Telugu Global
Sports

ప్రపంచకప్ లో క్రొయేషియాకు కాంస్య పతకం!

2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో గతటోర్నీ రన్నరప్ క్రొయేషియా కాంస్య పతకం గెలుచుకొంది. మూడోస్థానం కోసం జరిగిన పోరులో మొరాకోను 2-1తో అధిగమించింది...

ప్రపంచకప్ లో క్రొయేషియాకు కాంస్య పతకం!
X

ప్రపంచకప్ లో క్రొయేషియాకు కాంస్య పతకం!

2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో గతటోర్నీ రన్నరప్ క్రొయేషియా కాంస్య పతకం గెలుచుకొంది. మూడోస్థానం కోసం జరిగిన పోరులో మొరాకోను 2-1తో అధిగమించింది...

ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ కాంస్య పతకం గెలుచుకోడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలన్న ఆఫ్రికా సంచలనం మొరాకో ఆశలు అడియాసలయ్యాయి. దోహా లోని ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మూడోస్థానం కోసం జరిగిన పోరులో గత చాంపియన్షిప్ రన్నరప్ క్రొయేషియా 2-1 గోల్స్ తో మొరాకోను కంగు తినిపించి కాంస్య పతకం అందుకొంది. తొలిప్రయత్నంలోనే సెమీస్ చేరిన మొరాకో చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

నువ్వానేనా అన్నట్లుగాసాగిన ఈపోరులో రెండుజట్లూ కొదమసింహాల్లా తలపడ్డాయి. పెనాల్టీ షూటౌట్ వరకూ పోకుండానే పోరును ముగించాలన్న పట్టుదలతో ఆడాయి. దాడులు, ప్రతిదాడులతో ఆటను రక్తికట్టించాయి.

క్రొయేషియా మ్యాజిక్...

సమష్టిగా దాడులు చేయటం, గోల్స్ అవకాశాలు సృష్టించుకోడం, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోడంలో తనకుతానే సాటిగా నిలిచే క్రొయేషియా మరోసారి సత్తా చాటుకొంది. పటిష్టమైన మొరాకో డిఫెన్స్ ను పదేపదే చేధిస్తూ ఒత్తిడి పెంచింది.

ఆట మొదటి భాగం 7వ నిముషంలోనే జోస్కా వర్డియోల్ హెడ్డర్ గోల్ తో క్రొయేషియాకు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత కొద్దినిముషాల వ్యవధిలోనే మొరాకో మెరుపుదాడితో ఈక్వలైజర్ సాధించింది.

అష్రఫ్ దరీ సాధించిన మెరుపుగోల్ తో స్కోరు 1-1తో సమంమయ్యింది. అయితే..ఆట రెండోభాగంలో మిస్లావ్ ఓర్సిచ్ సాధించిన సూపర్ గోల్ తో క్రొయేషియా 2-1తో పైచేయి సాధించడమే కాదు...కాంస్య పతకాన్ని ఖాయం చేసుకొంది.

ఆట ముగిసే క్షణాలలో ఈక్వలైజర్ కోసం మొరాకో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. క్రొయేషియా గోల్ కీపర్ పెట్టనిగోడలా నిలిచి తనజట్టుకు మూడోస్థానం ఖాయం చేశాడు.

పలువురు సీనియర్ స్టార్లు గాయాలతో అందుబాటులో లేకపోడంతో మొరాకో తరపున 18 సంవత్సరాల బిలాల్ ఎల్ ఖానోస్ బరిలోకి దిగాల్సి వచ్చింది.

గత రెండు ప్రపంచకప్ టోర్నీలలోనూ సెమీస్ చేరడంతో పాటు రెండు, మూడు స్థానాలలో నిలవడం ద్వారా క్రొయేషియా చరిత్ర సృష్టించింది. కేవలం 30 లక్షల జనాభా మాత్రమే కలిగిన అతిచిన్నదేశంగా ప్రపంచకప్ ఫుట్ బాల్ లో తానేమిటో నిరూపించుకొంది.

మరోవైపు..అందరి అంచనాలు తలకిందులు చేస్తూ గ్రూప్ లీగ్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ వరకూ సంచలన విజయాలు సాధించడం ద్వారా సెమీస్ చేరిన తొలి ఆఫ్రికాజట్టుగా

చరిత్ర సృష్టించిన మొరాకో తన ఆటతీరుతో ఆకట్టుకొంది.

First Published:  18 Dec 2022 5:03 AM GMT
Next Story