Telugu Global
Sports

బ్రిజ్ భూషణ్ పైన బలహీనమైన సెక్షన్ల కింద కేసులా ?

జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై నమోదైన లైంగిక వేధింపుల కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్ర్రాలకు చెందిన 125 మంది సాక్షులను ఢిల్లీ పోలీసులు విచారించారు.

బ్రిజ్ భూషణ్ పైన బలహీనమైన సెక్షన్ల కింద కేసులా ?
X

జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై నమోదైన లైంగిక వేధింపుల కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్ర్రాలకు చెందిన 125 మంది సాక్షులను ఢిల్లీ పోలీసులు విచారించారు.

దేశాన్నిగత కొద్దిరోజులుగా కుదిపేస్తున్న జాతీయ మహిళా వస్తాదుల నిరసనదీక్ష రోజురోజుకూ ఉధృతమవుతోంది. కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు, బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నమోదైన లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

ఢిల్లీపోలీసులు, ప్రభుత్వం నియమించిన విచారణ సంఘాల దర్యాప్తులపైన తమకు నమ్మకం లేదంటూ నిరసనకు దిగిన వస్తాదుల బృందం ఓ వైపు తెగేసి చెబుతుంటే..మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు తమ విచారణను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

నాలుగు రాష్ట్ర్రాల వ్యక్తులతో దర్యాప్తు...

మొత్తం ఏడుగురు మహిళా వస్తాదులను కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించినట్లుగా రెండు వేర్వేరు కేసుల్ని ఢిల్లీ పోలీసులు గత 21నే నమోదు చేశారు.

ఓ మైనర్ రెజ్లర్ ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద ఓ కేసును, మరో ఆరుగులు మేజర్ వస్తాదుల ఫిర్యాదుతో మరో కేసును న్యూఢిల్లీ కానాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి విచారణకు శ్రీకారం చుట్టారు.

జాతీయ కుస్తీ సమాఖ్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు కలిగిన మొత్తం 125 మంది వ్యక్తులను తమ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు విచారించారు.

ఈ 125 మందిలో ఓ ఒలింపియన్, ఓ కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, ఓ ఇంటర్నేషనల్ రిఫరీ, ఓ రాష్ట్ర్ర్రస్థాయి కోచ్ సైతం ఉన్నారు. వీరందరి నుంచి సేకరించిన సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు రిజిష్టర్ చేశారు.

బెదిరింపులు, ప్రలోభాలతో లొంగదీసుకొనే ప్రయత్నం...

ఉత్తర ప్రదేశ్ లోని కేసరి గంజ్ నియోజక వర్గం నుంచి బీజెపీ టికెట్ పై ఎంపీగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్..గత కొద్దిసంవత్సరాలుగా జాతీయకుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.

కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ తిరుగులేని అధికారం చెలాయించిన సమయంలో మహిళావస్తాదుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలువెల్లువెత్తాయి.

2010 నుంచి 2020 సంవత్సరాల మధ్యకాలంలో భారత మహిళా వస్తాదులతో విదేశాలతో పాటు..స్వదేశంలోనూ బ్రిజ్ భూషణ్ అనుచితంగా ప్రవర్తించినట్లు, లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు సైతం ఉన్నాయి.

మహిళా వస్తాదుల పట్ల ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం, తన సొంత సొత్తుగా భావించడం, తనకుతానే చనువు తీసుకొని వారి భుజాలు, పొత్తికడుపు భాగంలో చేతులు వేయటం, చాతీభాగాలపైన చేతులు వేసి మాట్లాడటం బ్రిజ్ భూషణ్ కు మామూలేనని కుస్తీ వర్గాలు అంటున్నాయి. తనకు సహకరించని, అనుకూలంగా ఉండని మహిళా రెజ్లర్ల కెరియర్ లను నాశనం చేస్తానని బెదిరించడం లాంటి ఫిర్యాదులు సైతం ఉన్నాయి.

తన కోరిక తీరిస్తే కావాల్సినవన్నీ ఇస్తానని ఓ మహిళా రెజ్లర్ ను ప్రలోభపెట్టిన బ్రిజ్ భూషన్..మరో వస్తాదును తీవ్రస్థాయిలో బెదిరించాడు. తనకు అనుకూలంగా ఉండకపోతే..తీవ్రపరిణామాలు ఎదుర్కొనక తప్పదని, కెరియర్ నాశనం చేస్తానంటూ భయపెట్టడం ద్వారా లొంగదీసుకోడానికి ప్రయత్నించినట్లు కేసు నమోదయ్యాయి.

కేసులంటే లెక్కలేని బ్రిజ్ భూషణ్..

తూర్పు ఉత్తరప్రదేశ్ లోని రాజ్ పుట్ వర్గాల ఓటర్లలో విపరీతమైన పలుకుబడి కలిగిన బ్రిజ్ భూషణ్ పై ప్రస్తుత రెండు ఎఫ్ఐఆర్ లకు ముందే ఓ మర్డర్ కేసుతో సహా మొత్తం 40 వరకూ ఎఫ్ఐఆర్ లు నమోదై ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశించే వరకూ బ్రిజ్ భూషణ్ పై కేసులు నమోదు చేయటానికి ఢిల్లీ పోలీసులు తటపటాయిస్తూ వచ్చారు.

ఇద్దరు రెజ్లర్లను లొంగదీసుకోడానికి ప్రలోభాలు ఎరవేయటం, కెరియర్ పరంగా అన్ని విధాల అండగా ఉంటానంటూ 15సార్లు చెప్పడం, మొత్తం ఏడుగురు రెజ్లర్లను 10 వేర్వేరు సందర్భాలలో తడమటం, తాకటం, భుజాలు, పొత్తికడుపు,చాతీభాగాలపైన చేతులు వేసి నొక్కినట్లుగా, అనుచితంగా ప్రవర్తించినట్లుగా ఫిర్యాదులను నమోదు చేశారు.

బ్రిజ్ భూషణ్ పై విచారణ కోసం సిట్ ను ఏర్పాటు చేసి..ముమ్మరంగా విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ ముగిసిన అనంతరం సిట్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది.

మొత్తం 158 మంది పేర్లతో జాబితాను తయారు చేసుకొన్న ప్రత్యేక విచారణ సంఘం ఇప్పటికే 125మంది వాంగ్మూలాన్ని నమోదు చేసింది.

రెండుసార్లు బ్రిజ్ భూషణ్ విచారణ...

ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విచారణ దళం ఇప్పటికే రెండుమార్లు నిందితుడు బ్రిజ్ భూషణ్ ను ప్రశ్నించింది. రెండుకు రెండుసార్లూ...తనకు ఏపాపం తెలియదని, తాను ఏ తప్పు చేయలేదని, తనపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజమని తేలినా ఉరేసుకొంటానంటూ బ్రిజ్ భూషణ్ హంగామా చేస్తున్నారు. అదేమంటే..మహిళా వస్తాదులు తనకు సొంత కుమార్తెలు లాంటి వారంటూ చెప్పటం కొసమెరుపు.

కుస్తీ సమాఖ్య కార్యదర్శి వినోద్ తోమర్ ను సైతం సిట్ ప్రశ్నించింది.

ఆరోపణలు చేసిన ఆరుగురు మేజర్, ఓ మైనర్ రైజ్లర్ల ను సైతం 4 గంటలపాటు విచారించి..మాజిస్ట్ర్రేట్ సమక్షంలో సెక్షన్ 164 కింద కేసును నమోదు చేశారు,

బ్రిజ్ భూషణ్ పై కేసు పెట్టిన విశ్వవిఖ్యాత వస్తాదులలో వినేశ్ పోగట్, సాక్షి మాలిక్ సైతం ఉన్నారు.

బ్రిజ్ భూషణ్ పై ఐపీసీ 354, 354-ఏ, 354-డీ, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ సెక్షన్ల ప్రకారం దోషిగా తేలితో గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే పడనుంది.

మహిళారెజ్లర్ల అసంతృప్తి..

తమను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ పైన ఢిల్లీ పోలీసులు బలహీనమైన సెక్షన్ల కింద మాత్రమే కేసులు నమోదు చేశారని, వీటిని వీగిపోయేలా చేయటానికి

ప్రయత్నిస్తున్నారంటూ మహిళా రెజ్లర్లు మండిపడుతున్నారు. ఢిల్లీ పోలీసుల విచారణతో తమకు న్యాయం జరగదని, తమకు న్యాయం చేయాల్సింది సుప్రీంకోర్టు మాత్రమేనని అంటున్నారు..

First Published:  4 Jun 2023 8:58 AM GMT
Next Story