Telugu Global
Sports

టీమ్ ఇండియాను స్పాన్సర్ చేయలేము.. ఒప్పందాల రద్దుకై బైజూస్, ఎంపీఎల్ లేఖ

భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్లుగా ఉన్న బైజూస్, ఎంపీఎల్ సంస్థలు తమ కాంట్రాక్టును మధ్యలోనే వదిలేస్తామని లేఖలు రాశాయి.

టీమ్ ఇండియాను స్పాన్సర్ చేయలేము.. ఒప్పందాల రద్దుకై బైజూస్, ఎంపీఎల్ లేఖ
X

టీమ్ ఇండియాకు, క్రికెటర్లకు స్పాన్సర్ చేయడానికి బడా కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఎన్ని కోట్లైనా వెచ్చించి తమ బ్రాండ్‌ను టీమ్ ఇండియాతో ప్రమోట్ చేయించుకోవాలని చూస్తుంటాయి.టీమ్ ఇండియా ఆడే మ్యాచ్‌లు, ఐపీఎల్ ప్రసారాల కోసం బ్రాడ్‌కాస్టర్లు వేల కోట్ల రూపాయలు వెచ్చించడం చూస్తూనే ఉన్నాము. అలాగే మ్యాచ్‌లు జరిగే సమయంలో ఎంత ఖర్చైనా యాడ్స్ ఇవ్వడానికి పలు కంపెనీలు సిద్ధపడుతుంటాయి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్లుగా ఉన్న బైజూస్, ఎంపీఎల్ సంస్థలు తమ కాంట్రాక్టును మధ్యలోనే వదిలేస్తామని లేఖలు రాశాయి.

ఎడ్యూటెక్ కంపెనీ బైజూస్‌కు వచ్చే ఏడాది నవంబర్ వరకు జెర్సీ స్పాన్సర్‌గా కాంట్రాక్టు ఉంది. ఈ ఏడాది జూన్‌లోనే తమ కాంట్రాక్టును రూ. 290 కోట్లు చెల్లించి పొడిగించుకున్నది. గతంలో చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ఒప్పో స్పాన్సర్‌గా ఉండగా.. 2019లో బైజూస్ ఆ కాంట్రాక్టును తీసుకున్నది. అయితే ఆర్థిక మాంద్యం కారణంగా తాము స్పాన్సర్‌షిప్ కొనసాగించలేమని పేర్కొన్నది. ఈ మేరకు గత నెల 4నే బీసీసీఐకి లేఖ రాసింది. కాగా, ఇప్పటికిప్పుడు వైదొలగితే కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవడానికి సమయం పడుతుంది. కాబట్టి 2023 మార్చి 31 వరకు కొనసాగాలని బీసీసీఐ కోరినట్లు సమాచారం.

ఫిఫా వరల్డ్ కప్ స్పాన్సర్లలో ఒకరిగా బైజూస్ ఉంది. అయితే ఆర్థిక మాంద్యం కారణంగా ఈ ఏడాద 5 శాతం మంది ఉద్యోగులను తొలగించుకోవాలని బైజూస్ నిర్ణయించింది. బైజూస్ లేఖపై బుధవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా చర్చించినట్లు సమాచారం.

ఇక టీమ్ కిట్, మర్చండైస్ స్పాన్సర్‌గా ఉన్న ఎంపీఎల్.. తమ కాంట్రాక్టును కేవల్ కిరణ్ క్లాథింగ్ లిమిటెడ్ (కేకేసీఎల్)కు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నది. వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు ఎంపీఎల్‌కు స్పాన్సర్‌షిప్ గడువు ఉన్నది. గతంలో నైకీకి ఉన్న స్పాన్సర్‌షిప్‌ను అధిక మొత్తం వెచ్చించి ఎంపీఎల్ సొంతం చేసుకున్నది. అయితే తమ కాంట్రాక్టును కేకేసీఎల్‌కు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు ఎంపీఎల్ ఈ నెల 2న బీసీసీఐకి లేఖ రాసింది. కాగా, హఠాత్తుగా వైదొలగితే జట్టు ఇబ్బంది పడుతుందని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. వరుసగా హోమ్ సిరీస్‌లు ఉండటంతో పాటు, ఉమెన్స్ జట్టు విదేశాల్లో కూడా పర్యటించాల్సి ఉందని.. ఎంపీఎల్ వైదొలగితే కష్టమని భావిస్తోంది. అందుకే ప్రస్తుతానికి జెర్సీ రైట్ సైడ్ లోగోను కంటిన్యూ చేయాలని, కిట్ మ్యానుఫాక్చరింగ్ కాంట్రాక్టును వేరే వారికి ఇస్తామని బీసీసీఐ రిక్వెస్ట్ చేసింది.

కనీసం వచ్చే ఏడాది మార్చి 31 వరకు తమ కాంట్రాక్టును కొనసాగించాలని రెండు కంపెనీలను బీసీసీఐ కోరుతోంది. ఇక గతంలో హోమ్ సిరీస్‌లకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించిన పేటీఎం కూడా తమ స్పాన్సర్‌షిప్‌ను మాస్టర్ కార్డ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసింది.ఇదంతా ఆర్థిక మాంద్యం కారణంగానే జరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు కాస్ట్ కటింగ్‌లో భాగంగానే స్పాన్సర్‌షిప్‌ల నుంచి వైదొలగుతున్నట్లు తెలుస్తోంది.

First Published:  22 Dec 2022 12:50 PM GMT
Next Story