Telugu Global
Sports

భారత చెఫ్- డి- మిషన్ పదవికి మేరీకోమ్ గుడ్ బై!

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్దివారాల ముందే భారత చెఫ్-డి-మిషన్ పదవికి బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ రాజీనామా చేసి సంచలనం సృష్టించింది.

భారత చెఫ్- డి- మిషన్ పదవికి మేరీకోమ్ గుడ్ బై!
X

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్దివారాల ముందే భారత చెఫ్-డి-మిషన్ పదవికి బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ రాజీనామా చేసి సంచలనం సృష్టించింది.

భారత ఒలింపిక్స్ లో మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ కథ ముగిసింది. సాంకేతిక అంశాల కారణంగా తన క్రీడాజీవితాన్ని అర్దంతరంగా ముగించిన మేరీకోమ్..

చివరకు పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందానికి నేతృత్వం వహించే చెఫ్- డి- మిషన్ పదవికి సైతం రాజీనామా చేసింది.

వ్యక్తిగత కారణాలతోనే....

భారత మహిళా బాక్సింగ్ కు రెండుదశాబ్దాలపాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంతో పాటు..ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచిన మేరీకోమ్ ఓ బాక్సర్ గా 2024 ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయినా..భారత ఒలింపిక్స్ సంఘం పెద్దమనసుతో మరో అవకాశం కల్పించింది.

మరి కొద్దివారాలలో పారిస్ వేదికగా ప్రారంభమయ్యే ఒలింపిక్స్ లో పాల్గొనే 250 మందికి పైగా భారత బృందానికి నేతృత్వం వహించే చెఫ్- డి- మిషన్ పదవికి సైతం అనూహ్యంగా రాజీనామా చేసింది.

చెఫ్- డి- మిషన్ పదవి నుంచి తాను వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నట్లు భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషకు సమాచారం పంపింది. భారత్ కు ఏ రూపంలోనైనా సేవ చేయటానికి తాను సిద్ధమని, పారిస్ ఒలింపిక్స్ చెఫ్- డి- మిషన్ పదవి బాధ్యతలు చేపట్టడానికి మానసికంగా సిద్ధమయ్యానని...అయితే కుటుంబబాధ్యతలు, వ్యక్తిగత కారణాలతో పదవికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు 41 సంవత్సరాల మేరీకోమ్ వివరించింది.

మార్చి 21న మేరీకోమ్ ను భారత చెఫ్- డి- మిషన్ పదవికి ఎంపిక చేసినట్లు జాతీయ ఒలింపిక్స్ సంఘం అధికారికంగా ప్రకటించింది. అయితే..మూడువారాలలో వ్యవధిలోనే తాను పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడం ద్వారా మేరీకోమ్ కలకలం రేపింది.

చెఫ్- డి- మిషన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మేరీకోమ్ పంపిన సమాచారాన్ని తాను గౌరవిస్తున్నామని, భారత క్రీడారంగానికి మేరీకోమ్ చేసిన సేవలు నిరుపమానమని పీటీ ఉష కొనియాడింది. జులై 26నుంచి ఆగస్టు 11 వరకూ పారిస్ వేదికగా 2024 ఒలింపిక్స్ జరుగనున్నాయి.

పాపం! మేరీ కోమ్......

ప్రపంచ బాక్సింగ్ లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన ' బంగారు బాక్సర్' మేరీకోమ్ క్రీడాజీవితం అర్థంతరంగా ముగియటం చర్చనీయాశంగా మారింది.

అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నిబంధనల పుణ్యమా అంటూ నాలుగు పదుల వయసు.. మేరీ పాలిట శాపంగా మారింది. ఎలాంటి హడావిడీ లేకుండా రెండుదశాబ్దాల బాక్సింగ్ జీవితం ముగిసిపోయింది...

రకరకాల ఆటలు, పలురకాల నిబంధనలు... ఓ వైపు టెన్నిస్, ఫుట్ బాల్, చదరంగం, బిలియర్డ్స్ లాంటి అంతర్జాతీయ క్రీడల్లో వయసుతో ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా నాలుగు పదుల వయసులోనూ పలువురు క్రీడాకారులు అబ్బురపరచే విజయాలు సాధిస్తుంటే...ప్రాణాంతక బాక్సింగ్ క్రీడలో మాత్రం పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది.

43 సంవత్సరాల లేటు వయసులో రోహన్ బొపన్న గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టైటిల్ తో పాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిస్తే...ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ మెడలిస్ట్ మేరీకోమ్ మాత్రం 41 సంవత్సరాల వయసులో.. అయిష్టంగానే బాక్సింగ్ కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది.

నిబంధనలతో మేరీ రిటైర్మెంట్!

అపారఅనుభవం, పట్టుదల, అంకితభావం కలిగిన మేరీ కోమ్ కు నాలుగు పదుల వయసులోనూ కెరియర్ ను కొనసాగించాలన్న ఆసక్తి ఉంది. అవకాశం ఇస్తే ఒలింపిక్స్ బరిలోకి దిగాలన్న పట్టుదల సైతం ఉంది. అయితే..అంతర్జాతీయ బాక్సింగ్ నిబంధనలు, నియమావళి ప్రకారం బాక్సర్ ఎంత గొప్పవారైనా..40వ పుట్టినరోజు తర్వాత రిటైర్ కాకతప్పదు. 40 ఏళ్ళ పైబడిన బాక్సర్లు పోటీలలో పాల్గొనటానికి అనుమతి లేదు. 39 సంవత్సరాల వయసు వరకే అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలలో కొనసాగే అవకాశం ఉంటుంది.

నాలుగు పదుల వయసులోనూ బాక్సర్ గా తన కెరియర్ కొనసాగించాలన్న ఆసక్తి ఉన్నా..నిబంధనల ప్రకారం తాను రిటైర్ కావాల్సిందేనని మేరీ కోమ్ వాపోయింది. తాను అధికారికంగా బాక్సింగ్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించకపోయినా..అంతర్జాతీయ బాక్సింగ్ నియమావళి ప్రకారం ఆటకు దూరమైనట్లేనని పరోక్షంగా ప్రకటించింది.

రెండున్నర దశాబ్దాల తన సుదీర్ఘ కెరియర్ లో మేరీ కోమ్ 2014 ఆసియాక్రీడల్లో భారత్ కు తొలి బంగారు పతకం సాధించిన తరువాత నుంచి మరి వెనుదిరిగి చూసింది లేదు.

ట్రాక్ అండ్ ఫీల్డ్ నుంచి బాక్సింగ్ కు....

ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్ లోని చురాచంద్ పూర్ జిల్లాలోని కాంగ్తీ గ్రామానికి చెందిన మేరీ కోమ్ కు బాల్యం నుంచి క్రీడలంటే ఎంతో మక్కువ. ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలైన 400 మీటర్ల పరుగు, జావలిన్ త్రో అంశాలలో మంచి అథ్లెట్ గా గుర్తింపు తెచ్చుకోవాలన్న పట్టుదల మేరీలో ఉండేది. అయితే...1988 బ్యాంకాక్ ఆసియాక్రీడల బాక్సింగ్ లో బంగారు పతకం సాధించిన మణిపూర్ బాక్సర్ డింకో సింగ్ స్ఫూర్తితో మేరీకోమ్ బాక్సింగ్ వైపు దృష్టి మళ్లించింది.

ఆడపిల్లలకు బాక్సింగ్ లాంటి మెరటు క్రీడ ఏంటా అంటూ అమ్మానాన్నలతో పాటు గ్రామస్థులూ నిరుత్సాహ పరచినా...మేరీకోమ్ తన సాధన కొనసాగించింది. జిల్లా , రాష్ట్రస్థాయిల్లో రాణించిన మేరీకోమ్...ఆ తర్వాత జాతీయస్థాయిలోనూ గుర్తింపు సంపాదించింది.

మేరీ' గోల్డ్' ను మరువ గలమా?

ప్రపంచ అమెచ్యూర్ మహిళా బాక్సింగ్ లో ఆరుసార్లు విశ్వవిజేతగా బంగారు పతకాలు సాధించిన ఘనత మేరీకోమ్ కు మాత్రమే దక్కుతుంది. వరుసగా ఏడు ప్రపంచకప్ పోటీల్లో ఆరు స్వర్ణాలు, ఓ రజత పతకం సాధించిన అరుదైన, అసాధారణ రికార్డు కూడా మేరీకోమ్ పేరుతోనే ఉంది.

కెరియర్ ప్రారంభంలో 45 కిలోలు, ఆ తర్వాత 46 కిలోల విభాగాలలో విశ్వవిజేతగా నిలిచిన మేరీ కోమ్ 48 కిలోల విభాగంలో అత్యుత్తమంగా రాణించింది.

ఆసియా మహిళా బాక్సింగ్ పోటీలలో సైతం ఐదు బంగారు పతకాలు గెలుచుకొన్న భారత ఏకైక బాక్సర్ మేరీ కోమ్ మాత్రమే.

2003, 2005 , 2010, 2012 ఆసియా పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన మేరీ కోమ్ 2008 ఆసియా బాక్సింగ్ పోటీలో మాత్రం రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

లండన్ ఒలింపిక్స్ లో కంచు మోత...

లండన్ వేదికగా జరిగిన 2012 ఒలింపిక్స్ లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా బాక్సింగ్ లో....మేరీ కోమ్ భారీ అంచనాలతో బరిలోకి దిగినా చివరకు కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

2010 గాంగ్జావో ఆసియా క్రీడల్లో కాంస్యం, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన మేరీ కోమ్....ఆ తర్వాత బాక్సింగ్ నుంచి విరామం తీసుకొంది. అప్పటికే ముగ్గురు బిడ్డల తల్లిగా ఓవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే...మూడేళ్లపాటు బాక్సింగ్ కు దూరమైన మేరీకోమ్...2016లో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యింది. అంతేకాదు భారత బాక్సింగ్ పరిశీలకురాలిగానూ బాధ్యతలు తీసుకొంది. ఇలా పలురకాల కారణాలతో బాక్సింగ్ కు దూరంగా ఉన్న మేరీ 40వ పడిలో పడిపోడంతో నిర్భంధ రిటైర్మెంట్ తీసుకోక తప్పలేదు.

ముగ్గురు బిడ్డల తల్లిగా,35 ఏళ్ళ వయసులో....

ముగ్గురు బిడ్డల తల్లిగా 2012 లండన్ ఒలింపిక్స్ బరిలోకి దిగిన మేరీ కోమ్ కాంస్య పతకం సాధించడం ద్వారా బాక్సర్ గా తన కెరియర్ ను పరిపూర్ణం చేసుకోగలిగింది.

ప్రపంచ మహిళాబాక్సింగ్ చరిత్రలో ఓ తల్లిహోదాలో మేరీకోమ్ సాధించినన్ని విజయాలు, పతకాలు మరే క్రీడాకారిణి సాధించలేదంటే అతిశయోక్తి కాదు.

ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ టోర్నీలలో పాల్గొని నాలుగు స్వర్ణ, ఓ రజతంతో సహా ఎనిమిది పతకాలు సాధించిన మేరీకోమ్ ముగ్గురు బిడ్డల తల్లిగా...35 ఏళ్ల వయసులో ప్రపంచ బాక్సింగ్ బంగారు పతకం సాధించి...భారత మహిళలకే గర్వకారణంగా నిలిచింది.

2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించిన మేరీ 2013లో తన మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత జరిగిన 2014 ఆసియాక్రీడలు,

2018 కామన్వెల్త్ గేమ్స్ పోటీలలో బంగారు పతకాలు గెలుచుకోడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. 2019 ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ టోర్నీలో కాంస్యం నెగ్గిన మేరీ 2020 టోక్యో ఒలింపిక్స్ లో సఫలం కాలేకపోయింది.

ఒకే ఒక్క మహిళ మేరీ కోమ్....

ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ లో మాత్రమే కాదు...ఆసియా బాక్సింగ్ లోనూ ఐదు బంగారు పతకాలు సాధించడం ద్వారా మేరీ గోల్డ్ గా నిలిచిపోయింది.

అంతేకాదు..2018 న్యూఢిల్లీ ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో సైతం మేరీకోమ్ ...మేరీగోల్డ్ గా నిలిచింది. ప్రపంచ మహిళా బాక్సింగ్ చరిత్రలోనే ఆరు ప్రపంచ స్వర్ణాలు, ఓ రజతంతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించిన ఏకైక..ఒకే ఒక్క బాక్సర్ గా రికార్డు నెలకొల్పింది.

అవార్డులే అవార్డులు....

2003లో అర్జున అవార్డు,2006లో పద్మశ్రీ, 2009లో దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2013లో పద్మభూషణ్ అవార్డులు పొందిన మేరీకోమ్...మణిపూర్ రాజధాని ఇంపాల్ లో ఓ బాక్సింగ్ అకాడమీని నిర్వహిస్తోంది.

ముగ్గురు బిడ్డల తల్లిగా, పార్లమెంట్ సభ్యురాలిగా, భారత బాక్సింగ్ పరిశీలకురాలిగా, అంతర్జాతీయ బాక్సర్ గా బహుముఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేరీ కోమ్ భారత మహిళలకే గర్వకారణంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుంది. 2022 ఏప్రిల్ 24వ వరకూ రాజ్యసభ సభ్యురాలిగా సేవలు అందించిన మేరీకోమ్ కు భారత, ఆసియా, ప్రపంచ మహిళా బాక్సింగ్ చరిత్రలో ప్రత్యేకస్థానమే ఉంటుంది.

ఓవైపున టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బొపన్న 43 సంవత్సరాల వయసులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ తో పాటు ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించడం ద్వారా ప్రతిభకు వయసు ఏమాత్రం అవరోధం కాదని చాటి చెబితే..మేరీ కోమ్ కు 40 ఏళ్ల వయసు నిబంధన అడ్డంకిగా మారటం దురదృష్టం కాక మరేమిటి.?

మేరీకోమ్ కెరియర్ మాత్రమే కాదు..భారత ఒలింపిక్స్ రంగానికి సేవలు చేసే చెఫ్- డి- మిషన్ పదవి సైతం అర్థంతరంగా ముగిసిపోడం విచిత్రమే మరి.

First Published:  13 April 2024 5:00 AM GMT
Next Story