Telugu Global
Sports

బీజెపీకి 'ఓట్ల బాహుబలి' బ్రిజ్ భూషణ్

ఏడుగురు భారత మహిళా వస్తాదుల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజెపీ ఎంపీ, జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను కేంద్రప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకొంటూ వస్తోంది.

బీజెపీకి ఓట్ల బాహుబలి బ్రిజ్ భూషణ్|
X

బీజెపీకి 'ఓట్ల బాహుబలి' బ్రిజ్ భూషణ్|

ఏడుగురు భారత మహిళా వస్తాదుల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజెపీ ఎంపీ, జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను కేంద్రప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకొంటూ వస్తోంది....

దేశానికి పలు అంతర్జాతీయ పతకాలు, ఘనతలు సాధించిన విఖ్యాత మహిళా వస్తాదులు రోడ్డున పడటానికి కారకుడైన బీజెపీ ఎంపీ, జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అధికార పార్టీ కంటికి రెప్పలా కాపాడుకొంటూ వస్తోంది. దీని వెనుక బలమైన కారణమే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అధికార పార్టీ కాకుంటే..కటకటాల వెనుకే!

తూర్పు ఉత్తరప్రదేశ్ లోని బలమైన నాయకుల్లో ఒకరిగా బ్రిజ్ భూషణ్ కు పేరుంది. రాజపుత్రవర్గానికి చెందిన ఓటర్లను ఆకర్షించడంలో కమలనాథులకు బ్రిజ్ భూషణ్ కొండంత అండగా ఉంటూ వస్తున్నారు. సాధువులు, హిందూమతవర్గాల పెద్దలతో సైతం బ్రిజ్ భూషణ్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. కేసరిగంజ్ నియోజక వర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రిజ్ భూషణ్..గత కొద్దిసంవత్సరాలుగా భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

2010 నుంచి 2020 సంవత్సరాల మధ్యకాలంలో భారత మహిళా వస్తాదులతో బ్రిజ్ భూషణ్ అనుచితంగా ప్రవర్తించినట్లు, లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు సైతం ఉన్నాయి.

మహిళా వస్తాదుల పట్ల ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం, తన సొంత సొత్తుగా భావించడం, తనకుతానే చనువు తీసుకొని వారి భుజాలు, పొత్తికడుపు భాగంలో చేతులు వేయటం, చాతీభాగాలపైన చేతులు వేసి మాట్లాడటం బ్రిజ్ భూషణ్ కు మామూలేనని కుస్తీ వర్గాలు అంటున్నాయి. తనకు సహకరించని, అనుకూలంగా ఉండని మహిళా రెజ్లర్ల కెరియర్ లను నాశనం చేస్తానని బెదిరించడం లాంటి ఫిర్యాదులు సైతం ఉన్నాయి.

ఓ మర్డర్ కేసుతో సహా 42 ఎఫ్ఐఆర్ లు...

బీజెపీ ఎంపి బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ పై ఓ హత్యానేరంతో సహా మొత్తం 40 ఎఫ్ఐఆర్ లు..నమోదై ఉన్నాయని..రెజ్లర్ల తరపున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. బ్రజ్ భూషణ్ నుంచి రెజ్లర్ల ప్రాణాలకు ముప్పు పొంచిఉందని, వారికి ఢిల్లీ పోలీసులే రక్షణ కల్పించాలంటూ కోరారు. ప్రస్తుత రెండు కేసులతో సహా బీజెపీ ఎంపి పై మొత్తం 42 కేసులు నమోదైనట్లయ్యింది.

సుప్రీంకోర్టు జోక్యంతోనే.....

గత కొద్ది సంవత్సరాలుగా కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా తిరుగులేని అధికారం చేలాయిస్తున్న బ్రిజ్ భూషణ్ దాష్టీకాలను భరించలేక ఓ మైనర్ బాలికతో సహా మొత్తం ఏడుగురు మహిళా వస్తాదులు న్యాయం కోసం రోడ్డున పడ్డారు.

తమను పలువిధాలుగా బెదిరిస్తున్న బ్రిజ్ భూషణ్ నుంచి కాపాడాలని, తగిన న్యాయం చేయాలని భారత వస్తాదుల బృందం కొద్దిమాసాల క్రితమే మొరపెట్టుకొంది. ప్రభుత్వం, కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ తమ గోడును వినకుండా..ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీ ఎంపీకే అండగా నిలవడంతో విసిగిపోయి మరోసారి నిరసన చేపట్టారు. పదేపదే ఫిర్యాదు చేసినా బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేయటానికి ఢిల్లీ పోలీసులు మీనమేషాలు లెక్కపెడుతూ వచ్చారు. విసిగిపోయిన మహిళావస్తాదులు..న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్షలు చేస్తూనే దేశసర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

చివరకు సుప్రీంకోర్టు జోక్యం, ఆదేశాలతోనే ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేయాల్సి వచ్చింది.

‘బేటీ బచావో'. అంటూ ఊదరగొట్టి, ఓట్లు దండుకొన్న అధికారపార్టీ..తమ పార్టీకే చెందిన నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి ఎందుకు మీనమేషాలు లెక్కపెట్టింది. ఓ హత్యానేరం కేసుతో సహా 42 ఎఫ్ఐఆర్ లు నమోదైన ఓ వ్యక్తిని ఎందుకు కాపాడుతూ వస్తోందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అంతా ఓట్ల రాజకీయమే..!

జుమ్లా అన్న పదాన్ని బీజెపీ పార్టీనే విస్త్ర్రుత ప్రచారంలోకి తీసుకువచ్చింది. అవసరానికి, పబ్బం గడుపుకోడానికి మాటలు చెప్పడం, వాగ్దానాలు చేయటం తమ వ్యూహమని కేంద్ర హోంమంత్రి సైతం బాహాటంగానే చెబుతూ వస్తున్నారు.

చెప్పింది చెయ్యకపోడం, చేసేది చెప్పకపోడం, అంకెల గారడీతో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేయటం కమలనాథులకు ఓ విద్యగా మారింది.

నైతిక విలువలు, ప్రజాస్వామ్య పద్దతుల కంటే తమకు రాజకీయ ప్రయోజనాలే ప్రధానమని అధికార పార్టీ తన విధానాలు, చేతల ద్వారా చెప్పకనే చెబుతోంది.

గతంలో రైతుల ఉద్యమాన్ని అణచివేయటానికి ప్రయత్నించి భంగపడిన కేంద్రం..ప్రస్తుతం మహిళావస్తాదుల న్యాయపోరాటం పట్ల కూడా అదేతీరుగా వ్యవహరిస్తోందని విమర్శకులు ఉంటున్నారు.

తీవ్రఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలని తీవ్రంగా ఒత్తిడి వస్తున్నా తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేస్తే..

ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో భారీగా ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. పైగా సాధువుల వర్గాలలో సైతం బ్రిజ్ భూషణ్ కు గట్టి పలుకుబడి ఉంది. ఈ కారణాలతోనే.. బ్రిజ్ భూషణ్ ను కాపాడుతూ వస్తోంది.

పైగా తమకు న్యాయం చేయాలంటూ పోరాడుతున్న మహిళా రెజ్లర్లంతా బీజెపీ మద్దతు దారులు కాకపోడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది.

బ్రిజ్ భూషణ్ అధికార పార్టీకి చెందని వాడు కాకుంటే..ఈపాటికి కటకటాల వెనుక ఉండేవాడని, బీజెపీ వర్గాలు నానాహంగామా చేసే ఉండేవని క్రీడాభిమానులు మండిపడుతున్నారు.

కేంద్ర క్రీడామంత్రి సుద్దులు...

విచారణ కోసం తాము నియమించిన కమిటీ తన నివేదిక సమర్పించే వరకూ రెజ్లర్లు సంయమనంతో వ్యవహరించాలంటూ క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ సుద్దులు చెబుతున్నారు.

మహిళ రెజ్లర్ల ఫిర్యాదుల మేరకు లైంగిక ఆరోపణలపై విచారణకు కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ..భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. అయితే ..ఆ విచారణ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.విచారణ కమిటీ ఓ తంతు మాత్రమేనని, తమ పోరాటాన్ని నీరుగార్చడానికి చేస్తున్న ప్రయత్నమేనంటూ రెజ్లర్లు మండిపడుతున్నారు.

విచారణ కమిటీ నివేదిక వచ్చే వరకూ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ విధులకు దూరంగా ఉండాలన్న ఆదేశాన్ని సైతం కోర్టు జోక్యం వరకూ ఖాతరు చేయలేదన్న విషయమూ ప్రచారంలోకి వచ్చింది.

బ్రిజ్ భూషణ్ పై రెండు వేర్వేరు కేసులు...

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ పై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. న్యూఢిల్లీలోని కానాట్ ప్లేస్ పోలీసు స్టేషన్లో జాతీయకుస్తీ సమాఖ్య అధ్యక్షుడిపై పోక్సో చట్టం కింద ఓ కేసు ( మైనర్ బాలికల పై లైంగిక వేధింపుల కేసు ), మేజర్లపై లైంగిక వేధింపులకు గాను మరో కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్... సుప్రీంకోర్టుకు విన్నవించారు.

న్యాయం జరిగే వరకూ తగ్గేది లేదంటున్న రెజ్లర్లు..

తమపై లైంగిక ఆరోపణలకు పాల్పడి, మానసికంగా వేధించిన కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిపై బలహీనమైన సెక్షన్లకింద కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోడానికి ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీపైన తమకు నమ్మకం లేదని, బ్రిజ్ భూషణ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ..గత ఆరువారాలుగా నిరసన దీక్ష చేపట్టిన వస్తాదులు ఆరోపిస్తున్నారు.

బ్రిజ్ భూషణ్ ను తక్షణమే అరెస్టు చేసి కటకటాల వెనుక వేయాలని నిరసన చేపట్టిన ఏడుగురు మహిళా వస్తాదులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ తాము నిరసన వీడేది లేదని తేల్చి చెప్పారు.

తప్పని తేలితే ఉరేసుకొంటా- బ్రిజ్ భూషణ్..

తనపై ఏడుగురు మహిళా వస్తాదులు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజంలేదని, తాను ఏవిధమైన తప్పు చేయలేదని, ఎవ్వరినీ లైంగికంగా వేధించలేదని మరో వైపు బ్రిజ్ భూషణ్ బుకాయిస్తున్నారు.

తనపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజమని తేలినా..తనకుతానే ఉరేసుకొంటానంటూ ప్రకటించారు.

మహిళావస్తాదులు పతకాలు సాధించి దేశానికి తిరిగి వచ్చిన సమయంలో వారితో ఫోటోలు దిగటానికి, వారి ప్రక్కన నిలబడి ప్రచారం పొందటానికి మక్కువ చూపే ప్రధాని ..వారి గోడును వినటానికి ఏమాత్రం ఆసక్తి చూపకపోడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజీలేని పోరాటం చేస్తున్న వస్తాదులు మాత్రం..ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల పైన తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు మాత్రమే తమకు న్యాయం చేయగలదని గట్టిగా నమ్ముతున్నారు. ఈ వివాదానికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముగింపు పడుతుందన్నదే ఇప్పుడు జవాబు లేని ప్రశ్నగా ఉంది.

First Published:  3 Jun 2023 8:20 AM GMT
Next Story