Telugu Global
Sports

ధోనీ వ్యాపారాలు అన్నిన్ని కాదయా!

ఐపీఎల్ ఎవర్ గ్రీన్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..వెలుపలా రాణిస్తూ తన సంపద విలువను వందల కోట్ల మేరకు పెంచుకోగలిగాడు.

ధోనీ వ్యాపారాలు అన్నిన్ని కాదయా!
X

ఐపీఎల్ ఎవర్ గ్రీన్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..వెలుపలా రాణిస్తూ తన సంపద విలువను వందల కోట్ల మేరకు పెంచుకోగలిగాడు.

భారత క్రికెట్ కు 15 సంవత్సరాలపాటు అసమాన సేవలు అందించి..ఐపీఎల్ ప్రస్తుత సీజన్ తో తన పరిపూర్ణ రిటైర్మెంట్ ను ప్రకటించడానికి 42 సంవత్సరాల మహేంద్ర సింగ్ ధోనీ తహతహలాడుతున్నాడు.

తన కెప్టెన్సీలో చెన్నై ఫ్రాంచైజీకి ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన మొనగాడిగా గుర్తింపు పొందిన ధోనీ..ప్రస్తుత 17వ సీజన్ తో తన కెరియర్ కు స్వస్తి పలుకనున్నట్లు ప్రచారం జోరందుకొంది.

భారత క్రికెట్ కు కొద్ది సంవత్సరాల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ..ఐపీఎల్ నుంచి విరమించుకొంటే..క్రికెటర్ గా ధోనీ కెరియర్ పరిసమాప్తమయినట్లే అవుతుంది.

ధోనీ గొప్ప బిజినెస్ మ్యాన్....

ధోనీ ఓ క్రికెటర్ గా ఫీల్డ్ లో ఎంత సమర్థవంతంగా, అసాధారణ తెలివితేటలతో ఉంటాడో..బిజినెస్ మ్యాన్ గా తన వ్యాపార నిర్వహణలో అంతే విజయవంతంగా ఉంటూ వస్తున్నాడు.

జార్ఖండ్ లోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి..క్రికెట్ నే వృత్తిగా చేసుకొన్న ధోనీ గత రెండు దశాబ్దాల కాలంలో వివిధ రూపాలలో 1040 కోట్ల రూపాయల మేర సిరి సంపదలు కూడబెట్టాడు.

క్రికెటర్ గా తాను చెమటోడ్చి ఆర్జించిన ప్రతి ఒక్క రూపాయిని లాభసాటి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి తన వ్యాపారసామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోగలిగాడు.

విభిన్నరకాల వ్యాపారాలలో పెట్టుబడులు..

ధోనీ తన ఆర్జనను భిన్నరకాల వ్యాపారాలలో పెట్టుబడిగా ఉంచి..గట్టిగానే సంపాదించగలిగాడు. తెలివైన, విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు.

వివిధ రకాల వ్యాపారాలలో పెట్టుబడులతో పాటు.. బ్రాండ్ ఎండార్స్ మెంట్లు, సోషల్ మీడియా వేదికలను వ్యాపారమార్గాలుగా చేసుకొని తన సంపదను వృద్ధి చేసుకోగలిగాడు.

ఐపీఎల్ లో సీజన్ కు ఆరువారాలపాటు చెన్నై ఫ్రాంచైజీకి ఆడుతూ 12 కోట్ల రూపాయల చొప్పున ధోనీ వేతనంగా అందుకొంటూ వస్తున్నాడు. సోషల్ మీడియా వేదికల ఎండార్స్ మెంట్ల కోసం కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకూ, బ్రాండ్ ఎండార్స్ మెంట్ల కోసం 4 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయల వరకూ ఫీజుగా అందుకొంటూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే..సొంతంగా ఓ దుస్తుల బ్రాండ్ ను సైతం ప్రారంభించాడు. సెవెన్ అన్న బ్రాండ్ తో దేశవ్యాప్తంగా దుస్తుల వ్యాపారం మొదలు పెట్టాడు.

రాంచీలో హాటెల్ వ్యాపారం..

తన సొంత నగరం రాంచీలో హోటెల్ మహీ రెసిడెన్సీ పేరుతో రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్నాడు. ఏయిర్ బిఎన్బీ, ఓయో, మేక్ మై ట్రిప్ బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే కాదు..బెంగళూరు నగరంలో ఓ గ్లోబల్ స్కూలును నిర్వహిస్తున్నాడు. 7 ఐఎన్ కె బ్రూవ్స్ కంపెనీ ద్వారా చాక్లెట్లు, శీతల పానీయాల వ్యాపారం సైతం చేస్తున్నాడు.

దేశవ్యాప్తంగా 200 కేంద్రాలలో ధోనీ స్పోర్ట్స్ ఫిట్ పేరుతో జిమ్ చైన్ ను నిర్వహిస్తున్నాడు.

చెన్నైకి చెందిన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ కు వైస్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తూనే..చెన్నైయాన్ ఫుట్ బాల్ క్లబ్ కు కో-ఓనర్ గా వ్యవహరిస్తున్నాడు.

కార్ -24 బ్రాండ్ తో కార్ల్ రీసేల్ బిజినెస్ ను సైతం విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాడు.

మోటార్ బైక్ లంటే ప్రాణం...

ధోనీకి ఖరీదైన, పురాతనమైన మోటార్ బైక్ లను సేకరించడం అంటే చెప్పలేని ఇష్టం. రాంచీలోని ధోనీ గరాజ్ లో ఉన్నన్ని అపురూపమైన బైక్ లు మరే వ్యక్తి వద్ద లేవంటే ఆశ్చర్యపోవాల్సిందే.

ధోనీ దగ్గర ఉన్న విశ్వవిఖ్యాత బైక్ లలో నోర్టాన్ జూబ్లీ 250, కవాసకీ నిన్జా, కాన్ఫెడరేట్ ఎక్స్ 132, హెలీక్యాట్ సైతం ఉన్నాయి. ఇక ఖరీదైన, విలాసవంతమైన కార్లు, జీప్ లు సైతం ధోనీకి ఉన్నాయి.

1980లో మార్కెట్లోకి విడుదలైన రోల్స్ రాయిస్ సిల్వర్ రెయిత్ -2, నిస్సాన్ ఎస్ యూవీ, లాండ్ రోవర్3, వ్యాగన్ సిరీస్, గ్రాండ్ చెరోకీ జీప్ లాంటివి ధోనీ గరాజ్ లో ఉన్నాయి.

ధోనీ తెలివిగల క్రికెటర్ మాత్రమే కాదు..తాను సంపాదించిన ప్రతి రూపాయినీ అంతే తేలివితేటలతో పలు రకాల వ్యాపారాలలో పెట్టుబడులుగా ఉంచుతూ..విజయవంతమైన వ్యాపారగా కూడా నిలవటం విశేషం.

First Published:  15 May 2024 1:08 PM GMT
Next Story