Telugu Global
Sports

ఐపీఎల్ -16లో చెన్నై పాంచ్ పటాకా!

ఐపీఎల్ -23 టైటిల్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకొంది. హోరాహోరీ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై సంచలన విజయంతో ఐదోసారి విజేతగా ముంబై సరసన నిలిచింది

ఐపీఎల్ -16లో చెన్నై పాంచ్ పటాకా!
X

ఐపీఎల్ -23 టైటిల్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకొంది. హోరాహోరీ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై సంచలన విజయంతో ఐదోసారి విజేతగా ముంబై సరసన నిలిచింది...

దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను గత ఏడు వారాలుగా ఓలలాడిస్తూ వచ్చిన ఐపీఎల్ -16వ సీజన్ కు వరుణదేవుడు గొప్పముగింపునే ఇచ్చాడు.

నువ్వానేనా అన్నట్లుగాసాగిన టైటిల్ సమరంలో నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ (డక్ వర్త్ - లూయిస్ విధానం ప్రకారం ) 5 వికెట్ల విజయంతో గుజరాత్ ను అధిగమించడం ద్వారా ఐదో టైటిల్ ను కైవసం చేసుకొంది.

గుజరాత్ హిట్- చెన్నై సూపర్ హిట్!

దేశంలోని 10 నగరాలు 12 వేదికల్లో జరిగిన ఐపీఎల్-16వ సీజన్ లీగ్ లో అత్యుత్తమంగా రాణించిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ తో వర్షం రెండురోజులపాటు దోబూచులాడింది.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక భారీసంఖ్యలో తరలి వచ్చిన అభిమానులతో కిటకిటలాడిపోయింది. మే 29న జరగాల్సిన ఈమ్యాచ్ ను వర్షం కారణంగా 30వ తేదీకి వాయిదా వేసి నిర్వహించారు.

ఈ టైటిల్ సమరంలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఐపీఎల్ గత 16 సీజన్ల చరిత్రలో ఫైనల్లో నమోదైన అతిపెద్ద స్కోరు ఇదే కావటం విశేషం.

గ‌త మ్యాచ్ సెంచ‌రీ హీరో శుభ్‌మ‌న్ గిల్ 39 పరుగుల స్కోరుకే వెనుదిరిగినా మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (54), యువఆటగాడు సాయి సుదర్శన్ (96 పరుగులు) మెరుపు బ్యాటింగ్ తో గుజరాత్ టైటాన్స్ ప్రత్యర్థి ఎదుట 215 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.

చెన్నై విజయ లక్ష్యం 15 ఓవర్లలో 171 పరుగులు

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 215 పరుగులు చేయాల్సిన చెన్నై ఇన్నింగ్స్ కు వానదెబ్బతో రెండుసార్లు అంతరాయం కలగడంతో డక్ వర్త్ - లూయిస్ విధానం ప్రకారం..

లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు.

15వ ఓవర్ ఆఖరి రెండుబంతుల్లో రవీంద్ర జడేజా సిక్సర్, ఫోర్ సాధించడం ద్వారా చెన్నైకి చిరస్మరణీయ విజయం అందించాడు. చెన్నై కెప్టెన్ , 42 సంవత్సరాల మహేంద్రసింగ్ ధోనీ ఐదోసారి సగర్వంగా ఐపీఎల్ ట్రోఫీని అందుకోగలిగాడు.

ఈ విజయంతో..గతంలో ముంబై ఇండియన్స్ నెలకొల్పిన ఐదు ఐపీఎల్ టైటిల్స్ రికార్డును చెన్నై సూపర్ కింగ్స్ సమం చేయగలిగింది. 2010, 2011, 2018, 2021

సీజన్లలో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన చెన్నై కేవలం ఏడాది విరామం లోనే ఐదో టైటిల్ కైవసం చేసుకోడం ధోనీ నాయకత్వానికి ప్రతీకగా మిగిలిపోతుంది.

గిల్ కు ఆరెంజ్ , షమీకి పర్పుల్...

ఐపీఎల్ -16వ సీజన్ అత్యుత్తమ బ్యాటర్, బౌలర్ అవార్డులను గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్ మన్ గిల్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గెలుచుకొన్నారు.

మొత్తం 17 మ్యాచ్ ల్లో శుభ్ మన్ గిల్ 3 శతకాలతో సహా 890 పరుగులు సాధించడం ద్వారా పర్పుల్ క్యాప్ అందుకొన్నాడు.

అత్యుత్తమ బౌలర్ గా మహ్మద్ షమీ 17 మ్యాచ్ ల్లో 28 వికెట్లు పడగొట్టడం ద్వారా ఆరెంజ్ క్యాప్ సాధించాడు. అత్యంత ప్రతిభావంతుడైన యువక్రికెటర్ అవార్డును

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ( 625 పరుగులు) అందుకొన్నాడు.

మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అవార్డును చెన్నై ఓపెనర్ డేవన్ కాన్వే గెలుచుకొన్నాడు. చెన్నై చేజింగ్ లో టాప్ స్కోరర్ గా కీలకపాత్ర పోషించాడు. విజేతగా నిలిచిన చెన్నైకి 20 కోట్ల రూపాయలు, రన్నరప్ గుజరాత్ టైటాన్స్ కు 13 కోట్ల రూపాయలు, మూడోస్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ కు 7 కోట్ల 30 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ దక్కింది.

ఐపీఎల్- 16లో రికార్డులు ఫుల్..

2008 నుంచి ప్రస్తుత 2023 ఐపీఎల్ వరకూ ..గత 16 సీజన్లలో అత్యధిక రికార్డులు నమోదైన టోర్నీగా ప్రస్తుత 16వ సీజన్ నిలిచిపోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తొలిసారిగా ప్రవేశపెట్టడంతో పరుగుల మోత మోగడమే కాదు..రికార్డులు వెల్లువెత్తాయి.

గతంలో ఎన్నడూలేనంతగా మొత్తం 37సార్లు 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. మొత్తం 74 మ్యాచ్ ల్లో సగటున తొలిఇన్నింగ్స్ లో 183 పరుగుల స్కోర్లు నమోదయ్యాయి. 8.99 రన్ రేట్ నమోదైన తొలి టోర్నీ ఇదే కావడం మరో విశేషం. వివిధజట్ల బ్యాటర్లు 153 హాఫ్ సెంచరీలు, 11 సెంచరీలు సాధించడం మరో రికార్డుగా మిగిలిపోతుంది.

రిటైర్మెంట్ మ్యాచ్ లో మెరిసిన రాయుడు...

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ తో తెలుగుతేజం, చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు తన 14 సీజన్ల కెరియర్ ను ముగించాడు. ఫైనల్లో కేవలం 8 బంతుల్లోనే 2 సిక్సర్లు, ఓ ఓ బౌండ్రీతో 19 పరుగుల స్కోరు సాధించడం ద్వారా 237.50 సగటు నమోదు చేయడం ద్వారా తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

అంతేకాదు..రెండు వేర్వేరు జట్ల తరపున ఆరుసార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ఏకైక ప్లేయర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

తన ఐపీఎల్ ప్రస్థానంలో రాయుడు మొత్తం 14 సీజన్లలో 204 మ్యాచ్ లు ఆడడంతో పాటు 11సార్లు ప్లే-ఆప్ రౌండ్లలోనూ, 8సార్లు ఫైనల్స్ లోనూ పాల్గొనడం ద్వారా

అరడజను ట్రోఫీలు అందుకోగలిగాడు.

2010 సీజన్లో మంబై ఇండియన్స్ తరపున తొలిసారిగా ఐపీఎల్ లో పాల్గొన్న అంబటి రాయుడు ప్రస్తుత సీజన్ ఫైనల్స్ వరకూ 204 మ్యాచ్ ల్లో 4వేల 329 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 127 పరుగుల స్ట్ర్రయిక్ రేట్ సాధించిన రాయుడు 2018 సీజన్లో అత్యుత్తమంగా 602 పరుగులు సాధించాడు.

ఐపీఎల్ ట్రోఫీతో తన కెరియర్ ను మొదలు పెట్టి..ఐపీఎల్ ట్రోఫీతోనే ముగింపు పలికిన రాయుడుకి, వెటరన్ మహేంద్రసింగ్ ధోనీకి ఐపీఎల్-16వ సీజన్ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.



First Published:  30 May 2023 4:38 AM GMT
Next Story