Telugu Global
Sports

కేంద్రం కనికరించకుంటే బీసీసీఐకి భారీనష్టం!

ఐసీసీ ప్రసారహక్కుల ద్వారా సమకూరే ఆదాయంపై భారత ప్రభుత్వం 21.84 శాతం పన్ను విధిస్తే..ఆ మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించాల్సిన ఆదాయం నుంచి ఐసీసీ మినహాయించుకోనుంది.

కేంద్రం కనికరించకుంటే బీసీసీఐకి భారీనష్టం!
X

భారత ప్రభుత్వ పన్నుల విధానం బీసీసీఐకి సంకటంగా మారింది. వచ్చే ఏడాది భారత్ వేదికగా నిర్వహించనున్న వన్డే ప్రపంచకప్ కు కేంద్రప్రభుత్వం పన్నుల మినహాయింపు ఇవ్వకుంటే వందలకోట్ల రూపాయల మేర నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది...

భారత్ లో క్రికెట్టే మతం. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయంటే చాలు స్టేడియాలు కిటకిటలాడటం, నిర్వాహసంఘాలకు కనకవర్షం కురియటం సాధారణ విషయమే.

అంతర్జాతీయ క్రికెట్లో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత్ నే వేదికగా చేసుకొని అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసీసీ) తన వ్యాపారకార్యకలాపాలు కొనసాగిస్తూ వేలకోట్ల రూపాయలు ఆర్జిస్తోంది.

అడకత్తెరలో పోకచెక్కలా బీసీసీఐ..

ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ దేశంలో ప్రపంచ క్రికెట్ టోర్నీలు నిర్వహించాలంటే అక్కడి ప్రభుత్వాలు పన్నులో మినహాయింపు ఇచ్చితీరాలి. ఆయా టోర్నీల నిర్వహణ ద్వారా ఐసీసీకి సమకూరే ఆదాయానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వక తప్పదు. ఎందుకంటే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీల నిర్వహణ ద్వారా ఆతిథ్యదేశాలకు వివిధ రూపాలలో వందలకోట్ల రూపాయలు ఆదాయం సమకూరనుంది.

అయితే...భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం..క్రికెట్ ఓ అంతర్జాతీయ వ్యాపారం. క్రికెట్ టోర్నీల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయానికి పన్నుల రూపంలో ఏవిధమైన మినహాయింపూ ఉండదు. భారత్ వేదికగా నిర్వహించే వివిధ ప్రపంచ క్రికెట్ టోర్నీల ద్వారా జరిగే ఆర్థిక కార్యకలాపాలు, సమకూరే ఆదాయం పై 21.84 శాతం టాక్స్ ను విధిస్తున్నారు. ప్రధానంగా ఐసీసీ ప్రసారహక్కుల ద్వారా సమకూరే ఆదాయం పైనే పన్ను విధించడం బీసీసీఐకి ఇబ్బంది కరంగా మారింది.

మినహాయింపు లేకుంటే బీసీసీఐ నుంచే వసూలు...

2023 అక్టోబర్- నవంబర్ మాసాలలో భారత్ ఆతిథ్యంలో జరిగే వన్డే ప్రపంచకప్ కు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వకుంటే బీసీసీఐ 955 కోట్ల రూపాయల మేర నష్టపోనుంది.

ఐసీసీ ప్రసారహక్కుల ద్వారా సమకూరే ఆదాయంపై భారత ప్రభుత్వం 21.84 శాతం పన్ను విధిస్తే..ఆ మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించాల్సిన ఆదాయం నుంచి ఐసీసీ మినహాయించుకోనుంది.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ప్రతినిధులు ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలు పెట్టారు.

2016 లోనే 193 కోట్ల నష్టం...

భారత్ వేదికగా 2016లో నిర్వహించిన ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వకపోడంతో..భారత్ కు రావాల్సిన వాటా నుంచి ఐసీసీ 193 కోట్ల రూపాయలు మినహాయించుకొంది.

ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ముందు జాగ్రత్తగా కేంద్రప్రభుత్వంతో చర్చలు ప్రారంభించింది. బీసీసీఐ కార్యదర్శిగా కేంద్రహోం మంత్రి కుమారుడు జే షా చక్రం తిప్పుతున్న కారణంగా పన్ను మినహాయింపు లభిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మొత్తం 21.84 శాతం మేర పన్ను మినహాయింపు ఇవ్వకపోయినా..అందులో కనీసం 10 శాతం తగ్గించినా చాలునని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు..2023 ప్రపంచకప్ నిర్వహణ ద్వారా ఐసీసీకి లభించే ప్రసారహక్కుల ఆదాయం పై 20 శాతం పన్ను మినహాయింపు ఇవ్వటానికి భారత ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ భారత ప్రభుత్వం 10 శాతం మేరకే పన్ను మినహాయింపు ఇచ్చే పక్షంలో 430 కోట్ల రూపాయల మేర నష్టపోవాల్సి ఉంది.

2016 నుంచి 2023 మధ్యకాలంలో ఐసీసీ మొత్తం రాబడి నుంచి బీసీసీఐ వాటాగా 3వేల 336 కోట్ల రూపాయలు దక్కనుంది. 2023 ప్రపంచకప్ ప్రసారహక్కుల ద్వారా ఐసీసీకి 4వేల 400 కోట్ల రూపాయల ఆదాయం రానుంది.

First Published:  16 Oct 2022 7:00 AM GMT
Next Story