Telugu Global
Sports

క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు!

బంగ్లాదేశ్ కెప్టెన్ కమ్ సూపర్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ మరీ ఆటగాడికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా నిలిచాడు.

క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు!
X

క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు!

బంగ్లాదేశ్ కెప్టెన్ కమ్ సూపర్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ మరీ ఆటగాడికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా నిలిచాడు.

క్రికెట్లో గొప్పగొప్ప బ్యాటర్లు, ఆల్ రౌండర్లు ఎందరున్నా అరుదైన, అసాధారణ రికార్డులు నెలకొల్పే అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. విరాట్ కొహ్లీ, బెన్ స్టోక్స్, రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్స్ సన్ లాంటి మేటి ఆటగాళ్లు సాధించలేని రికార్డును బంగ్లాదేశ్ కెప్టెన్ కమ్ సూపర్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ నెలకొల్పాడు.

ఆల్-ఇన్-వన్..నంబర్ వన్...

అఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ ద్వారా షకీబుల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ మూడు( టెస్టు, వన్డే, టీ-20 ) ఫార్మాట్లలోనూ ఐదుసార్లుకు పైగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకొన్న ఏకైక, ఒకే ఒక్క క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

లెఫ్టామ్ స్పిన్నర్ గా, టాపార్డర్ బ్యాటర్ గా బంగ్లాదేశ్ కు గత దశాబ్దకాలంగా సాంప్రదాయ టెస్టు, ధూమ్ ధామ్ టీ-20, ఇన్ స్టంట్ వన్డే మ్యాచ్ ల్లో కీలక విజయాలు అందిస్తూ వస్తున్నాడు.

ఒక్క సిరీస్ లోనే బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకోడం అంటే మాటలు కాదు. అయితే...షకీబుల్ మాత్రం ఐదురోజుల టెస్టు, 50 ఓవర్ల వన్డే, 20 ఓవర్ల టీ-20 సిరీస్ లు అన్న తేడాలేకుండా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సొంతం చేసుకొంటూ వస్తున్నాడు.

ఎందరు గొప్ప ఆల్ రౌండర్లున్నా....

టెస్టు హోదా పొందిన క్రికెట్ జట్లలో ఎందరు గొప్ప గొప్ప ఆల్ రౌండర్లున్నా..షకీబుల్ హసన్ ముందు దిగదుడుపే వారెవ్వరూ సాధించలేని రికార్డును ఈ బంగ్లా స్పిన్ ఆల్ రౌండర్ సొంతం చేసుకొన్నాడు.

బౌలర్ గా మ్యాజిక్ చేస్తూ..బ్యాటర్ గా కీలక ఇన్నింగ్స్ ఆడటంలో షకీబుల్ కు షకీబుల్ మాత్రమే సాటి. ప్రస్తుతం బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న టీ-20 సిరీస్ లోని రెండో టీ-20 మ్యాచ్ లో 2 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాటర్ గా 18 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సైతం అందుకున్నాడు. టీ- 20ల్లో ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్’ గా నిలవడం షకీబుల్ కు ఇది ఐదోసారి.

అంతేకాదు..గతంలోనే వ‌న్డేలు, టెస్టుల్లో ఐదేసిసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన రికార్డులు షకీబుల్ కు ఉన్నాయి. టెస్టుల్లో 5, వ‌న్డేల్లో 7, టీ- 20ల్లో 5 సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సాధించిన ఘనత కేవలం షకీబుల్ కు మాత్రమే సొంతం.

ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్’ మొనగాళ్లు వీరే...

‘ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అత్య‌ధికంగా గెలిచిన క్రికెటర్లలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కూ 20 సార్లు ఈ అవార్డు అందుకున్నాడు. టెస్టుల్లో 3, వ‌న్డేల్లో 10, టీ20ల్లో ఏడు సార్లు విరాట్ ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

రెండో స్థానంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ కొనసాగుతున్నాడు.స‌చిన్ టెస్టుల్లో 5, వ‌న్డేల్లో 15 సార్లు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్’ గా నిలిచాడు. ష‌కిబుల్ హ‌స‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ 17 సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

ద‌క్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండ‌ర్ జాక్వెస్ క‌లిస్ 15 సార్లు(టెస్టుల్లో 9, వ‌న్డేల్లో 6), శ్రీ‌లంక వెట‌ర‌న్ ప్లేయ‌ర్ స‌న‌త్ జ‌య‌సూర్య 13 సార్లు(టెస్టుల్లో 2, వ‌న్డేల్లో 11) ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నారు.

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఐదుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కైవసం చేసుకొన్న ఘనుడు షకీబుల్ హసన్ మాత్రమే.

First Published:  18 July 2023 6:15 AM GMT
Next Story