర్ మినహా మిగిలిన బ్యాటర్లు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడం గుజరాత్ బలహీనతగా ఉంది. ప్రధానంగా కెప్టెన్ హార్థిక్ పాండ్యా దారుణంగా విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. సమయం కలసిరాక గిల్ తక్కువ స్కోరుకే వెనుదిరిగితే..గుజరాత్ కు కష్టాలు తప్పవు. పైగా..పటిష్టమైన

చెన్నై బౌలింగ్ ను ఎదుర్కొని పరుగులు సాధించడం అంతతేలిక కాబోదు.

గుజరాత్ కు బౌలింగ్ పవర్...

ప్రస్తుత ఐపీఎల్ లో కేవలం బౌలింగ్ బలంతోనే అధికమ్యాచ్ లు నెగ్గుతూ వచ్చిన ఏకైకజట్టు గుజరాత్ టైటాన్స్ మాత్రమే. పేస్ జోడీ మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, లెగ్ స్పిన్ జాదూ రషీద్ ఖాన్ భీకరఫామ్ లో ఉండటం గుజరాత్ కు కలిసొచ్చే అంశంగా ఉంది.

ఇప్పటి వరకూ ఆడిన 16 మ్యాచ్ ల్లో మహ్మద్ షమీ 28 వికెట్లు, రషీద్ ఖాన్ 27 వికెట్లు, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ మోహిత్ శర్మ 13 వికెట్లు పడగొట్టడం ద్వారా తమజట్టు విజయాలలో కీలకంగా మారారు. లెఫ్టామ్ స్పిన్నర్ నూర్ మహ్మద్, లెఫ్టామ్ పేస్ బౌలర్ జోషువా లిటిల్ సపోర్టు బౌలర్లుగా తమతమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

రికార్డులు చెన్నైకే అనుకూలం..

2011 తర్వాత నుంచి జరిగిన గత 12 ఐపీఎల్ ఫైనల్స్ లో..క్వాలిఫైయర్ -1లో నెగ్గినజట్లే 9సార్లు ఐపీఎల్ విన్నర్లుగా నిలిచాయి. దీనికితోడు ఇప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ నెగ్గిన రికార్డు, అత్యధిక ఫైనల్స్ లో నాయకత్వం వహించిన అపారఅనుభవం కలిగిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చాతుర్యం చెన్నైని మరోసారి విజేతగా నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనువుగా ఉంటుందని, 200కు పైగా స్కోర్లతో హైస్కోరింగ్ మ్యాచ్ ఖాయమని గ్రౌండ్ క్యూరేటర్ ధీమాగా చెబుతున్నారు. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని గత రికార్డులు చెప్పకనే చెబుతున్నాయి. చేజింగ్ కు దిగిన జట్లే ఎక్కువగా విఫలం కావడం గుజరాత్ స్టేడియం ప్రత్యేకతగా ఉంది.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 11 ఫైనల్స్ ఆడిన చెన్నై 12వ టైటిల్ సమరంలో విజేతగా నిలుస్తుందా? లేక ..వరుసగా రెండో టైటిల్ తో గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టిస్తుందా? తెలుసుకోవాలంటే..మరికొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  28 May 2023 7:45 AM GMT
Next Story