Telugu Global
Sports

అహ్మదాబాద్ లో నేటినుంచే ఆఖరి పోరాటం!

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్, ఆస్ట్ర్రేలియాజట్ల మధ్య జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ ఆఖరి ఘట్టానికి చేరింది.

అహ్మదాబాద్ లో నేటినుంచే ఆఖరి పోరాటం!
X

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. అహ్మదాబాద్ వేదికగా నేటినుంచే జరిగే ఈ పోరులో టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా, రెండోర్యాంకర్ భారత్ విజయమే లక్ష్యంగా పోటీకి దిగుతున్నాయి...

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్, ఆస్ట్ర్రేలియాజట్ల మధ్య జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ ఆఖరి ఘట్టానికి చేరింది. సిరీస్ లోని మొదటి మూడు టెస్టులు ముగిసే సమయానికే 2-1 ఆధిక్యంతో ఆతిథ్య భారత్ ట్రోఫీని నిలబెట్టుకొన్నా..ఐసీసీ టెస్టులీగ్ ఫైనల్లో చోటు కోసం పోరాడాల్సి వస్తోంది.

నాగపూర్, న్యూఢిల్లీ వేదికలుగా ముగిసిన మొదటి రెండుటెస్టులను భారత్ మొదటి మూడురోజుల ఆటలోనే గెలుచుకొంటే..ఇండోర్ వేదికగా జరిగిన మూడోటెస్టును ఆస్ట్ర్రేలియా కేవలం రెండున్నర రోజుల ఆటలోనే నెగ్గి భారత్ ను కంగుతినిపించింది.

ముఖ్యఅతిధులుగా రండుదేశాల ప్రధానులు..

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మార్చి 9 నుంచి ఐదురోజులపాటు జరిగే ఆఖరి టెస్టు తొలిరోజు ఆటకు భారత్, ఆస్ట్ర్రేలియా దేశాల ప్రధానులు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు.

ఆస్ట్ర్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బెనీస్, భారత ప్రధాని నరేంద్ర మోడీల సమక్షంలో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. లక్షా32వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ స్టేడియం..

మరో సరికొత్త రికార్డు కోసం ఉరకలేస్తోంది.

ఇప్పటి వరకూ జరిగిన టెస్టుమ్యాచ్ లకు అత్యధికంగా 90వేల మంది హాజరుకాగా..ప్రస్తుత ఆఖరిటెస్టుకు లక్షవరకూ అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని

నిర్వాహక గుజరాత్ క్రికెట్ సంఘం భావిస్తోంది.

స్పిన్నర్లకు అనుకూలంగానే పిచ్...

ప్రస్తుత సిరీస్ లోని మొదటి మూడుటెస్టులకు సిద్ధం చేసిన పిచ్ లకు భిన్నంగా అహ్మదాబాద్ స్టేడియం వికెట్ ఉండనుంది. అహ్మదాబాద్ పిచ్ మొదటి రోజునుంచే స్పిన్ బౌలర్లకు అనుకూలించకపోయినా...ఆట మూడోరోజు నుంచి స్పిన్ తిరగటం ఖాయమని గ్రౌండ్ క్యూరేటర్ చెబుతున్నారు. పిచ్ ను పరిశీలించిన ఆస్ట్ర్రేలియా స్టాండ్ ఇన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సైతం అంటున్నాడు.

అహ్మదాబాద్ లో 38 డిగ్రీల ఎండవేడిమి వాతావరణం ఉండటంతో పిచ్ లోని తేమ ఆవిరైపోయి..బీటలు వారటం ఖాయమని, మూడోరోజు నుంచే రెండుజట్ల బ్యాటర్లకు

అసలు సిసలు సవాలు ఎదురుకానుందని భావిస్తున్నారు. మొదటి రెండురోజుల ఆటలో చక్కటి బౌన్స్ తో కూడిన పిచ్ పైన బ్యాటర్లు భారీగా పరుగులు సాధించే అవకాశం ఉంది.

టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని భారీస్కోరు సాధించడం ద్వారా మ్యాచ్ పై పట్టుబిగించే వ్యూహాన్ని అనుసరించడం ఖాయంగా కనిపిస్తోంది.

భారత్ కు భలే రికార్డు...

గత ఎనిమిది దశాబ్దాల కాలంలో ఈ రెండుజట్లు పలు టెస్టు సిరీస్ ల్లో భాగంగా 105సార్లు తలపడితే..ఆస్ట్ర్రేలియా 44 విజయాలు, భారత్ 32 విజయాల రికార్డుతో ఉన్నాయి. 28 టెస్టులు డ్రాగా ముగిస్తే..ఓ టెస్టు మ్యాచ్ టైగా రికార్డుల్లో చేరింది.

గత మూడుసిరీస్ ల్లో భారత్ టాప్..

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా భారత్ ఆడిన గత మూడుసిరీస్ ల్లో అజేయంగా నిలవడం ఓ అసాధారణ ఘనతగా మిగిలిపోతుంది. భారత్ వేదికగా జరిగిన 2016-17 సిరీస్ , ఆస్ట్ర్రేలియా గడ్డపైన జరిగిన 2018- 19 సిరీస్, కంగారూల్యాండ్ వేదికగానే ముగిసిన 2020-21 సిరీస్ ల్లో భారతజట్టే విజేతగా నిలిచింది. ప్రస్తుత 2023 సిరీస్ ను సైతం భారత్ 2-1 ఆధిక్యంతో నిలబెట్టుకోగలిగింది.

ఇక..నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆడిన టెస్టుమ్యాచ్ ల్లో భారత్ కు నూటికి నూరుశాతం విజయాల రికార్డు ఉంది.

ఇండోర్ టెస్టు విజయంతో ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో చోటును ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియా ఖాయం చేసుకోగా..రెండోర్యాంకర్ భారత్ ఫైనల్ బెర్త్ కు గెలుపు దూరంలో నిలిచింది. ప్రస్తుత ఆఖరి టెస్టులో విజయం సాధించినా...లేక మ్యాచ్ ను డ్రాగా ముగించినా భారత్ టెస్టు లీగ్ ఫైనల్ చేరుకోగలుగుతుంది.

భారతజట్టులో ఒకటి లేదా రండుమార్పులు?

ఇండోర్ టెస్టు ఓటమితో రగిలిపోతున్న భారత్ ఆరునూరైనా ఆఖరి టెస్టులో ఆస్ట్ర్రేలియాను దెబ్బకు దెబ్బ తీయాలన్న పట్టుదలతో ఉంది. తుదిజట్టులో ఒకటి లేదా రెండుమార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదనపు బ్యాటర్ కావాలంటే సూర్యకుమార్ యాదవ్ ను, అదనపు స్పిన్నర్ కావాలంటే..మహ్మద్ సిరాజ్ స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను చేర్చుకొనే అవకాశం లేకపోలేదు.

లోయర్ ఆర్డర్లో కీలక పరుగులు సాధిస్తున్న ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు అహ్మదాబాద్ హోంగ్రౌండ్ కావడం కూడా భారత్ కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. భారతజట్టు విజేతగా నిలవాలంటే..ఓపెనర్లు చక్కటి ఆరంభాన్ని ఇవ్వడంతో పాటు...ప్రధానంగా విరాట్ కొహ్లీ స్థాయికి తగ్గట్టుగా ఆడి భారీస్కోరు సాధించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

సీనియర్ ఓపెనర్ రాహుల్ ను పక్కనపెట్టి యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కు అవకాశం కల్పించినా సద్వినియోగం చేసుకోలేకపోడంతో..రాహుల్ కు తిరిగి ఓపెనర్ గా మరో అవకాశమిస్తారంటూ కూడా ప్రచారం జోరందుకొంది.

స్మిత్ సారథ్యంలోనే ఆస్ట్ర్రేలియా...

మొదటి రెండుటెస్టుల్లో కంగారూజట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్ పాట్ కమిన్స్..వ్యక్తిగత సమస్యలతో స్వదేశానికి వెళ్లిపోడంతో..స్టాప్ గ్యాప్ కెప్టెన్ గా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ బాధ్యతలు చేపట్టి...ఇండోర్ టెస్టులో తనజట్టుకు 9 వికెట్ల విజయం అందించాడు. ఆఖరిటెస్టులో సైతం అదే దూకుడు ప్రదర్శించాలన్న ధీమాతో ఉన్నాడు.

తమపైన ఒత్తిడి ఏమాత్రం లేదని, ఆతిథ్య భారతజట్టుపైనే తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని చెబుతున్నాడు.

ఫాస్ట్ బౌలర్ స్టార్క్, పేస్ ఆల్ రౌండర్ కమెరాన్ గ్రీన్ తుదిజట్టులో చేరడంతో ఆస్ట్ర్రేలియాజట్టుకు మొదటి రెండుటెస్టుల్లో లేని సమతౌల్యం చేకూరింది. స్పిన్నర్ల త్రయం లయన్, మర్ఫీ, కున్ మాన్ లతోనే మరోసారి భారత టాపార్డర్ పనిపట్టాలన్న పట్టుదలతో కంగారూజట్టు ఉంది.

గురువారం ఉదయం 9-30 గంటలకు ప్రారంభంకానున్న ఈమ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు ను సగం మ్యాచ్ నెగ్గినట్లుగానే భావించాలి. మ్యాచ్ ఐదురోజులపాటు భారీస్కోర్లతో సాగుతుందా? లేక లోస్కోర్లతో మూడురోజుల ముచ్చటగా ముగిసిపోతుందా? వేచి చూడాల్సిందే.

First Published:  9 March 2023 2:30 AM GMT
Next Story