Telugu Global
Sports

బీసీసీఐకి నిధుల వరద!

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి నిధుల వరద వచ్చి పడనుంది. బీసీసీఐ వాటా మరింతగా పెరిగింది.

బీసీసీఐకి నిధుల వరద!
X

బీసీసీఐకి నిధుల వరద!

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి నిధుల వరద వచ్చి పడనుంది. బీసీసీఐ వాటా మరింతగా పెరిగింది...

క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐ నిధులు, రాబడి అంతైఇంతై అంతింతై అన్నట్లుగా పెరిగిపోతున్నాయి. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా ముగిసిన ఐసీసీ సర్వసభ్య సమావేశంలో భారత వాటాను పెంచుతూ కొత్త రెవెన్యూ విధానానికి ఆమోదం లభించింది. దీంతో ఇప్పటి వరకు ఐసీసీ ఆదాయంలో 22.4 శాతం మాత్రమే వాటా దక్కించుకొంటూ వచ్చిన బీసీసీఐ పోరాటం ఫలించి..వాటా శాతం22.4 నుంచి 38.5కి పెరిగింది.

ఐసీసీ రాబడిలో 80 శాతం భారత్ నుంచే....

అలనాటి బ్రిటీష్ పాలిత దేశాలకే పరిమితమైన క్రికెట్ కు ఇంగ్లండ్ పుట్టినిల్లుగా ఉంటే.....భారత్ ధనాగారంగా ఉంటూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి కోసం ఏర్పాటైన ఐసీసీకి అందే నిధులు, రాబడిలో 80 శాతం భారత క్రికెట్ మార్కెట్ నుంచే అందుతోంది.

మిగిలిన 20 శాతం ఆదాయం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే దేశాల నుంచి అందుతోంది. ఈ పరిస్థితిని క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డులతో కలసి భారత క్రికెట్ బోర్డు తనకు అనుకూలంగా మలచుకొంది. 'బిగ్ త్రీ' ఫార్ములాను ముందుకు తెచ్చింది. తమదేశంలోని క్రికెట్ మార్కెట్ నుంచి 80 శాతం ఆదాయం వస్తున్న కారణంగా...తమ వాటాగా సింహభాగం అందితీరాలని గతంలోనే బీసీసీఐ పట్టుబట్టి 40 శాతానికి పైగా వాటా పెంచుకోగలిగింది. ఐసీసీ నుంచి తన వాటాగా అందుతున్న వందల కోట్ల రూపాయల నిధులతోనే...దేశంలోని వివిధ వేదికల్లో మౌలిక సదుపాయాలను ప్రపంచ ప్రమాణాలతో తీర్చిదిద్దటం, మొన్నటి, నిన్నటి, నేటి తరం క్రికెటర్ల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం చేస్తూ వచ్చింది.

బిగ్ త్రీ ఫార్ములా ప్రకారం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులకు అధికశాతం వాటాగా అందితే...మిగిలిన మొత్తాన్ని మిగిలిన ఏడుదేశాలు తమ మార్కెట్ విలువను బట్టి పంచుకొంటూ వస్తున్నాయి.

ఐసీసీ మొత్తం రాబడిలో 6.89 శాతాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, 6.25 శాతాన్ని క్రికెట్ ఆస్ట్ర్రేలియా, 5.75 శాతాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అందుకొంటున్నాయి.

భారత్ వాటా 22.4 శాతం నుంచి 38.5 శాతానికి...

ఐసీసీ సర్వసభ్యసమావేశం ఆమోదించిన సరికొత్త రెవెన్యూ మోడల్ ప్రకారం బీసీసీఐ వాటా గణనీయంగా పెరగనుంది. ఇప్పటి వరకూ 80 శాతం ఆదాయాన్ని ఐసీసీకి అందిస్తూ తన వాటాగా 22.5 శాతం మాత్రమే పంచుకొంటూ వచ్చిన బీసీసీఐ..ఇక నుంచి 38.5 శాతం మొత్తాన్ని అందుకోనుంది. దీంతో రానున్న మూడేళ్లకాలం ఏడాదికి సుమారు రూ. 2 వేల కోట్లు (231 మిలియన్‌ డాలర్లు) చొప్పున బీసీసీఐకి దక్కనుంది.

ఐపీఎల్ తో డబ్బే డబ్బు...

బీసీసీఐని ఓ వైపు నుంచి ఐసీసీ నిధుల వరద వచ్చి ముంచెత్తుతుంటే..మరోవైపు ఐపీఎల్ ద్వారా నిధుల సునామీని సృష్టిస్తోంది. వచ్చే ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి ఏకంగా 48వేల390 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. మీడియా హక్కుల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులో సగభాగాన్ని ఎనిమిది ప్రధాన ప్రాంచైజీలకు పంచనున్నారు. బీసీసీఐ లెక్కల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ 3వేల కోట్ల రూపాయల చొప్పున అందుకోనుంది. కొత్తగా చేరిన గుజరాత్, లక్నో ఫ్రాంచైజీలకు ప్రస్తుతానికి ఏమీ దక్కదు. మిగతా సగం 24వేల 195 కోట్ల లో 26 శాతం మొత్తాన్ని దేశవాళీ, అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు బోర్డుకు అనుబంధంగా ఉన్న క్రికెట్ సంఘాలకు పంచనున్నారు.

మిగతా 74 శాతంలో 4 శాతాన్ని బీసీసీఐ సిబ్బంది జీతాలకు వెచ్చిస్తారు. మిగతా 70 శాతం మొత్తాన్ని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అసోసియేషన్లకు అందిస్తామని బీసీసీఐ చెబుతోంది. ఈ లెక్కన మొత్తం రూ.6,290 కోట్లను దేశవాళీ, అంతర్జాతీయ ఆటగాళ్లకు అందిస్తారు. మిగతా రూ.16,936 కోట్లను బీసీసీఐ అనుబంధ రాష్ట్ర సంఘాలకు పంచనున్నారు. భారత ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో 500 కోట్ల రూపాయల ఆదాయం కేవలం 52 రోజుల ఐపీఎల్ నుంచే సమకూరుతోంది.

వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలకమండలి హయాంలో 3వేల కోట్ల రూపాయలుగా ఉన్న బీసీసీఐ ఆదాయం ..ఆ తర్వాత సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత 9వేల కోట్ల రూపాయలు చేరింది. ఆ మొత్తాన్ని రోజర్ బిన్నీ- జే షాల నేతృత్వంలోని బీసీసీఐ మరింతగా పెంచింది.

నిధుల పరంగా ప్రస్తుతం భారత క్రికెట్లో స్వర్ణయుగం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  21 July 2023 8:24 AM GMT
Next Story