Telugu Global
Sports

బీసీసీఐకి డబ్బే డబ్బు..ఐసీసీ ఆదాయం నుంచి భారీగా వాటా!

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు ..బీసీసీఐ ( భారత క్రికెట్ నియంత్రణ మండలి ) రొట్టె విరిగి నేతిలో పడింది.

బీసీసీఐకి డబ్బే డబ్బు..ఐసీసీ ఆదాయం నుంచి భారీగా వాటా!
X

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు ..బీసీసీఐ ( భారత క్రికెట్ నియంత్రణ మండలి ) రొట్టె విరిగి నేతిలో పడింది. ఇప్పటికే ఐపీఎల్ ద్వారా వేలకోట్ల రూపాయల ఆదాయం ఆర్జించిన బీసీసీఐకి వచ్చే ఐదేళ్లకాలానికి ఐసీసీ ( అంతర్జాతీయ క్రికెట్ మండలి ) రాబడి నుంచి వాటాగా భారీమొత్తం అందనుంది.

అతిపెద్ద క్రికెట్ మార్కెట్ భారత్...

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్ ఏదంటే భారత్ అన్నమాటే జవాబుగా వస్తుంది. జనాభాపరంగా 130 కోట్ల మందికి పైగా జనాభాతో.. భారీసంఖ్యలో క్రికెట్ అభిమానులున్నఏకైక దేశం భారత్ మాత్రమే.

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయంటే చాలు వెర్రి అభిమానులతో స్టేడియాలు కిటకిటలాడిపోడం సర్వసాధారణం. ఐపీఎల్ రాకతో అదికాస్త అంతై ఇంతై అంతింతై అన్నట్లుగా పెరిగిపోయింది.

లక్షా 13వేల మంది అభిమానులు కూర్చొని మ్యాచ్ ను వీక్షించే అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియం, లక్షమంది వరకూ కూర్చొని మ్యాచ్ లు చూసే కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం భారత్ లోనే ఉన్నాయి.

ప్రపంచీకరణతో .....

ప్రపంచీకరణ పుణ్యమా అంటూ భారతలో క్రికెట్ మార్కెట్ పరిథి మరింత విస్తరించింది. ఏటా జరిగే ఐపీఎల్ తో పాటు ఐసీసీ నిర్వహించే వేర్వేరు ప్రపంచ క్రికెట్ పోటీలలో ఎక్కువ భాగం భారత్ వేదికగానే జరగడం పరిపాటిగా మారింది.

అంతేకాదు..ఐసీసీకి సభ్యదేశాల నుంచి వివిధ రూపాలలో వచ్చే ఆదాయంలో 80 శాతం భారత్ నుంచే వస్తుందంటే ఆశ్చర్యం లేదు. దీంతో అధిక ఆదాయం అందిస్తున్న భారత్ కు అదేస్థాయిలో..ఐసీసీ రాబడి నుంచి వాటాగా అందుతోంది.

2018 నుంచి 2022 వరకూ గల ఐదుసంవత్సరాల కాలంలో ఐసీసీ నుంచి ఏడాదికి 81 మిలియన్ డాలర్లు చొప్పున బీసీసీఐ అందుకొంటూ వచ్చింది. ఐసీసీ మొత్తం రాబడిలో భారత క్రికెట్ బోర్డు అత్యంత ఎక్కువగా 26 శాతం తన వాటాగా ( 405 మిలియన్ డాలర్లు ) అందుకొంది.

భారత్ తర్వాత ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 6.89 శాతం, క్రికెట్ ఆస్ట్ర్రేలియా 6.25 శాతం, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 5.75 శాతం మొత్తాన్ని అందుకొంటూ వచ్చాయి.

38.50 శాతానికి పెరగనున్న భారత్ వాటా!

గత ఐదేళ్ల కాలంలో 26 శాతం వాటాగా ఐసీసీ నుంచి అందుకొన్న బీసీసీఐ వాటా...వచ్చే ఐదేళ్ల ( 2023- 2027 ) కాలానికి 38.50కు పెరగనుంది. ఐసీసీ రాబడి వచ్చే ఐదుసంవత్సరాలలో 600 మిలియన్ డాలర్లు కాగా..231 మిలియన్ డాలర్లను భారత్ తన వాటాగా అందుకోనుంది. మన రూపాయిల్లో చూస్తే 900 కోట్ల వరకూ ఉండనుంది.

క్రికెట్ ర్యాంకింగ్స్, ఐసీసీ టోర్నీలలో సాధించిన విజయాలు, వాణిజ్య ప్రకటనల ద్వారా సమకూరే ఆదాయం ప్రాతిపదికన వివిధ దేశాల వాటాను ఐసీసీ ఖరారు చేయనుంది.

ఐసీసీ నుంచి తనవాటాగా అందే ఆదాయాన్ని దాదాపుగా మూడురెట్లు ఎక్కువగా అందుకొనే విధంగా బీసీసీఐ బృందం ఐసీసీతో మంతనాలు జరిపి వచ్చింది.

ఐసీసీకి అనుబంధంగా ఉన్న నేపాల్, మలేసియా పలు దేశాల క్రికెట్ బోర్డులకు తన రాబడి నుంచి 11 శాతాన్ని కేటాయించింది.

మొత్తం మీద చూస్తే...ఐసీసీ ప్రధాన ఆదాయవనరుగా ఉన్న భారత్ కు రాబడిలో సింహభాగం కేటాయించడం సహజమే మరి.

First Published:  12 May 2023 11:23 AM GMT
Next Story