Telugu Global
Sports

ప్రపంచకప్ నాకౌట్ రౌండ్లో బ్రెజిల్, పోర్చుగల్, ఫ్రాన్స్

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ నాకౌట్ రౌండ్ కు టాప్ ర్యాంక్ జట్లు బ్రెజిల్, ఫ్రాన్స్, పోర్చుగల్ అలవోకగా చేరుకొన్నాయి. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాదించిన తొలిమూడుజట్లుగా నిలిచాయి.

ప్రపంచకప్ నాకౌట్ రౌండ్లో బ్రెజిల్, పోర్చుగల్, ఫ్రాన్స్
X

ప్రపంచకప్ నాకౌట్ రౌండ్లో బ్రెజిల్, పోర్చుగల్, ఫ్రాన్స్

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ నాకౌట్ రౌండ్ కు టాప్ ర్యాంక్ జట్లు బ్రెజిల్, ఫ్రాన్స్, పోర్చుగల్ అలవోకగా చేరుకొన్నాయి. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాదించిన తొలిమూడుజట్లుగా నిలిచాయి...

ఖతర్ వేదికగా జరుగుతున్న 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ గ్రూప్ లీగ్ లో టాప్ ర్యాంక్ జట్ల జోరు టాప్ గేర్ లో సాగిపోతోంది. ప్రపంచ నంబర్ వన్ బ్రెజిల్, డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, హాట్ ఫేవరెట్లలో ఒకటైన పోర్చుగల్ తమ తమ గ్రూపుల్లో వరుసగా రెండో విజయం సాధించడం ద్వారా ప్రీ- క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరిన జట్లుగా నిలిచాయి.

స్విట్జర్లాండ్ కు బ్రెజిల్ కిక్..

దోహాలోని స్టేడియం 974 వేదికగా జరిగిన గ్రూపు రెండోరౌండ్ పోరులో ఐదుసార్లు విజేత బ్రెజిల్ గట్టి పోటీ ఎదుర్కొని 1-0 తో స్విట్జర్లాండ్ ను అధిగమించడం ద్వారా రెండో విజయంతో టాపర్ గా నిలిచింది.

బ్రెజిల్ ఆధిక్యంతో కొనసాగిన ఈ పోరులో స్విస్ గోల్ కీపర్, డిఫెండర్లు తుది వరకూ పోరాడటం ద్వారా స్కోరు చేయనివ్వకుండా అడ్డుకో గలిగారు. గోల్ కోసం బ్రెజిల్ చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగారు. అయితే ..ఆట మరో 7 నిముషాలలో ముగుస్తుందనగా..బ్రూనో గుమరాస్ అందించిన క్రాస్ ను కాసిమీరో గోలుగా మలచడం ద్వారా తనజట్టు విజయాన్ని ఖాయం చేయగలిగాడు.

ఈ విజయంతో మొత్తం 6 పాయింట్లు సాధించడం ద్వారా బ్రెజిల్ గ్రూపు టాపర్ గా నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది. ప్రీ- క్వార్టర్ చేరిన తొలిజట్టుగా డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ నిలిస్తే..రెండోజట్టుగా బ్రెజిల్ నిలిచింది.

సెర్బియాతో జరిగిన తొలిరౌండ్ పోరులో 2-0 గోల్స్ తో నెగ్గిన బ్రెజిల్ తన ఆఖరి రౌండ్ పోరులో కమెరూన్ తో తలపడాల్సి ఉంది.

పోర్చుగల్ కు ప్రీ- క్వార్టర్స్ బెర్త్...

గ్రూపులీగ్ మరో రెండోరౌండ్ పోరులో క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 2-0 గోల్స్ తో ప్రపంచ మాజీ చాంపియన్ ఉరుగ్వేను ఓడించడం ద్వారా నాకౌట్ రౌండ్ కు చేరుకొంది.

దోహాలోని లూసెయిల్ స్టేడియం వేదికగా జరిగిన పోటీలో బ్రూనో ఫెర్నాండేజ్ రెండు గోల్స్ సాధించడం ద్వారా తనజట్టును విజేతగా నిలిపాడు.

పెపీ ప్రపంచకప్ రికార్డు...

ఉరుగ్వేతో ముగిసిన రెండోరౌండ్ మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా పోర్చుగల్ వెటరన్ ఆటగాడు పెపీ ప్రపంచకప్ రికార్డుల్లో చేరాడు. 39 సంవత్సరాల వయసులో ప్రపంచకప్ మ్యాచ్ ఆడిన నాలుగో అత్యంత పెద్దవయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.

ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీల చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడి రికార్డు కామెరూన్ కు చెందిన రోజర్ మిల్లా పేరుతో ఉంది. 1994లో అమెరికా వేదికగా జరిగిన ప్రపంచకప్ టోర్నీలో రోజర్ మిల్లా 42 సంవత్సరాల లేటు వయసులో బరిలోకి దిగాడు.

ఈజిప్టు గోల్ కీపర్ ఇస్సామ్ ఎల్ హైదరీ 45 సంవత్సరాల వయసులో 2018 ప్రపంచకప్, కొలంబియా గోల్ కీపర్ ఫారిడ్ మాండ్రాగాన్ 43 సంవత్సరాల వయసులో బ్రెజిల్ వేదికగా జరిగిన 2014 ప్రపంచకప్ సాకర్ పోటీలలో పాల్గొనడం ద్వారా ఫుట్ బాల్ ఆడటానికి వయసుతో పనిలేదని చాటి చెప్పారు.

ఇతర గ్రూపు మ్యాచ్ ల్లో దక్షిణ కొరియాను ఘనా 3-2 గోల్స్ తో కంగు తినిపించగా...సెర్బియా- కమెరూన్ జట్ల పోటీ 3-3 గోల్స్ తో డ్రాగా ముగిసింది.

First Published:  29 Nov 2022 9:16 AM GMT
Next Story