Telugu Global
Sports

ఐపీఎల్ -24లో బుమ్రా బ్యాంగ్ బ్యాంగ్!

ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై బ్యాంగ్ బ్యాంగ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఒక్క దెబ్బతో మూడు ఘనతలు సాధించాడు.

ఐపీఎల్ -24లో బుమ్రా బ్యాంగ్ బ్యాంగ్!
X

ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై బ్యాంగ్ బ్యాంగ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఒక్క దెబ్బతో మూడు ఘనతలు సాధించాడు. పంజాబ్ పై తన జట్టుకు కీలక విజయం అందించాడు..

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకరమైన బౌలర్ గా పేరుపొందిన ముంబై ఇండియన్స్ యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా తన ప్రత్యేకతను చాటుకొన్నాడు.

నయా చండీఘడ్ లోని మల్లాపూర్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఐపీఎల్ పోరులో ముంబైని 9 పరుగుల తేడాతో విజేతగా నిలిపాడు.

చేజారిన మ్యాచ్ లో గెలిపించిన బుమ్రా..

హార్థిక్ పాండ్యా నాయకత్వంలో ప్రస్తుత సీజన్ లీగ్ లో పాల్గొంటూ మొదటి ఆరురౌండ్లలో 4 పరాజయాలు, 2 విజయాల రికార్డుతో ఉన్న ముంబైకి పంజాబ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ అశుతోష్ శర్మ చుక్కలు చూపించాడు. కేవలం 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 61 పరుగులు చేయటం ద్వారా మ్యాచ్ ను లాగేసుకొనేలా కనిపించాడు.

మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి 2 ఓవర్లలో 24 పరుగులు చేయాల్సిన పంజాబ్ ను ముంబై పేస్ జోడీ జస్ ప్రీత్ బుమ్రా, కొట్జే సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు.

193 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన పంజాబ్ ను 183 పరుగులకే కట్టడి చేయగలిగారు. కేవలం బుమ్రా బౌలింగ్ ప్రతిభతోనే ముంబై 9 పరుగుల విజయంతో ఊపిరి పీల్చుకోగలిగింది.

పంజాబ్ కెప్టెన్ సామ్ కరెన్, సూపర్ హిట్టర్ రిలే రూసో, శశాంక్ సింగ్ ల వికెట్లు పడగొట్టడం ద్వారా మ్యాచ్ ను మలుపు తిప్పిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇప్పటి వరకూ ఆడిన 7 రౌండ్లలో చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్ జట్ల చేతిలో పరాజయాలు పొందిన ముంబైజట్టు...ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల పైన మాత్రమే విజయాలు నమోదు చేయగలిగింది.

బుమ్రాకు చిక్కిన పర్పుల్ క్యాప్...

ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ ను 7వ రౌండ్ మ్యాచ్ ముగిసే సమయానికే బుమ్రా సొంతం చేసుకోగలిగాడు. బుమ్రా మొత్తం 13 వికెట్లు పడగొట్టడం ద్వారా టాపర్ గా నిలిచాడు.

అంతేకాదు..అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకొన్న రెండో ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా నిలిచాడు. ఇప్పటి వరకూ అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకొన్న ఫాస్ట బౌలర్ గా రికార్డు నెలకొల్పిన ఉమేశ్ యాదవ్ సరసన బుమ్రా నిలిచాడు.

బుమ్రా, ఉమేశ్ చెరో 10సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకొన్న ఫాస్ట్ బౌలర్లుగా రికార్డుల్లో చేరారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డులు అందుకొన్న రికార్డు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మాజీ హిట్టర్ ఏబీ డివిలియర్స్ పేరుతో ఉంది. ఏబీ డివిలియర్స్ 25సార్లు బెస్ట్ ప్లేయర్ అవార్డులు అందుకొన్నాడు.

250 మ్యాచ్ ల క్లబ్ లో రోహిత్ శర్మ..

ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ 250 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన రెండో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. పంజాబ్ కింగ్స్ తో పోరుకు బరిలో నిలవడం ద్వారా రోహిత్ 250వ మ్యాచ్ ఆడినట్లయ్యింది.

ఇషాన్ కిషన్ తో కలసి ముంబై ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. 2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి ప్రస్తుత 17వ సీజన్ 7వ రౌండ్ వరకూ రోహిత్ ఆడిన 250 మ్యాచ్ ల్లో 6వేల 508 పరుగులు సాధించాడు. 131.22 స్ట్ర్రయిక్ రేట్ తో 30.10 సగటుతో 42 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు రోహిత్ సాధించగలిగాడు.

ఒకే ఫ్రాంచైజీ తరపున 200 మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ రికార్డుతో పాటు..ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ గా నిలిపిన కెప్టెన్ గానూ రోహిత్ కు అరుదైన రికార్డు ఉంది.

First Published:  19 April 2024 6:16 AM GMT
Next Story