Telugu Global
Sports

స్పానిష్ కుర్రోడి సరికొత్త చరిత్ర..19 ఏళ్లకే ప్రపంచ నంబర్ వన్!

స్పానిష్ చిరుత, ప్రపంచ పురుషుల టెన్నిస్ లో నయాసంచలనం కార్లోస్ అల్ కరాజ్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.

స్పానిష్ కుర్రోడి సరికొత్త చరిత్ర..19 ఏళ్లకే ప్రపంచ నంబర్ వన్!
X

స్పానిష్ చిరుత, ప్రపంచ పురుషుల టెన్నిస్ లో నయాసంచలనం కార్లోస్ అల్ కరాజ్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. అత్యంత పిన్నవయస్కుడైన నంబర్ వన్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు...

అమెరికన్ ఓపెన్ చాంపియన్, స్పానిష్ నూనూగు మీసాల ఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకోడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అత్యంత పిన్నవయసులో టాప్ ర్యాంక్ కు చేరిన తొలి, ఏకైక క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు.

టీనేజ్ లోనే టాప్ ర్యాంక్...

గట్టిపోటీ ఉండే ప్రపంచ టెన్నిస్ లో టాప్ ర్యాంక్ సాధించాలంటే తలపండిపోవాలనుకొనే రోజులు పోయాయి. కేవలం 19 ఏళ్ల చిరుప్రాయంలోనే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించగలమని స్పానిష్ కుర్రోడు కార్లోస్ అల్ కరాజ్ నిరూపించాడు.

స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్, సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్, సిటిస్ పాస్, రుబులేవ్, మెద్వదేవ్ లాంటి పలువురు మేటి ఆటగాళ్లతో కూడిన ప్రపంచ పురుషుల టెన్నిస్ లోకి స్పెయిన్ చిరుత కార్లోస్ అల్ కరాజ్ దూసుకొచ్చాడు.

తన కెరియర్ తొలి సీజన్లోనే అమెరికన్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా వార్వేవ్వా అనిపించుకొన్నాడు. అంతటితోనే సరిపెట్టుకోకుండా ఏకంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సైతం సాధించాడు.

19 సంవత్సరాల 214 రోజుల వయసులోనే టాప్ ర్యాంక్ కు చేరుకొన్న ఏకైక, మొట్టమొదటి, ఒకే ఒక్క టెన్నిస్ ప్లేయర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ ఆస్ట్ర్రేలియా ఆటగాడు లీటన్ హెవిట్ పేరుతో ఉన్న 20 సంవత్సరాల 275రోజుల వయసు రికార్డును అధిగమించాడు.

తొలిసీజన్లోనే టాప్ గేర్...

అల్ కరాజ్ తన ప్రో కెరియర్ తొలిసీజన్ ను 32వ ర్యాంక్ తో ప్రారంభించాడు. కేవలం కొద్దిమాసాలలోనే 32వ ర్యాంక్ నుంచి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ చేరుకోడం ద్వారా చరిత్ర సృష్టించాడు. టెన్నిస్ దిగ్గజాలు ఫెదరర్, నడాల్, జోకోవిచ్, ముర్రే లకు సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడు. 2003లో యాండీ రాడిక్ తన ర్యాంక్ ను అనూహ్యంగా మెరుగు పరచుకోగా..ఇప్పుడు అల్ కరాజ్ సైతం అదే ఘనత సాధించగలిగాడు.

అతిచిన్నవయసులోనే ప్రపంచ నంబర్ వన్ కావడం తన అదృష్టమని, దిగ్గజాల సరసన నిలువగలగడం, టెన్నిస్ చరిత్రలో చోటు సంపాదించుకోగలగడం సంతోషంగా ఉందని అల్ కరాజ్ ప్రకటించాడు.

సంవత్సరాల తరబడి చేసిన కష్టానికి, శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు ఇప్పుడు వచ్చాయని పొంగిపోయాడు. స్పెయిన్ లోని ఎల్ పామర్ అనే ఓ చిన్నపట్టణంలో తన తండ్రి నడుపుతున్న టెన్నిస్ పాఠశాలలో చిన్ననాటి నుంచి శిక్షణ పొందుతూ వచ్చిన అల్ కరాజ్..2022 సీజన్ నుంచే సీనియర్ సర్క్యూట్ బరిలో నిలిచాడు. గత మే నెలలో జరిగిన మాడ్రిడ్ ఓపెన్ లో దిగ్గజ ఆటగాళ్లు నడాల్, జోకోవిచ్ లను కంగు తినిపించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.

న్యూయార్క్ వేదికగా ముగిసిన 2022 యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా తన సత్తా చాటుకొన్నాడు.

19 సంవత్సరాల వయసుకే ఓ గ్రాండ్ స్లామ్ టైటిల్ తో పాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన అల్ కరాజ్ కు తన కెరియర్ లో 30 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించే సత్తా ఉందని ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు జువాన్ కార్లోస్ ఫెరీరో జోస్యం చెబుతున్నాడు.

టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 22 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన నడాల్ రికార్డును అల్ కరాజ్ అధిగమించడం ఖాయమని భావిస్తున్నారు.

జనవరి 16న ప్రారంభమయ్యే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో తొమ్మిదిసార్లు విజేత జోకోవిచ్ కు అల్ కరాజ్ ప్రధాన ప్రత్యర్థిగా నిలువనున్నాడు.

First Published:  18 Nov 2022 3:00 AM GMT
Next Story